close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

బల్దియాదే ఈ పాపం!

 అనుమతులకు విరుద్ధంగా షైన్‌ ఆస్పత్రి నిర్మాణం
 ప్రమాదం నుంచి తప్పించుకునే దారే లేదు
 అనుమతి పత్రాల్లేవంటూ ఇప్పుడు అధికారుల నాటకం

ఈనాడు, హైదరాబాద్‌: నెలవారీ మామూళ్లు తీసుకుంటూ అవినీతి మత్తులో తూగిన జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం పసివాడి ప్రాణం తీసింది. మరో ముగ్గురు చిన్నారులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దుర్ఘటన అనంతరం ఆస్పత్రిని పరిశీలిస్తే.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పదేళ్ల కిందట నిర్మించిన భవనం పూర్తిగా అక్రమ నిర్మాణం. నిబంధనల ప్రకారం 150గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తులు నిర్మించాలి. దీన్ని ఉల్లంఘించి.. యజమాని అదనంగా సెల్లార్‌తోపాటు ఓ అంతస్తును అదనంగా నిర్మించాడు. చుట్టూ ఒక మీటరు మేర సెట్‌బ్యాక్‌ కూడా వదల్లేదు. అన్ని రకాల ఉల్లంఘనలు ఉన్న ఆ భవనం పదేళ్లుగా ప్రధాన రహదారిపై ఎలాంటి నోటీసు లేకుండా కొనసాగుతోంది. వీధుల్లో ఒకటి, రెండు అంతస్తుల్లో కట్టుకునే ఇళ్లను అక్రమ నిర్మాణాలంటూ కూలుస్తున్న అధికారులు.. ప్రమాదకరంగా కొనసాగుతోన్న ఈ ఆస్పత్రిలో కనీసం అగ్నిప్రమాద నివారణ చర్యలైనా ఉన్నాయా.. అని ఆలోచించలేదు.  ఘటన అనంతరం భవన నిర్మాణ అనుమతులపై సర్కిల్‌ కార్యాలయం ప్రణాళిక విభాగాన్ని అనుమతుల వివరాలు కోరగా.. సంబంధిత అధికారులు ఇచ్చిన సమాధానమే అందుకు నిదర్శనం. ఆ భవనం అనుమతులకు సంబంధించిన దస్త్రాలు లేవని సహాయ ప్రణాళికాధికారి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. జోనల్‌ కార్యాలయంతో పాటు ట్యాంక్‌బండ్‌ వద్దనున్న ప్రధాన కార్యాలయంలోనూ ఆస్పత్రి నిర్మాణ అనుమతులు, లేదా దరఖాస్తుల వివరాలు లభించకపోవడం విమర్శలకు తావిస్తోంది. అభం, శుభం తెలియని పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ నుంచి ప్రణాళిక విభాగం వరకు ఎవరూ స్పందించకపోవడంపై నగర పౌరులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

మూడు విభాగాల చేతివాటం..
150 గజాల విస్తీర్ణంలో రెండు అంతస్తులే కట్టుకోవాలి. అనుమతి లేకుండా నాలుగు అంతస్తులు కట్టినా బల్దియా ప్రణాళిక విభాగం పట్టించుకోలేదు. సెట్‌బ్యాక్‌ ఎందుకు వదల్లేదనీ అడగలేదు. అక్రమ నిర్మాణానికి ఆస్తిపన్నులో వందశాతం జరిమానా విధించాల్సిన రెవెన్యూ విభాగం ఆ దిశగా చొరవ తీసుకోలేదు. అగ్నిమాపక చర్యలున్నాయా లేదా చూడాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానిదీ అదే తీరు. ఈ మూడు విభాగాల అధికారులు ముడుపులు తీసుకుని ఈ దారుణానికి కారణమయ్యారని స్థానికులు వాపోయారు. ఆయా వివరాలన్నింటినీ తెలియజేయాలని భవన యజమానిని కోరినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి తెలిపారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.