close

శుక్రవారం, డిసెంబర్ 13, 2019

తాజా వార్తలు

చదువుతోనే అభివృద్ధి సాధ్యం
విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల అందజేత

భోజనం సరిపోక వెనుదిరిగిన విద్యార్థులు

మాట్లాడుతున్న కలెక్టర్‌ వీరపాండియన్‌

కర్నూలు విద్య, కర్నూలు (బుధవారపేట), న్యూస్‌టుడే : ఏపీజేె అబ్దుల్‌ కలాం విద్యా పురస్కార సంబరాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అబుల్‌ కలాం మౌలానా ఆజాద్‌ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కారాలు అందించారు. పాఠశాల విద్యాశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జరిపాయి. 2018 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ విభాగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపిక చేశారు. అవార్డుల ప్రదానోత్సవానికి కలెక్టర్‌ వీరపాండియన్‌, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఆర్థర్‌, హఫీజ్‌ఖాన్‌, సుధాకర్‌, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి వెలిగించారు. ముందుగా మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్‌ స్పందన కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండటంతో ప్రతి విభాగంలో ఇద్దరికి చొప్పున పురస్కారాలు అందజేసి వెళ్లిపోయారు. మిగిలిన విద్యార్థులకు జేసీ-2 ఖాజా మొహిద్దీన్‌ ఆధ్వర్యంలో పురస్కారాలు ఇచ్చారు. వీటితోపాటు మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన వ్యాసరచన పోటీల్లో రాణించిన విద్యార్థులకు, ఉర్దూ పాఠశాలలో విధుల నిర్వహణలో గుర్తింపు తీసుకొచ్చినవారికి వేదికపై ధ్రువపత్రాలు ఇచ్చారు. మహమ్మద్‌ మియ్యా గజల్స్‌, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం

ఈ సందర్భంగా కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడుతూ విద్యార్థులు విద్యను అభ్యసించడమేకాక ఇతరులను చదివించేందుకు సహకారం అందిస్తే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని, చదువు ఎంతో ముఖ్యమని చెప్పారు. అబుల్‌ కలాం ఆజాద్‌, అబ్దుల్‌ కలాం లాంటి మహనీయులు విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ, ముస్లిం అన్న బేధాభిప్రాయాలు లేకుండా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారన్నారని చెప్పారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే జె.సుధాకర్‌ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్‌ ఫోన్లకు అలవాటుపడకుండా విద్యపై దృష్టి పెట్టి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారిణి సబిహా పర్వీన్‌, ఆర్జేడీ సి.వి.రాజేశ్వరి, ఎస్‌ఎస్‌ఏ పీవో టి.విద్యాసాగర్‌, ఉప విద్యాధికారిణులు అనురాధ, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

తూతూమంత్రంగా అందజేత

జిల్లావ్యాప్తంగా 489 మందికి పురస్కారాలకు ఎంపిక కాగా పురస్కారాల ప్రదానోత్సవానికిగాను శనివారం 300 పతకాలను జిల్లాకు పంపించారు. అందులో కొన్నింటిని వేదికపై అతిథుల చేతులమీదుగా అందించగా మరికొన్నింటిని తర్వాత పంపిణీ చేయాలంటూ గంపగుత్తగా విభాగాల వారీగా సంబంధిత అధికారులు అందజేశారు. మిగిలిన పతకాలు తరువాత ఇస్తామని విద్యార్థులకు చెప్పాలని సూచించినట్లు తెలిసింది.

ఇదేమీ అన్నదాన సత్రం కాదు..

అధికారులు ముందుగా ప్రకటించిన విధంగా పురస్కారాల వద్ద భోజన కార్యక్రమం ప్రారంభించిన కొద్ది సేపటికే అయిపోయిందని చెప్పడంతో విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. అవార్డులకు ఎంపికైనవారిలో సగం మంది మాత్రమే హాజరవుతారని అంచనా వేసుకుని అధికారులు భోజనం తయారు చేయించారు. పురస్కారాలకు విద్యార్థులు పెద్దఎత్తున రావడంతో భోజనాలు ఏమాత్రం సరిపోలేదు. రిజిస్ట్రేషన్‌ నమోదు సమయంలో ఇచ్చిన టోకెన్లను చేత పట్టుకుని గంటల తరబడి నిలబడ్డారు. తల్లిదండ్రుల సాయంతో కౌంటర్‌ వద్దకెళ్లి అక్కడున్న వారిని నిలదీయగా ఇదేమీ అన్నదాన సత్రం కాదని, ఉన్నప్పుడు తిని వెళ్లాలని సమాధానం ఇవ్వడంతో విస్తుపోయారు. చివరికి చేసేదేమీలేక చాలామంది వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.