close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

సవాళ్లను స్వాగతిస్తేనే గుర్తింపు

  నటించడం కన్నా నిర్మాతగా ఉండటం కష్టం
  బాలీవుడ్‌ సినీ నిర్మాత, ప్రముఖ స్టైలిస్ట్‌ రియా కపూర్‌

అసమానతలపై తనదెప్పుడూ ధిక్కార స్వరమే.. మాట్లాడే ప్రతి మాటా స్త్రీలకు చైతన్య దీపికే.. ప్రతి మహిళా సొంతంగా ఎదగాలనే కాంక్ష తనది.. అందుకే బాలీవుడ్‌లో కీలకమైన కపూర్‌ కుటుంబంలో పుట్టినా తనకంటూ ఓ గుర్తింపు సాధించేందుకు కష్టపడింది. ఆ కుటుంబం నుంచి ఎదిగే పిల్లలందరినీ హీరోలు, హీరోయిన్లుగా ఊహించుకునే తరుణంలో ఓ నిర్మాతగా, స్టైలిస్టుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. 21 ఏళ్ల వయసులోనే సోదరి సోనమ్‌కపూర్‌తో ‘ఐషా’ చిత్రం నిర్మించి అందరి మన్ననలు అందుకుంది రియాకపూర్‌..

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

ప్రముఖ నటుడు అనిల్‌కపూర్‌ వారసురాలిగా ఈ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా, స్టైలిస్టుగా, వ్యాపారవేత్తగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించింది రియా. సోమవారం నగరంలో ఓ హోటల్‌లో యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సదస్సుకు అతిథిగా హాజరై నగర మహిళలతో చర్చించారు. హైదరాబాద్‌ తనకి రెండో ఇల్లులాంటిదంటూ నగరంతో తన బంధాన్ని, పలు విషయాలను ‘ఈనాడు’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.. ఆమె మాటల్లోనే..

భాగ్యనగరం మాకు రెండో ఇల్లు
ముంబయి నగరం తర్వాత ఎక్కువగా నచ్చిన ప్రాంతం.. మాకు రెండో ఇల్లులాంటిది హైదరాబాదే.. నాన్న అనిల్‌కపూర్‌ చిత్రాల్లో దాదాపు సగంపైగా చిత్రాలు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరుపుకొన్నాయి. హైదరాబాదీలు మమ్మల్ని చాలా ఆదరించారు. అందుకే నగరమంటే ఇష్టం. ఇక్కడికొచ్చినప్పుడల్లా చారిత్రక ప్రాంతాల్ని, బిర్యానీని ఆస్వాదించకుండా వెళ్లం.

సొంత ఆలోచనా శక్తి అవసరం
మహిళలంటే బలహీనులుగా చూస్తున్న ప్రతిచోటా నాయకత్వం అందుకునే దిశగా అడుగులు వేయాలి. ఎన్ని వీలైతే అన్ని పనులు చేయాలి. ఎవరేమంటున్నా పట్టించుకోకుండా మన దారి మనది, మనకు నచ్చినట్లు మనముండాలి. సొంతంగా ఆలోచించే శక్తి, అద్భుత నిర్ణయాలు తీసుకునే యుక్తి ఉన్నప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుంది. అందుకే నేను తీసే ప్రతిసినిమాలో మహిళలకు మద్దతుంటుంది.

అదృష్టంతోపాటు కష్టం ఉండాల్సిందే..
నాకు ఈ రంగంలో రాణించడానికి మా నాన్నే పూలబాట వేశారు. ఆయన లేకుండా మేం లేము. 62ఏళ్ల వయసులోనూ ఇంకా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు కాబట్టే మేమీ స్థాయిలో ఉన్నాం. నేనీ రంగంలో రావడం అదృష్టమైతే.. రాణించడం మాత్రం కష్టపడితేనే. ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం కీలకపాత్ర పోషిస్తుంది. దానికి కష్టపడేతత్వం తోడైతేనే విజయంగా మారుతుంది.

‘మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి’
ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని యంగ్‌ ఫిక్కీ ఛైర్‌పర్సన్‌ శిల్ప దాట్ల అన్నారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో బాలీవుడ్‌ నిర్మాత రియాకపూర్‌తో చర్చావేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిల్పదాట్ల అధ్యక్షత వహించి మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు గుర్తింపు సాధిస్తేనే సాధికారత సాధ్యమవుతుందన్నారు. నగరం నుంచి వివిధ రంగాలకు చెందిన 150మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రియాకపూర్‌ తన జీవితంలో ఎదురైన సవాళ్లు, సినీ, వ్యాపార రంగాల్లో అనుభవాలను పంచుకున్నారు.

ఎక్కడైనా చిన్నచూపే..
మహిళలంటే ప్రతిచోటా చిన్నచూపే ఉంటుంది. ఏదైనా రంగంలోకి అడుగుపెడుతున్నామంటే అమ్మాయి అనే భావననే వింతగా చూస్తారు. నాకు పదహారేళ్ల వయసులో నన్ను హీరోయిన్‌ అవమనేవారు. కానీ నాకు అలా ఉండటం ఇష్టం లేకనే స్టైలింగ్‌ వైపు, నిర్మాణ రంగంవైపు అడుగేశాను. ఓ నటిగా చేయడం కన్నా నిర్మాతగా రాణించడం కత్తిమీద సామే. నటి కెమెరా ముందు మాత్రమే నటించాలి. కానీ సినిమాకు సంబంధించి అన్ని బాధ్యతలు నిర్మాతవే. అయినా సరే ఇదే ఎంచుకున్నా.

సవాళ్లకు ఎదురెళ్లాలి..
నేను నటిగా చేసుంటే ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు. వారసత్వ గుర్తింపు వచ్చేది. కానీ ఇప్పుడు 21ఏళ్లకే నిర్మాతగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చేసేపని ఏదైనా కొత్తగా ఉంటేనే సమాజంలో గుర్తింపు సాధించగలం. విలక్షణత ఉండేలా చూసుకోవాలి. ముందే అనుకున్నా ఆటంకాలు తప్పవని. అనుకున్నట్లే చాలా ఎదురయ్యాయి. గెలవాలనుకున్నప్పుడు ఓడిపోవడం నేర్చుకోవాలి. పోరాడటం నేర్చుకోవాలి. అందుకోసమే మహిళలు సవాళ్లకు ఎదురెళ్తూ కొత్త ప్రయోగాలు చేయాలి..

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.