close

మంగళవారం, నవంబర్ 19, 2019

తాజా వార్తలు

కుళ్లిన కూరగాయలు.. మురుగు వాసన

 బాబోయ్‌.. ‘హా’స్టళ్లు!
 ఇష్టారీతిన నిర్వహణ
 7 వసతి గృహాలు సీజ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మురుగు వ్యవస్థ ఉండదు.. ట్రేడ్‌ లైసెన్స్‌లు కానరావు.. సీసీ కెమెరాలు ఉండనే ఉండవు.. పేర్లు పోలీస్‌ ఠాణాల్లో కనిపించవు..కుళ్లిపోయిన కూరగాయలు, అపరిశుభ్ర పరిసరాలు..ఇదీ నగరంలోని పలు ప్రైవేటు వసతి గృహాలలో పరిస్థితి. ఇరుకు గదుల్లో, భద్రతలేని అపార్టుమెంట్లలో అనేకం నిర్వహిస్తున్నారు. అమీర్‌పేట, ఎస్‌.ఆర్‌.నగర్‌లోని కొన్ని వసతి గృహాలను బుధవారం తనిఖీచేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్కడి పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయారు. కుళ్లిన కూరగాయలు, ఫ్రిజ్‌లో అన్నం నిల్వ, సిల్ట్‌ ఛాంబర్లు లేకపోవడం వంటివి వెలుగుచూశాయి. వ్యర్థాలను నేరుగా నాలాల్లో వేయడంతో మురుగు రోడ్లపై పారుతోంది. ఖైరతాబాద్‌ వైద్యాధికారి భార్గవ్‌ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఒక మహిళా వసతిగృహంతో సహా మొత్తం ఏడింటిని  సీజ్‌ చేశారు.

అక్కడే వేయికి పైగా..
దిల్‌సుఖ్‌నగర్‌, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట్‌, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు ఉండటంతో ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు, ఉద్యోగులు ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్క ఎస్సార్‌నగర్‌ పరిధిలోనే వెయ్యికి పైగా, దిల్‌సుఖ్‌నగర్‌లో 600 వరకు హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో విద్యార్థులకు, ఉద్యోగాలు చేసే మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఎస్సార్‌నగర్‌లో ఉద్యోగుల వసతి గృహాలే ఎక్కువ. పోలీసు స్టేషన్‌లో నమోదైనవి 700 మాత్రమే. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతానికి వస్తే అక్కడి ఠాణాలో నమోదైనవి మాత్రం కేవలం 180. మరోవైపు కేపీహెచ్‌బీలో సుమారు 300కు పైగా హాస్టళ్లు ఉండగా ఇందులో 270 మాత్రం ఠాణాల్లో నమోదయ్యాయి. ఇందులో 160 పురుషుల, 110 మహిళలవి ఉన్నాయి.

డిజిటలైజ్‌ చేస్తున్నాం : సుమతి, వెస్ట్‌జోన్‌ డీసీపీ
మున్సిపల్‌ లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న వసతిగృహాలు అధికంగా ఉన్నట్లు గుర్తించాం. ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల వీటిని లెక్కించడం.. డేటాబేస్‌ సేకరణ, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా కష్టతరంగా మారింది. ప్రతీ హాస్టల్‌ పోలీస్‌స్టేషన్‌లో తప్పకుండా నమోదు కావాలని గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం అన్నీ డిజిటలైజ్‌ చేయాలని నిర్ణయించాం.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.