close

శుక్రవారం, నవంబర్ 15, 2019

తాజా వార్తలు

3.45 లక్షల ఎకరాలకు నీరివ్వండి

జల వనరుల మంత్రికి ఎమ్మెల్యేల వినతి

సమీక్షిస్తున్న మంత్రులు, హాజరైన ఎమ్మెల్యేలు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ‘అనంతలో తీవ్ర వర్షాభావం నెలకొంది. సకాలంలో వానలు పడలేదు. మా జిల్లాకు హంద్రీనీవా కాలువ ఎంతో కీలకం. కృష్ణా జలాలను ఆయకట్టుకు ఇవ్వండి. వీలైనంత త్వరగా పిల్ల కాలువలు (డిస్ట్రిబ్యూటరీ) తవ్వాలి... జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి. ఈలోపు చెరువులన్నీ నింపాలని’ జిల్లా ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించారు. సోమవారం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులు, ఇంజినీరు అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఈఎన్‌సీ, జిల్లా సీఈ, ఎస్‌ఈలు.. తదితరులు హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఆరు వేల క్యూసెక్కులకు పెంచాలి...

ఈ సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, హంద్రీనీవా కాలువ సామర్థ్యాన్ని పెంచాలి. కనీసం 6 వేల క్యూసెక్కులకు పెంచితేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న 3.45 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి. వెంటనే పిల్ల కాలువలు తవ్వాలి. గతంలో కాలువ వెడల్పు సరిగా సాగలేదని చెప్పారు. జిల్లా ఎమ్మెల్యేలు అందరూ తమతమ అభిప్రాయాలను చెప్పారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరు ఇవ్వాలి. ఇప్పుడు ప్రాధాన్య క్రమంలో చెరువులన్నీ భర్తీ చేయాలి. ప్రణాళిక ప్రకారం నీటి పంపిణీ సాగాలి. ప్రాంతాల మధ్య మనస్పర్థలు, బేధాభిప్రాయాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యేలు అన్నారు. మరోవైపు... హెచ్చెల్సీ ఆధునికీకరణ పదేళ్లుగా చేస్తూనే ఉన్నారు. అయినా పూర్తి కాలేదు. తుంగభద్ర నుంచి అధిక మోతాదులో నీటిని తెచ్చుకోలేని పరిస్థితి ఉందని ఎమ్మెల్యేలు చెప్పారు. హంద్రీనీవా సామర్థ్యం పెంపు, సమాంతర కాలువ తవ్వకం, హెచ్చెల్సీ ఆధునికీకరణ త్వరితగతిన చేపట్టాలని కోరారు. ప్రాంతాల వారీగా ఆయకట్టు ఎంత ఉంది. ఎన్ని టీఎంసీలు కావాలనే దానిపై ప్రతిపాదనలు ఇవ్వండని మంత్రి అనిల్‌కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు పంపాలని అక్కడే ఉన్న సీఈ నారాయణస్వామిని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు, నిర్ణయాలతో కూడిన నివేదికను సీఎం జగన్‌ ముందు ఉంచుతామని మంత్రి అనిల్‌ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉషాశ్రీ చరణ్‌, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, సీఈ నారాయణస్వామి, ఎస్‌ఈలు వెంకటరమణ, రాజశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.