close

సోమవారం, నవంబర్ 18, 2019

తాజా వార్తలు

రైతు ఖాతాలకురూ.317 కోట్లు

1.50 లక్షల మంది ఇళ్ల పట్టాలకు అర్హులు

 4,890 గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల భర్తీకి 24 నుంచి ధ్రువపత్రాల పరిశీలన

 కలెక్టర్‌ వీరపాండియన్‌ 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద 4.43 లక్షల మంది రైతులకు రూ.317 కోట్ల పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన మంగళవారం మాట్లాడారు. 35 వేల మంది రైతులు నగదు తీసుకోనట్లు సంబంధిత బ్యాంకర్లు తమ దృష్టికి తెచ్చారని, అలాంటివారు తమ బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్‌ అనుసంధానం, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, బ్రాంచి వివరాల్లో లోపాలుంటే సరిచేసుకోవాలన్నారు. మరో 40 వేల మంది రైతులు ప్రజాసాధికార సర్వే చేయించుకోలేదన్నారు. వ్యవసాయ, గ్రామస్థాయి వీఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన రైతులను గుర్తించాలని ఆదేశించామన్నారు.

1.73 లక్షలకు పెరిగే అవకాశం

జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1.74 లక్షల మంది ఇళ్ల స్థలాలకు అర్హత కలిగినవారుగా గుర్తించామని, అందులో ఆర్‌టీజీఎస్‌ ద్వారా ఆరు రకాల అంశాలపై పరిశీలించగా 1.50 లక్షల మంది అర్హులుగా తేల్చినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. వీటిని గ్రామసభల్లో ప్రదర్శిస్తామన్నారు. వారం రోజుల్లో అర్హుల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఈ సంఖ్య 1.73 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు. అన్ని అర్హతలుండి జాబితాలో పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే మళ్లీ గ్రామస్థాయి, మున్సిపాలిటీలలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

● ఇళ్ల స్థలాలకు అందుబాటులో ఉన్న భూమి, కొనుగోలు చేయాల్సిన భూములపై అధికారులు నిర్వహించిన సర్వే చివరి దశకు వచ్చిందన్నారు. అమరావతిలో ఉప ముఖ్యమంత్రి, సీసీఎల్‌ఏ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకు కొత్తగా సేకరించాల్సిన భూముల విషయమై జేసీలు, ఆర్డీవోలతో సమీక్ష జరుగుతుందన్నారు.

● వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 4,500 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 7 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6.40 లక్షల మందికి చేసినట్లు వివరించారు. మరో 40 వేల మంది విద్యార్థులు అందుబాటులో లేరన్నారు. వీరంతా స్థానికంగా లేనివారు, వలస వెళ్లినవారని చెప్పారు. నవంబరు 1 నుంచి నెలాఖరు వరకు అవసరమైన విద్యార్థులకు కంటి చికిత్సలు అందిస్తామని చెప్పారు.

● గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 9,850 పోస్టుల భర్తీకిగాను 4,960 మంది విధుల్లో చేరారని, మిగిలిన 4,890 పోస్టులు వివిధ కేటగిరీలల్లో ఖాళీగా ఉన్నాయని కలెక్టర్‌ వీరపాండియన్‌ చెప్పారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేయించుకుని ఇదివరకే గ్రామ, వార్డు సచివాలయాలకు నియామక పత్రాలు తీసుకుని విధుల్లో చేరనివారు వెంటనే చేరాలన్నారు. చేరనివారు రాతపూర్వకంగా రాసి ఇవ్వాలన్నారు. గురువారం నుంచి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు ఇదివరకే ఏదో ఒక పోస్టులో విధుల్లో చేరి మరో పోస్టుకు కాల్‌లెటర్‌ వస్తే సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు రెండో విడతగా బుధవారం నుంచి కాల్‌ లెటర్లను పంపుతున్నామన్నారు.

● గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసిందన్నారు. 367 కొత్త భవనాలకు రూ.130 కోట్లు, 520 భవనాల విస్తరణ, మరమ్మతులకు రూ.70 కోట్లను మంజూరు చేసినట్లు వివరించారు. ఆరు నుంచి 9 నెలలలోపు సచివాలయ శాశ్వత భవన నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.