close

మంగళవారం, అక్టోబర్ 22, 2019

తాజా వార్తలు

పట్టిక.. పాటించక తప్పదిక!

 ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఇకపై ధరల ప్రదర్శన

 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే సిబ్బంది ఇంటికే టిక్కెట్లు ఇవ్వడంలేదు. పాస్‌లు చెల్లడంలేదు. ఇష్టానుసారం ఛార్జీల వసూలు.. ఇవీ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తిప్పుతున్న బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణలు. ఇలాంటి ఫిర్యాదులు రాకుండా రవాణాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. తక్షణ చర్యలకు ఉపక్రమించారు. గ్రేటర్‌ వ్యాప్తంగా తిరిగే ఆర్టీసీ అద్దె, ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్‌ ధరల పట్టికలు ప్రదర్శించనున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ వ్యాప్తంగా నిత్యం 3700 వరకు బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి. సమ్మెతో చాలా వరకు డిపోలకే పరిమితమయ్యాయి. పోలీసులు, ఆర్టీఏ అధికారులు, సిబ్బంది సాయంతో తాత్కాలికంగా కొన్ని ఆర్టీసీ సిటీ సర్వీసులను నడుపుతున్నారు. మరికొన్నింటిని అద్దెకు తీసుకొని తిప్పుతున్నారు. ఎక్కువ శాతం కొత్త సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. వీరిలో చాలామందికి నగర రూట్లపై అవగాహన లేదు. టిక్కెట్లు వసూలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రూ.5 టిక్కెట్టుకు బదులు రూ.10, రూ.10కి బదులు రూ.20 ఇలా ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. కొత్త వ్యక్తులు కండక్టర్లగా ఉన్న బస్సుల్లో ఈ తతంగం ఎక్కువగా నడుస్తోంది. దీనిపై రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి బస్సులో ధరల పట్టీ ఉండేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఒక్కో రూటులో స్టేజీ టు స్టేజీ వరకు ఎంతెంత టిక్కెట్‌ ధరలు ఉన్నాయో...వాటిని ప్రత్యేకంగా బస్సులోపల ముందు భాగంలో అతికిస్తారు. దానిపై అదనంగా ఒక్క పైసా వసూలు చేసినా...అలాంటి కండక్టర్లపై ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, పాత్రికేయులు తదితర కొన్ని వర్గాలు ప్రయాణం చేసేందుకు ఉచిత బస్సు పాసులు అందిస్తున్నారు. వీటిని అనుమతించడం లేదనే వార్తల నేపథ్యంలో అన్ని బస్సుల్లోనూ పాస్‌లను అనుమతించాలని బుధవారం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారు.

సిబ్బంది ఇబ్బంది పెడితే 100కు ఫోన్‌ చేయొచ్చు
ఆర్టీసీ, ఇతర అద్దె బస్సులకు డ్రైవర్లను విధుల్లోకి తీసుకునే ముందు డిపోల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజు ఈ పరీక్షలు చేస్తారు. మద్యంగా తాగినట్లు రుజువైతే వెంటనే సిబ్బందిని విధుల నుంచి తొలగించనున్నారు. ముందు రోజు తాగి తర్వాత రోజు ఉదయమే విధుల్లోకి వెళ్లినా డ్రంక్‌ డ్రైవ్‌లో దొరికిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా విధుల్లోకి వెళ్లే ముందు డిపో మేనేజరు ఆధ్వర్యంలో డ్రైవర్‌, కండక్టర్‌కు ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రయాణికులతో నడుచుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే పలు డిపోల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల తీరు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుండటంతో ఇలాంటి వాటిపైనా కన్నేయాలని భావించారు. ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే 100కు ఫోన్‌ చేసి వివరాలు తెలపాలని సూచించారు. విచారించి నిజమని తేలితే చర్యలు తప్పని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.