ఆదివారం, డిసెంబర్ 08, 2019
చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: ఆర్మీలో చేరాలన్న తన కల ఫలించలేదన్న మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం రాత్రి ఛత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఆర్.విద్యాసాగర్‌రెడ్డి కథనంప్రకారం..ఉప్పుగూడ శివాజీనగర్‌కు చెందిన జి.యాదయ్య, పార్వతమ్మ దంపతుల కుమార్తె జయలక్ష్మి(17) బాలాపూర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె బుధవారం సెల్‌ఫోన్ తీసుకురావడం గమనించిన సిబ్బంది..ఆ బాలిక తండ్రిని పిలిపించి ‘ఇంకోసారి అలా చేయరాద’ని మందలించి పంపారు. తండ్రితో పాటు కళాశాల నుంచి ఇంటికి వచ్చిన ఆమె గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణం తీసుకుంది. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని పరిశీలించగా గదిలో బాలిక రాసిన సూసైడ్‌నోట్ లభించింది.
అసలు కారణం ఏమిటి?.. తాను ఆర్మీలో చేరాలని కలగన్నానని, ప్రయత్నం చేయలేకపోతున్నానని, ఫలించే అవకాశం లేనందున ‘వెళ్లిపోతున్నా’నని మృతురాలు ఆ నోట్లో పేర్కొంది. ఆర్మీలో చేరి తన కల నెరవేర్చాలని, అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని తమ్ముడిని కోరుతూ రాసి ఉందని పోలీసులు తెలిపారు. అసలు కారణం ఏమిటి.. కళాశాల సిబ్బంది, తండ్రి ముందు మందలించినందుకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా, ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు