close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

నిర్లక్ష్యమే పొట్టనపెట్టుకుంది

 ముచ్చట తీరకుండానే మృత్యు ఒడికి
 గుండెలవిసేలా రోదించిన చిన్నారి తల్లిదండ్రులు
 ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌-న్యూస్‌టుడే, నాగోలు, ఎల్‌బీనగర్‌, ఉస్మానియా ఆసుపత్రి, ఉప్పల్‌ :  ఎల్బీనగర్‌లోని షైన్‌ ఆసుపత్రిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన నాలుగు నెలల చిన్నారికి న్యూమోనియా ఉండటంతో చికిత్స కోసం మూడు రోజుల క్రితమే ఈ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలి సంతానం కుమార్తె కాగా...రెండో కాన్పులో బాబు పుట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇటీవలి బాబుకు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో సూచించారు. అక్కడ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌ తరలించారు. ఎన్‌ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాబు ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్న తరుణంలోనే ఘోరం జరిగిపోయింది. నాలుగు నెలలకే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లిదండ్రులు నరేశ్‌, మానసలు గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆపటం ఎవరి తరం కాలేదు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.  ఉస్మానియా ఆసుపత్రి వద్ద బాలుడి తల్లి మానస, తండ్రి నరేశ్‌లు మాట్లాడుతూ.. షైన్‌ ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని తక్షణమే సీజ్‌ చేయాలని, యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదం సమయంలో సిబ్బంది ఎవ్వరూ ఎన్‌ఐసీయూ వార్డులోకి వెళ్లకపోవడంతో తామే వార్డులోకి వెళ్లి బాబును బయటకు తీసుకొచ్చామని, ఆ సమయంలో బాబు ప్రాణాలతోనే ఉన్నాడని, కృత్రిమ శ్వాస అందించాలని ఎంతగా ప్రాధేయపడినా అక్కడ నర్సులు, వైద్యసిబ్బంది అందుబాటులో లేకుండా పోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యం తీరుపై   చిన్నారి తండ్రి నరేష్‌ స్నేహితులు, బంధువులు షైన్‌ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.

30-40 శాతం గాయాలు...
గాయపడిన నలుగురిలో ముగ్గురు చిన్నారులకు 30-40 శాతం వరకు గాయాలయ్యాయి. అంతా ఏడాదిలోపు వారే. శ్వాసకోశ వ్యాధులతో ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మంటల వేడికి తాళ లేక ఆ లేత చర్మాలు కమిలిపోయాయి. ఛాతి, చేతులపై గాయాలతో చిన్నారుల్లో ఉలుకుపలుకు లేకుండా పోయింది. ఓ చిన్నారికి పెద్దగా గాయాలు లేకపోయినా...పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం వీరిలో ఒకర్ని బోడుప్పల్‌లోని అంకుర ఆస్పత్రికి, మరొకరిని మలక్‌పేటలోని సేఫ్‌ ఆస్పత్రికి, ఇంకో చిన్నారిని బంజారాహిల్స్‌లోని అంకుర ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పొగ పీల్చిన 13 రోజుల ఆడ శిశువును ఎల్బీనగర్‌లోని దిశ పిల్లల ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించారు. ప్రస్తుతం ఈ చిన్నారి కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

నిండా నిర్లక్ష్యం...
సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తోంది. ఆసుపత్రిలో అగ్నిమాపక నిరోధక చర్యలు కూడా తూతూ మంత్రంగానే ఉన్నాయి. మంటలను, పొగను గుర్తించే పరికరాలు, వ్యవస్థ పనిచేయడం లేదు. భవనానికి ఒక వైపు మాత్రమే దారి ఉంది. అత్యవసర ద్వారం లేకపోవడంతో ఒకవైపు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మెట్ల మార్గం కూడా చాలా చిన్నదిగా కన్పిస్తోంది. దీంతో ప్రమాదం నుంచి బయట పడే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని బాధితులు చెప్పారు.

ఒక్కొక్కరిది ఒక్కో గాథ..
బోడుప్పల్‌, న్యూస్‌టుడే: ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఇద్దరు చిన్నారులను చికిత్స కోసం బోడుప్పల్‌లోని అంకుర ఆస్పత్రికి తరలించారు. వీరిలో నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం, శివన్నగూడెంకు చెందిన గిరి, మమత దంపతుల బాబు (3నెలలు) ఉన్నాడు. వీరు హస్తినాపురంలో ఉంటున్నారు. బాబుకు ఆస్తమా సమస్యలు రావడంతో ఆదివారం ఉదయం షైన్‌ ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యుల సూచన మేరకు అడ్మిట్‌ చేశారు. చికిత్స పొందుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో బాబు ముఖం, పొట్టపైనా గాయాలయ్యాయి. ప్రస్తుతం అంకుర ఆసుపత్రిలో బాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

బిల్లు కట్టడం ఆలస్యం కావడంతో...
దేవరకొండకు చెందిన సరిత, ముత్యాలు కుమార్తె అమ్ములు (6మాసాలు) జ్వరంతో షైన్‌ ఆస్పత్రిలో చేరింది.  ఆదివారం ఉదయమే డిశ్చార్జి చేస్తామని చెప్పిన వైద్యులు బిల్లు కట్టేందుకు ఆలస్యం కావడంతో ఆస్పత్రిలోనే ఉన్నారు. సోమవారం బిల్లు చెల్లించి వెళ్లాలని భావించారు. అనుకోని ఉపద్రవం జరుగడంతో కంగుతిన్నారు. కాళ్లు, చేతులు, పొట్టభాగం కాలింది. మొదట బోడుప్పల్‌లోని అంకుర ఆస్పత్రికి అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని అంకుర ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.