close

బుధవారం, అక్టోబర్ 16, 2019

తాజా వార్తలు

డబ్బు కోసమే స్నేహితుడి హత్య

మిస్టరీ ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న గూడూరు డీఎస్పీ భూమన భవానీ శ్రీహర్ష

మనుబోలు, న్యూస్‌టుడే : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువకుడి మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బు కోసమే అతన్ని స్నేహితులు హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మనుబోలు ఠాణాలో శనివారం విలేకర్ల సమావేశంలో హత్యకు దారితీసిన పరిస్థితులను గూడూరు డీఎస్పీ భూమన భవానిశ్రీ హర్ష వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. వాకాడు మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన మల్లి గురుప్రసాద్‌ అపాచీ కంపెనీలో పనిచేస్తూ సూళ్లూరుపేటలో అద్దె గదిలో ఉంటున్నాడు. అతను అంతకుముందు గూడూరు నిమ్మ మార్కెట్‌లో హామాలీగా పనిచేశాడు. ఆ సమయంలో గూడూరులోని అడవయ్య కాలనీకి చెందిన మల్లి చెంచయ్య, ఉప్పలపాటి గురుప్రసాద్‌ స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలో మృతుడు గురుప్రసాద్‌కి రూ.కోటి నగదు దొరికిందని పుకారు వచ్చింది. ఇది తెలిసి స్నేహితులైన చెంచయ్య, గురుప్రసాద్‌ ఈ నగదును కాజేయాలని పథకం వేశారు. రౌడీషీటరు వేముల కనకారావు అలియాస్‌ రాజా సాయం తీసుకున్నారు. గత నెల 19న సూళ్లూరుపేటలో ఉంటున్న గురుప్రసాద్‌ వద్దకు వెళ్లారు. అమ్మాయిల వద్దకు పోదామని నమ్మించారు. అతన్ని టాటా ఏస్‌ ట్రక్కు ఆటోలో వరగలి అడ్డరోడ్డు సమీపంలోని పోటుపాలెం రోడ్డుకి తీసుకెళ్లి రూ.కోటి ఇవ్వాలంటూ బెదిరించారు. డబ్బులు దొరకలేదని, వదిలేయాలని ఎంత బతిమాలాడినా వినిపించుకోలేదు. జాకీరాడ్డుతో దాడి చేశారు. అక్కడి నుంచి జట్లకొండూరు వద్దకు తీసుకెళ్లి మరోమారు దాడి చేశారు. చొక్కా చించి మెడకు చుట్టి లాగి రహదారి పక్కనే ఉన్న నీటి గుంతలో పడేసి తలపై కాలుతో తొక్కి హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రౌడీషీటర్‌ వేముల రాజాని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. మిగతా ఇద్దరు నిందితులను తిప్పవరపాడు అడ్డరోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసుని ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన గూడూరు గ్రామీణ సీఐ రామకృష్ణారెడ్డి, చిల్లకూరు ఎస్సై హుస్సేన్‌బాషా, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఆదినారాయణ, రాజు, మాధవరాజుని ఆయన అభినందించి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో గూడూరు సీఐ రామకష్ణారెడ్డి, ఎస్సైలు సూర్యప్రకాష్‌రెడ్డి, హుస్సేన్‌బాషా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.