మంగళవారం, డిసెంబర్ 10, 2019
డబ్బు లాక్కొని పట్టించుకోని కుమార్తెలు
స్పందనలో ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
నడవలేని స్థితిలో సీతారామయ్య
ప్యాపిలి, న్యూస్టుడే: గుండెలే బండగా మారిపోయేటి స్వార్థం.. తల్లిని తాళిని డబ్బుతో తూచు భేరం ధనమే..! తల్లి ధనమే తండ్రి ధనమే.. దైవమా అన్ని బంధాలకంటే డబ్బే ముఖ్యమా..! అంటూ ఓ సినీ కవి తన పాటలో నేటి పరిస్థితికి అద్దం పట్టారు. 70 ఏళ్ల వయస్సులో కన్న తండ్రిని ఆదుకోవాల్సిన కూతుళ్లు డబ్బు చేతికందగానే తమ నిజస్వరూపం బయటపెట్టుకున్నారు. తల్లితో కలిసి ఆయనను ఒంటరిని చేశారు.
ప్యాపిలి మండలం హుస్సేనాపురం చెందిన సీతారామయ్య, కామాక్షమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు సువర్ణలత, పూర్ణిమ, మాధవీలత. వారికి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. సీతారామయ్యకు వెన్నునొప్పితోపాటు మోకాళ్లనొప్పి వేధిస్తున్నాయి. కనీసం నడవలేని పరిస్థితి. ఆయనకు సపర్యలు చేయలేని భార్య కామాక్షమ్మ కుమార్తెలకు డబ్బులు ఇస్తే చివరివరకు వారే చూసుకుంటారని భర్తకు నచ్చజెప్పారు. తండ్రి దగ్గర ఉన్న డబ్బులు చూసి కుమార్తెలు ఎక్కడ ఎనలేని అనురాగాన్ని చూపారు. కుమార్తెలను పూర్తిగా నమ్మిన సీతారామయ్య 2017లో ఇళ్లు అమ్మకంపెట్టారు. మొత్తం రూ.2.60 లక్షలు, 8 తులాల బంగారాన్ని కుమార్తెల చేతిలో పెట్టారు. వాటిని తీసుకున్న కుమార్తెలు కొద్దినెలలు తండ్రిని బాగానే చూసుకున్నారు. క్రమంగా తండ్రికి సేవలు చేయలేక ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నారు. చివరకు భార్య సైతం వారి పంచన చేరడంతో ఆయన రెండేళ్లుగా గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. కనీసం వంట చేసుకొనే ఓపిక లేకపోవడంతో మనస్తాపానికి గురైన సీతారామయ్య వారిని నిలదీశారు. తన డబ్బు తనకు ఇవ్వమని కోరారు. చిల్లిగవ్వ ఇచ్చేదిలేదని తేల్చి చెప్పడంతో ఆయన ఇటీవల జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను స్పందనలో కలిసి తమ బాధను వెల్లబోసుకున్నారు. చలించిన ఆయన ప్యాపిలి సీఐ రామలింగమయ్యకు ఈ కేసుపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఆయన కామాక్షమ్మ, కూతుళ్లను పిలిపించి మంత్రణం చేశారు. కామాక్షమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు సువర్ణలత, పూర్ణిమలపై తల్లిదండ్రుల, వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం 2007 సెక్షన్ల కింద జలదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు