close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

దళారులు దొరికారు..

 కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై అనిశా ఆకస్మిక దాడి

 17 మంది నుంచి రూ.1.44 లక్షలు స్వాధీనం


తనిఖీలో లభ్యమైన నగదు, పత్రాలు పరిశీలిస్తున్న అనిశా డీఎస్పీ నాగభూషణం

 

కర్నూలు గాయత్రీ ఎస్టేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో కర్నూలు, కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మధ్యవర్తుల, దస్తావేజు లేఖరుల ప్రమేయం అధికంగా ఉన్న నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ నాగభూషణం, సీఐలు, సిబ్బంది సోమవారం స్థానిక కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. ఆ సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జూనియర్‌ సహాయకులు పద్మావతి, ఖాసిఫ్‌లు మాత్రమే ఉన్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ వనితాలక్ష్మీ, పలువురు ఉద్యోగులు జిల్లాపరిషత్‌లో జరిగిన దస్తావేజుల స్వీయ రచనకు సంబంధించిన అవగాహన సదస్సులో ఉన్నారు. అనిశా అధికారులు భవనం మొదటి అంతస్తులో ఉన్న కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం బయటవైపు ఉండే తలుపులను మూసి ఎక్కడివారిని అక్కడ కట్టడి చేశారు. పలువురు దస్తావేజు లేఖరులు వీరి రాక తెలిసి పరారయ్యారు. కార్యాలయంలో ఉన్న లేఖరులు, స్థిరాస్తి ఏజెంట్లను తనిఖీ చేసి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. 17 మంది నుంచి రూ.1,44,410 స్వాధీనం చేసుకుని పలు దస్త్రాలను, కంప్యూటర్లను నిశితంగా పరిశీలించారు. అనంతరం కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ చరవాణి స్విచ్ఛాఫ్‌ అని రావటంతో అనిశా కార్యాలయానికి రావాలని తాఖీదు జారీ చేసినట్లు తెలిసింది. దస్తావేజు లేఖరులను విచారించటంతో వారికి పలువురు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులతో ఉన్న సత్సంబంధాలు బయటపడినట్లు సమాచారం. పలువురికి మంత్రణం చేసి హెచ్చరికలు జారీ చేశారు. నగదు మొత్తాన్ని సీజ్‌ చేశామని, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ ఉద్యోగులు మధ్యవర్తుల ప్రమేయంతో చేస్తున్న అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక పంపి తగు చర్యలకు సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అవగాహన సదస్సుకు వెళ్లటంతో పలువురు అనిశా దాడి నుంచి తప్పించుకున్నట్లయింది. తనిఖీలో సీఐలు ఖాదర్‌బాష, గౌతమి పాల్గొన్నారు.

ఎవరి వద్ద ఎంతెంత?

● నాయకల్లు చంద్రశేఖర్‌(లేఖరి)- రూ.4700, బేస్త వేణుగోపాల్‌(లేఖరి)-రూ.4,000, పెరిక బలిజ శివన్న( లేఖరి)-రూ.4,300, షేక్‌ చిన్నషాలు(లేఖరి) రూ.510, బోయ రామకృష్ణ(లేఖరి) రూ.10,760, బేస్త చిన్నస్వామి(లేఖరి)- రూ.500, షేక్‌ అబ్దుల్లా(లేఖరి) రూ.13,250, వరకారి విజయ్‌(ఏజెంట్‌) రూ.5400, కురువ చంద్రశేఖర్‌(బిల్డర్‌) రూ.50,000, షేక్‌ అబ్దుల్‌ రహిమాన్‌(లేఖరి) రూ.6,010, గౌండా షఫుద్దీన్‌(సహాయ లేఖరి) రూ.4630, షేక్‌ అబ్దుల్‌ నబీబాష(సహాయ లేఖరి) రూ.2,600, షేక్‌ అబ్దుల్‌ కరీం(సహాయ లేఖరి) రూ.500, పింజారి అబ్దుల్‌ కుద్దూస్‌(సహాయ లేఖరి) రూ.1750, గుంటుపల్లి జయరాముడు(లేఖరి) రూ.950, షేక్‌షావలి(లేఖరి) రూ.22,250, నేసినేని వెంకటేశ్వర్లు(లేఖరి) రూ.12 వేలు.

అదనపు ఐజీ దృష్టికి

జిల్లాపరిషత్‌ కార్యాలయంలో అవగాహన సదస్సు జరుగుతున్న సమయంలో కల్లూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై అనిశా దాడి జరగటంతో విషయం స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌ శాఖ అదనపు ఐజీ ఉదయ్‌భాస్కర్‌రావు దృష్టికి వెళ్లింది. మద్దిలేటి అనే వ్యక్తి డబుల్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.