close

బుధవారం, నవంబర్ 20, 2019

తాజా వార్తలు

మరో చిన్నారి పరిస్థితి విషమం

శ్వాసకోశాల్లోకి పొగ చేరడంతో ఇబ్బందులు
కోలుకుంటున్న ముగ్గురు చిన్నారులు

నాగోలు, సైదాబాద్‌, ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: ఎల్బీనగర్‌ షైన్‌ పిల్లల ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాద ఘటన నుంచి బయటపడి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో ఒకరు మినహా మిగతా వారి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు ఆస్పత్రుల వైద్యులు తెలిపారు. మొత్తం ఐదుగురు చిన్నారుల్లో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురిని ఇతర ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించారు. కాగా ఎల్బీనగర్‌లోని దిశ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 13 రోజుల చిన్నారి ఆరోగ్యం విషయమై తల్లిదండ్రులు నాగరాజు, సుగుణ దంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎన్‌ఐసీయూలో కమ్ముకున్న దట్టమైన పొగ ఆ చిన్నారి శ్వాసకోశాల్లోకి వెళ్లిందని.. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటోందని వైద్యులు తెలిపినట్లు ఆందోళన చెందారు. ఇప్పటికే న్యూమోనియాతో బాధపడుతున్న ఆ శిశువునకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారని తండ్రి నాగరాజు పేర్కొన్నాడు. ఇప్పటికే షైన్‌ ఆస్పత్రిలో రూ.30వేలు ఖర్చుచేసిన తాము.. తాజాగా దిశ ఆస్పత్రిలో రూ.60వేల వరకు చెల్లించామని తెలిపారు. ప్రభుత్వం చొరవచూపి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇద్దరు చిన్నారులు ‘సేఫ్‌’
ఎల్బీనగర్‌ షైన్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో బాధితులైన ఇద్దరు చిన్నారులకు మలక్‌పేటలోని సేఫ్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని పహాడీనగర్‌ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ ఖాలేద్‌ కుమారుడు మహమ్మద్‌ అబ్దుల్లా (45 రోజులు), అలాగే ఖాలేద్‌ సోదరుడు మహమ్మద్‌ మాజిద్‌ ఇమ్రాన్‌ కుమారుడు మహమ్మద్‌ అజ్లాన్‌ (6 నెలలు) ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందంటూ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైద్యం చక్రవర్తి తెలిపారు. డాక్టర్‌ సయ్యద్‌ ఇర్ఫాద్‌ ముస్తఫా నేతృత్వంలో వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతోందని మంగళవారం వివరించారు. అబ్దుల్లాకు పీఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. అజ్లాన్‌ ఆరోగ్యం మెరుగుపడింది.

‘అంకుర’లో కోలుకుంటున్న చిన్నారి
షైన్‌ ఆసుపత్రి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి బంజారాహిల్స్‌లోని అంకుర చిన్నపిల్లల ఆసుపత్రిలో కోలుకుంటోంది. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన ముత్యాలు, శైలజ దంపతుల ఆరు వారాల కుమార్తె (అమ్ములు)ను మెరుగైన చికిత్స కోసం సోమవారం బంజారాహిల్స్‌లోని అంకుర చిన్నపిల్లల ఆసుపత్రిలో చేర్చారు.

ఘటనపై సుమోటోగా కేసు
అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఎల్బీనగర్‌లోని షైన్‌ ఆస్పత్రిని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు చెందిన ప్రతినిధులు అంజన్‌రావు, అపర్ణ, భానూధర్‌రావులు మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఘటనపై సుమోటోగా కేసు స్వీకరిస్తామని చెప్పారు. ఆయా శాఖలు, విభాగాల నుంచి నివేదికలు కోరామని, నివేదికల ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

చర్యలు తీసుకోండి
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: షైన్‌ ఆసుపత్రి ఘటనకు అగ్నిమాపక, జీహెచ్‌ఎంసీ అధికారులను బాధ్యులను చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని మానవహక్కుల సంఘానికి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఓ చిన్నారి ప్రాణం పోయిందని, అభం, శుభం తెలియని చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారని సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్‌ నిబంధనలు అతిక్రమించి కేవలం 150 చదరపు గజాల స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టడం, లైసెన్సులు లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలను అతిక్రమించి ఆసుపత్రి నడుపుతున్నా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, ఫైర్‌ సేఫ్టీ సంచాలకులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలని మానవ హక్కుల సంఘాన్ని అచ్యుతరావు కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.