నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్టుడే : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు. దగదర్తిలో ఆత్మహత్య చేసుకున్న తెదేపా కార్యకర్త గండికోట కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన విచ్చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు దగదర్తికి చేరుకోనున్న ఆయన ఈ సందర్భంగా తొలుత బాధిత కుటుంబీకులతో మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అలాగే కార్యకర్తలకు భరోసా కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే లోకేష్ పర్యటనకు సంబంధించి గురువారం షెడ్యూల్ విడుదల కానుంది.