close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

గాల్లో ‘తేలిపోతున్నారు’!

 ప్రతినెలా సగటున ఓఆర్‌ఆర్‌పై 40 వేలకుపైగా కేసులు
 10 ప్రమాదాలు.. 12 మంది క్షతగాత్రులు.. ముగ్గురు మరణం
ఈనాడు, హైదరాబాద్‌

బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)పై వాహనదారులు గాల్లోకి దూసుకెళ్తున్నారు. నిర్ణీత వేగాన్ని మించి దౌడు తీస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతినెలా సగటున 40 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా పది ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 12 మంది క్షతగ్రాతులవుతున్నారు.
100 కి.మీలకు తగ్గింపు.. ముంబయి, నాగ్‌పుర్‌, వరంగల్‌, విజయవాడ, బెంగళూరు జాతీయ రహదారులతో అనుసంధానించడంతో అవుటర్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రతిరోజు సగటున 1.2 లక్షల పైచిలుకు వాహనాలు వెళ్తున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 158 కి.మీల ఓఆర్‌ఆర్‌ను గంటకు 120 కి.మీల వేగంతో దూసుకెళ్లేలా డిజైన్‌ చేశారు. అయితే ప్రమాదాలను తగ్గించేందుకుగాను యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) సమావేశంలో వేగ పరిమితిని 100 కి.మీలకు తగ్గించారు. అయినా ప్రమాదాల సంఖ్య తగ్గలేదు సరికదా పెరగడం గమనార్హం.

120 కి.మీల నుంచి 200 కి.మీల వరకు.. అవుటర్‌ ఎక్కడమే ఆలస్యం వాహనదారులు ఎక్కడా లేని హుషారొస్తుంది. మహా అయితే జరిమానా పడుతుంది అంతే కదా అంటూ గంటకు 120 కి.మీల నుంచి 200 కి.మీల వేగంతో దూసుకెళ్తున్నారు. జనవరి నుంచి అక్టోబర్‌ వరకు ఒక్క సైబరాబాద్‌ కమిషనరేట్‌లోనే రూ.31.4 కోట్ల జరిమానా విధించారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రాచకొండ పోలీసులు మరో రూ.10 కోట్లకుపైగా జరిమానా వేశారు. అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాల్లో 90 శాతానికి పైగా కార్లే ఉండటం గమనార్హం.

సీఆర్‌ఆర్‌ఐ హెచ్చరించినా.. కొన్నేళ్ల కిందట దిల్లీకి చెందిన కేంద్ర రహదారుల పరిశోధన సంస్థ(సీఆర్‌ఆర్‌ఐ) 3 నెలలపాటు ఓఆర్‌ఆర్‌పై అధ్యయనం నిర్వహించగా పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. పెద్ద కార్లు  208 కి.మీ. వేగంతో వెళ్తున్నట్లు వెల్లడైంది. చిన్న కార్లు 180 కి.మీల వేగంతో, ఇతర వాహనాలు కొన్ని 111 కి.మీలు, మరికొన్ని 100 కి.మీటర్ల వేగంతో దూసుకెళ్తున్నట్లుగా తేల్చింది. ఇష్టారీతిగా దౌడు తీసే వాహనదారులకు ముకుతాడు వేసే పర్యవేక్షణ వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లుగా స్పష్టం చేసింది. నిర్వహణపై దృష్టి సారించాలని, ప్రమాదాలు జరగకుండా ఏయే చర్యలు తీసుకోవాలో కూడా హెచ్‌ఎండీఏకు సూచించింది. ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు.

అతి వేగం, మద్యం మత్తులో నడపటం
ఓఆర్‌ఆర్‌పై తరచూ ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అతివేగం, మద్యం తాగి వాహనాలను నడపటం వల్ల ఈ జనవరి నుంచి అక్టోబర్‌ వరకు మొత్తం 95 ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్కసారిగా వేగాన్ని అదుపు చేయలేక ప్రాణాల మీదకు కొని తెచ్చుకుంటున్నారని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ 10 నెలల్లో రాచకొండ పోలీసులు ఓఆర్‌ఆర్‌పై 5115 కేసులు చేశారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 374 కేసుల్లో జైలు శిక్ష పడటం గమనార్హం. నిర్వహణ కొరవడి అధ్వానంగా మారిన ఓఆర్‌ఆర్‌ కూడా ప్రమాదాలకు కారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.