close

సోమవారం, నవంబర్ 18, 2019

తాజా వార్తలు

వేధింపులు తాళలేక.. తనువు చాలిస్తున్నా

చివరి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న భెల్‌ ఉద్యోగిని

మియాపూర్‌, న్యూస్‌టుడే: సునీల్‌.. నా మాట నిలబెట్టుకోలేకపోతున్నా.. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉంటానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాన్ని నెరవేర్చకుండానే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించు.. నా జీవితం నీతో ఆనందంగా గడుస్తుందనుకున్నా.. కొందరు దుర్మార్గులు నా జీవితాన్ని చీకటిమయంగా మార్చారు.. నాకు అనుక్షణం ప్రత్యక్షంగా, పరోక్షంగా నరకం చూపించారు.. అంటూ తన ఉన్నతాధికారితోపాటు ఏడుగురు తోటి ఉద్యోగులే కారణమంటూ భెల్‌ (బీహెచ్‌ఈఎల్‌) ఉద్యోగిని చివరి లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. నగరంలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమ్‌బంగా రాష్ట్రం కోల్‌కతా నగరంలో ఫుల్‌బగన్‌కు చెందిన నేహచౌక్సి (32), ఆమె భర్త సునీల్‌ ఉద్యోగరీత్యా నగరానికి వచ్చి మియాపూర్‌లోని భాను టౌన్‌షిప్‌లో ఉంటున్నారు. నేహ భెల్‌లో అకౌంట్స్‌ విభాగంలో పనిచేసేది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని తనువు చాలించింది. మధ్యాహ్న భోజన సమయంలో భర్త ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఇంటికి వచ్చాడు. భార్య చనిపోయి ఉండటం చూసి హతాశుడయ్యాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు వచ్చి ఆమె రాసిన 6 పేజీల చివరి లేఖను స్వాధీనం చేసుకున్నారు.

వేధింపులతోనే..
‘నా చావుకు బెల్‌లో పనిచేసే డీజీఎం కిషోర్‌ అర్థర్‌కుమార్‌, తోటి ఉద్యోగులు.. స్వైన్‌, మోహన్‌లాల్‌ సోని, సుమలత, గోపిరామ్‌, నితిన్‌, సీతారామ్‌, చరణ్‌రాజ్‌ కారణమ’ంటూ నేహ చివరి లేఖలో పేర్కొంది. తాను భోపాల్‌ నుంచి జూన్‌లో బదిలీపై హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి నిత్యం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని, తన ఫోన్‌ను సైతం ట్యాప్‌ చేసి వ్యక్తిగత జీవితంపై ఎన్నో అభాండాలు సృష్టిస్తూ తన జీవితాని నరకప్రాయం చేశారంటూ తన ఆవేదనను లేఖలో వెలిబుచ్చింది. తన ఉన్నతాధికారుల్లాంటి వారు ఉంటే మహిళలకు రక్షణ ఉండదని, ఈ విషయాలను ఎన్నోసార్లు మానవవనరుల (హెచ్‌ఆర్‌) విభాగం అధికారులకు ఫిర్యాదు చేయాలనుకుని మానుకున్నట్లు అందులో పేర్కొంది.

పండగ ఆనందం ఆవిరి
భర్త, కుటుంబసభ్యులతో కలిసి తమ సంప్రదాయ కర్వాచౌత్‌ పండగను ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్నా.. మెహందీ సిద్ధం చేసుకున్నా.. కానీ రేపటిని చూడలేకపోతున్నా.. అంటూ ఆ లేఖలో తన అసహాయత, ఆవేదనను వ్యక్తం చేసింది. ఈనెల 14న తన ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని మియాపూర్‌ పోలీసుల సూచన మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇప్పటి వరకు ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు లేవని వారు చెప్పినట్లు పేర్కొంది.

 

విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని గృహిణి..
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: భర్త విమానంలో తిరుపతి తీసుకెళ్లలేదని ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరుకు చెందిన ఎన్‌.ప్రవళ్లిక (30) మాదాపూర్‌లోని ఆదిత్య బిర్లా సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎస్పీఆర్‌ హిల్స్‌ రాజీవ్‌గాంధీ నగర్‌లో నివసించే వెంకటరమణ (38)ను ఆమె 2014లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి తొమ్మిది నెలల వయసున్న రిత్విక అనే కుమార్తె ఉంది. ఈ నెల 10న పాప పుట్టువెంట్రుకలు తిరుపతిలో తీయాల్సి ఉండగా వెంకటరమణ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లాల్సి ఉంది. రైలులో వెళ్లడానికి టిక్కెట్లు చేసుకోగా అనివార్య కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడింది. విమానంలో కుమార్తెను తీసుకువెళ్దామని భర్తను ప్రవళ్లిక కోరింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారం రోజుల తరువాత అంతా కలిసి రైలులో వెళ్దామని ఆమెకు వెంకటరమణ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెండు, మూడు రోజులుగా ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. తనకంటే తల్లిదండ్రులకే ఎక్కువ విలువనిస్తున్నాడని ఆమె మనస్తాపానికి గురైంది. బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి తిరిగొచ్చిన అనంతరం భర్తతో మాట్లాడకుండా గదిలోకి వెళ్లి గడియపెట్టుకొంది. అలిగి పడుకుందని అతను భావించాడు. ఉదయం తలుపుకొట్టాడు. ఎంతకూ తీయకపోడంతో అనుమానంతో కిటికీలో నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

పెద్దలను ఎదిరించి మనువాడింది.. అవమానంతో తనువు చాలించింది..
జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: వారిద్దరూ సహోద్యోగులు.. వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. పెద్దలను ఎదిరించి ఇద్దరూ ఒక్కటయ్యారు.. ఇప్పుడామె గర్భిణి.. పెళ్లికి ముందున్న ప్రేమ ఇప్పుడు దూరమైంది.. ఒకవైపు వేధింపులతోపాటు మరోవైపు భర్త అవమానించడం ఆమెను కుంగదీసింది.. ఆత్మహత్యకు పాల్పడింది.. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి గ్రామానికి చెందిన పెనుపోతు గీత (20) కొండాపూర్‌లోని గూగుల్‌ సంస్థలో హౌజ్‌ కీపింగ్‌ విభాగంలో పనిచేస్తోంది. అదే సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న విజయ్‌తో స్నేహం ఏర్పడింది. ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. పెద్దలు కాదనడంతో వారిని ఎదిరించి మరీ.. అయిదు నెలల క్రితం బల్కంపేటలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లోని ఎన్బీటీనగర్‌లో అద్దెకుంటున్నారు. ప్రస్తుతం గీత గర్భిణి. మంగళవారం విజయ్‌ తన పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు స్నేహితులను ఇంటికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి వరకు వారితో కలిసి మద్యం తాగారు. దీన్ని భార్య ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బుధవారం విధులకు వెళ్లివచ్చిన గీత గదిలో వెంటిలేటర్‌ (కిటికీ)కి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం రాత్రి విధులకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన భర్త ఇంటికి వచ్చి చూడగా భార్య ఉరివేసుకుని కనిపించింది. విషయాన్ని స్థానికులకు తెలియజేశారు. వారు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. గత కొంత కాలంగా భర్తతో పాటు తోటికోడలు వేధిస్తున్నారని గీత పలుమార్లు తమకు ఫోన్‌ చేసి చెప్పిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

మాయదారి యాప్‌లు!

ఏది కొనాలన్నా.. విక్రయించాలనుకున్నా.. క్లిక్‌ కొడితే చాలు. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు లావాదేవీలకు వేదికగా మారాయి. మార్కెట్‌లోకి కొత్త మోడల్‌ రాగానే పాతవాటిని తక్కువ ధరకు విక్రయించేందుకు యువత, కార్పొరేట్‌ ఉద్యోగులు ఆసక్తిచూపుతున్నారు.  ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మరమ్మతులు ఉన్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లు రీఫర్బిష్డ్‌ (పునరుద్ధరించినవి) విక్రయిస్తుంటాయి. కొత్త వాటితో పోల్చితే ధరలో సుమారు 30శాతం తేడా ఉంటుంది. ఈ సంస్థలు వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విక్రయానికి సిద్ధంగా ఉంచుతాయి. కొనుగోలు చేసిన అనంతరం ఏదైన సమస్య వస్తే సదరు సంస్థలకు ఫిర్యాదు చేస్తే రిప్లెస్‌మెంట్‌(మరో వస్తువు) చేస్తారు. ఈ నిబంధన ఆరు నెలల పాటు ఉంటుంది.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.