శుక్రవారం, డిసెంబర్ 06, 2019
పత్తికొండ గ్రామీణ, మద్దికెర, న్యూస్టుడే: తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీరు-చెట్టు పథకం బిల్లులను వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని, వాటిని వడ్డీతో సహా రాబడతామని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇసుక కొరత కారణంగా పనులు లేక మనోవేదనకు గురై ఇటీవల మరణించిన భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలను ఆయన సోమవారం సాయంత్రం పరామర్శించారు. వారిని పార్టీ పరంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముప్పై ఏళ్లుగా అనేక మంది కార్మికులకు ఉపాధి కల్పించిన మేస్త్రీలే పనులు లేక పస్తులతో చనిపోవటం దారుణమన్నారు. మృతుల కుటుంబాల్లోని ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పార్టీ కృషి చేస్తుందన్నారు.
న్యాయ పోరాటం చేస్తాం: మృతుల కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడుతూ ఎన్ని నెలల నుంచి పనులు లేక ఉన్నారని, ఇసుక సమస్య ఎన్ని రోజులుగా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంతో ముందుచూపుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీరు-చెట్టు పథకం చేపట్టారన్నారు. తెదేపా నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు చిత్తశుద్ధితో చేపట్టిన పనులకు వైకాపా ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందన్నారు. న్యాయ పోరాటం చేసి బిల్లులు వసూలు చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకం నిధులు ఇతర పనులకు మళ్లించి ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సైతం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఉపాధి పథకంలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సహాయకులు, వెలుగు పథకంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను వైకాపా ప్రభుత్వం తొలగిస్తోందన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఆయా జిల్లాల్లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే వాటినన్నింటినీ వైకాపా ప్రభుత్వం గుడ్డిగా వ్యతిరేకిస్తోందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, పత్తికొండ, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల బాధ్యులు కేఈ శ్యాంబాబు, మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, కేడీసీసీ బ్యాంకు మాజీ ఛైర్మన్ మల్లికార్జునరెడ్డి, జిల్లా నాయకులు కోట్ల రాఘవేంద్రరెడ్డి, నాగేశ్వరయాదవ్, సాంబశివారెడ్డి, మనోహర్చౌదరి, తిమ్మయ్య చౌదరి, బత్తిన వెంకటరాముడు, రాజన్న యాదవ్, అశోక్, లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు