close

శుక్రవారం, నవంబర్ 15, 2019

తాజా వార్తలు

తప్పటడుగులు.. కన్నీటిసుడులు!

 చేయని తప్పునకు బలవుతున్న పసికూనలు
 అనాథలుగా మారుతున్న నవజాతశిశువులు
 బిడ్డలను విక్రయించేందుకు దళారుల రంగప్రవేశం
ఈనాడు, హైదరాబాద్‌

తప్పొప్పులు తెలియని పసితనం. అనాథలుగా బతుకుతున్నామని గుర్తించలేని అమాయకత్వం. అందరి మధ్య ఒంటరిగా గడిపే జీవితం. ఆకలేస్తే దిక్కులు చూడాలి. ఎవరైనా కనికరిస్తే కడుపునింపుకోవాలి. కాదంటే పస్తులుండాలి. ఐదారేళ్ల బుడతడు.. చూసేందుకు ముద్దుగా ఉన్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడనేది చెప్పడు. బిగ్గరగా మాట్లాడితే వణికిపోతాడు. కుటుంబ కక్షలతో ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్లారని అనుమానం. బిక్కు బిక్కుమంటున్న పిల్లాడిని చూస్తే కడుపుతరుక్కుపోతుందంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తన అనుభవాన్ని పంచుకున్నారు. గుర్తుతెలియని మహిళ నెలల చిన్నారిని అర్ధరాత్రి ఓ ఇంటి వద్ద వదిలేసి వెళ్లింది. బిడ్డ అరుపులు విన్న ఆ నివాస యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమేర సమాచారం సేకరించారు. బిడ్డ కావాలని అడిగిన వ్యక్తులు చివరి నిమిషంలో వద్దనడంతో సదరు మహిళ చిన్నారిని వదిలేసి వెళ్లి ఉండవచ్చని అంచనాకు వచ్చారు. తప్పెవరిదైనా పసికూనలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తరహా సంఘటనలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రేటర్‌ పరిధిలోనే అధికశాతం నమోదు కావటం గమనార్హం. అవాంచిత గర్భం, ఆడశిశువు, అనారోగ్యం, శిశువిక్రయాలు.. నాలుగు అంశాలకు మహానగరం కేంద్రం కావటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తగ్గించేందుకు గర్భిణుల సమాచారం.. వారి కదలికలపై నిఘా కూడా ఉంచుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.

అసలేం జరుగుతుందంటే..!
మారిన జీవనశైలి.. పెళ్లీడు వయసు పెరగటం.. శారీరకలోపం తదితర కారణాలతో అధికశాతం దంపతులు సంతానం పొందలేకపోతున్నారు. వైద్యపరమైన చికిత్సల తరువాత కూడా ఫలితం లేకపోవటంతో దత్తత వైపు మొగ్గుచూపుతున్నారు. అక్కడ కఠినమైన నిబంధనలు ఉండటం.. దరఖాస్తు చేసుకోవటం వంటి ప్రక్రియలు ఉండటంతో కొందరు అడ్డదారిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని అవకాశంగా చేసుకొని దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. గ్రామీణ, పట్టణాల్లో బస్తీలు, కాలనీల్లో గర్భిణుల వివరాలు సేకరిస్తుంటారు. వారిలో పేదరికం, అధిక సంతానం ఉన్న గర్భిణులను ఎంపిక చేసుకుని శిశువులను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎరగా వేస్తారు. రూ.50వేల నుంచి రూ.2.5లక్షల వరకూ ధర నిర్ణయిస్తారని సమాచారం. ముందుగా కొంతమేర డబ్బులు చెల్లించి ఒప్పందం కుదుర్చుకుంటారు. శిశువులను నగరానికి తీసుకువస్తారు. దళారులు తాము బిడ్డను ఎవరికి ఇస్తున్నామనే విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. కొన్ని సందర్భాల్లో శిశువును తీసుకువచ్చిన తరువాత బిడ్డ కావాలని కోరిన వ్యక్తులు డబ్బుల వద్ద పేచీపెట్టడమో, భయపడి వెనక్కి వెళ్లటమో చేస్తుంటారు. దాంతో శిశువులను వదిలేసి వెళ్తున్నట్టుగా సంక్షేమశాఖ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

తప్పొకరిది.. శిక్షొకరిది
కొన్ని సంఘటనల్లో అవాంఛిత గర్భధారణతో పుట్టినబిడ్డను వదిలించుకునేందుకు ప్రసవం కోసం నగరంలోని ప్రైవేటు ఆసుపత్రులకు చేర్చుతున్నారు. ప్రసవం అనంతరం బిడ్డను అనాథశ్రమాలకు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నవారూ ఉంటున్నారు. జీడిమెట్ల పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై తరచూ ఇటువంటి ఆరోపణలే వస్తున్నట్లు సమాచారం. తొలి సంతానం మగపిల్లాడు పుట్టాలనే నిబంధన, కాదంటే పుట్టింటికే పరిమితం కావాలంటూ అత్తింటివారి ఆంక్షలతో కూడా కొందరు తల్లులు మనసు చంపుకొని ఆడపిల్లలను వదిలేసి వెళ్తుంటారని ఓ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేశారు. సొంతూరిలో నిఘా ఉండటం, చుట్టుపక్కల వారికి తెలుస్తుందనే భయంతో బిడ్డలను వదిలించుకోవాలనుకునే  వారికి నగరం వేదికగా మారుతోంది. ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామున తమ పని ముగించుకుని ఎంచక్కా జారుకుంటున్నారు. పోలీసులకు, సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. గ్రేటర్‌ పరిధిలో ఏటా 800-1000 మంది శిశువులను ఇలా వదిలేసి వెళ్తుంటారు. వీరిలో కొందరికి శిశువిహార్‌లో సంరక్షణ కల్పిస్తున్నారు. 2016-17 : 450, 2017-18 : 474, 2018-10(సెప్టెంబరు) 600(సుమారు) నవజాత శిశువుల నుంచి.. ఐదారేళ్ల బాలబాలికల వరకూ నగరంలోని పలు ప్రాంతాల్లో వదిలేసి వెళ్లినట్టు గణాంకాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో దీనికి అడ్డుకట్ట వేసేందుకు సంక్షేమశాఖ, బాలకార్మిక నిర్మూలన సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతగా ప్రయత్నిస్తున్నా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోతున్నామంటూ ఓ అధికారి ఆందోళన వెలిబుచ్చారు. భవిష్యత్‌లో ఈ తరహా సంఘటనలు మరింతగా పెరిగే అవకాశాలున్నట్టు అనుమానం వ్యక్తం చేయటం గమనార్హం.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.