close

మంగళవారం, నవంబర్ 12, 2019

తాజా వార్తలు

దేవాదాయ శాఖలో.. సంస్కరణలకు శ్రీకారం

ఆలయ ఆవరణలో గుడి చరిత్ర, ధూపదీప నైవేద్య బోర్డులు
భూముల గుర్తింపునకు మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు
‘న్యూస్‌టుడే’తో కమిషనర్‌ విజయరామారావు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలయాలకు కొత్త శోభ తీసుకురాబోతోంది.. ధర్మ పరిరక్షణ, ఆలయ సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా చర్యలు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చేవారికి ఆలయ చరిత్రతో పాటు ఆచార్యుల వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. గుడి చరిత్ర, ఆలయ పూజారి, గుడి తెరిచే వేళల విషయాలు ప్రతి భక్తుడికి తెలిసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా పరిధిలో దేవాదాయ శాఖ ఆధీనంలో భూములన్నాయి. కొన్నేళ్లుగా ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్న విషయం తెలియని పరిస్థితి. రాష్ట్ర కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు తెలంగాణ వ్యాప్తంగా భూముల లెక్కలు తేల్చేందుకు మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సహాయ కమిషనర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఆలయాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలతో పాటు కొత్తదనం తీసుకొచ్చేందుకు పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సహాయ కమిషనర్‌గా వావిల విజయరామారావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ‘న్యూస్‌టుడే’తో పలు వివరాలు వెల్లడించారు.

న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో ఎంత భూమి ఉంది. భూముల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
సహాయ కమిషనర్‌ : కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో 322 దేవాలయాలు ఉండగా వీటి పరిధిలో 3 వేల ఎకరాల భూములున్నాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ భూముల లెక్కలు తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ భూములని తేలిన వెంటనే అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించాలన్నారు. రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాలను పకడ్బందీగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాం. ఆలయ భూముల సర్వే నంబరు, భూముల వివరాలను రెవెన్యూ అధికారుల రికార్డులను పరిశీలించి నిర్ధరించుకుని బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.

న్యూస్‌టుడే : భూముల గుర్తింపు ఎలా చేపడుతున్నారు.?
స.కమిషనర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని దేవాదాయ భూములను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు మండలాల వారీగా ఒక అధికారికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాం. హోదాలతో పనిలేకుండా ఈవో నుంచి కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. వీరు మండల పరిధిలోని ఒక్కో దేవాలయం కింద ఎంత భూమి ఉంది? ఆలయ పరిధిలోనే ఉందా? లేదా వేరే ఎవరైనా సాగు చేస్తున్నారా? వివరాలతో రెవెన్యూ, పోలీసు అధికారుల సాయంతో భూములను స్వాధీనం చేసుకునే అధికారాలిచ్చారు. దేవాదాయ శాఖ ఆలయాల పరిధిలో 3 వేల ఎకరాలు ఉండగా అందులో 504 ఎక్రాలు ఆక్రమణలో ఉన్నట్లు ఇప్పటివరకు తేలింది. ఆక్రమణలో ఉన్న భూములపై కోర్టుల్లో కేసులు వేశాం. దేవాదాయ పరిధిలోని భూములపై హైకోర్టు, ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌, జిల్లా స్థాయి కోర్టులలో 105 కేసులు ఉన్నాయి.

న్యూస్‌టుడే : భూ సర్వేలో కొత్తగా దేవాలయ భూములను గుర్తించారా.?
స.కమిషనర్‌ : దేవాదాయ శాఖ ఆలయాల పరిధిలో ఇప్పటివరకు తెలియని 831 ఎకరాలు వెలుగులోకి వచ్చాయి. మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లు ఊరూరా దేవాలయాలను సమీక్షించి భూములను వెలుగులోకి తెచ్చారు. 39 దేవాలయాల పరిధిలో 831 ఎకరాల భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటన్నింటిని త్వరలోనే రిజిస్ట్రేషన్‌ చేయించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్‌ జిల్లాలో 10 దేవాలయాలు, జగిత్యాలలో 11, పెద్దపల్లి 8, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10 దేవాలయాల పరిధిలో కొత్తగా ఈ భూములున్నట్లు తేల్చారు.

న్యూస్‌టుడే : దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏయే కార్యక్రమాలు చేపడుతున్నారు.?
స.కమిషనర్‌ : దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో గుడి చరిత్రను గోడపై రాయించాలని ఆదేశాలు జారీ చేశాం. గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఆలయ చరిత్ర తెలిసేలా చర్యలు చేపట్టాం. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 322 దేవాలయాల్లో గుడి చరిత్రను రాయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని ఆలయాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి.  ప్రతి సామాన్య భక్తుడికి కూడా వారి పరిధిలోని ఆలయ చరిత్ర తెలిసి ఉండేలా బోర్డులు రాయించాలని నిర్ణయించాం.

న్యూస్‌టుడే : దూప దీప నైవేద్యం పథకం కింద ఎన్ని ఆలయాలు ఉన్నాయి.?
స.కమిషనర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 631 దేవాలయాల్లో దూపదీప నైవేద్యం పథకం అమలవుతుంది. దూప దీప నైవేద్య పథకం పరిధిలోని దేవాలయాల్లో విధిగా దూప దీప నైవేద్యం బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం నిధులు అందించే ఈ పథకం పక్కాగా అమలు చేసే క్రమంలో ఈ బోర్డులు వినియోగపడేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. బోర్డుపై అర్చకుడి పేరు, దేవాలయం తెరిచి ఉంచే సమయాలు, అర్చకుడి చరవాణి నంబర్‌ లాంటివి ఉంటాయి.

న్యూస్‌టుడే : ఆలయాల్లో డ్రెస్‌ కోడ్‌ అమలవుతుందా.?
స.కమిషనర్‌ : ఆలయాల్లో సంప్రదాయ డ్రెస్‌కోడ్‌ అమలును ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు. నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని ఆలయాల్లో డ్రెస్‌కోడ్‌ పాటించాలని సూచించాం. సమయపాలనతో పాటు ప్రతి ఉద్యోగి శ్వేత వస్త్రాలను విధిగా ధరించాలి. అర్చకులు కూడా వారి సంప్రదాయ దుస్తులు ధరించాలి.

న్యూస్‌టుడే : జిల్లాలోని ఆలయాల్లో బెల్లం లడ్డూలను విక్రయిస్తున్నారా.?
స.కమిషనర్‌ : దేవాదాయ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని పెద్ద ఆలయాల్లో బెల్లం లడ్డులను విక్రయిస్తున్నారు. వేములవాడ, కొండగట్టు ఆలయాల్లో బెల్లం లడ్డులు విక్రయిస్తున్నారు. ఇప్పటికే వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాల్లో బెల్లం లడ్డూలు విక్రయించేలా రాష్ట్ర కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.

న్యూస్‌టుడే : ఆలయ సంస్కృతి, సంప్రదాయాలపై గౌరవం పెంచేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
స.కమిషనర్‌ : ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాధ్యమైనంత వరకు ఆలయాలను సందర్శిస్తా. దేవాదాయ శాఖ ఆలయాలను పర్యవేక్షించడంతో పాటు బోర్డులు ఏర్పాటు చేశారా లేదా చూస్తా. అకౌంట్స్‌, క్యాష్‌బుక్‌ చూసి, ఉద్యోగుల సమయ పాలన, డ్రెస్‌ కోడ్‌ అమలవుతుందా లేదా పరిశీలిస్తా. అందరూ నిబంధనలు పాటిస్తూ ఆలయాల అభ్యున్నతి జరిగేలా చూస్తాం.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.