మంగళవారం, డిసెంబర్ 10, 2019
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బాలీవుడ్ జంట దీపికా పదుకొణె, రణవీర్ సింగ్‌లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఈ జంటకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. దీప్‌వీర్‌లు రేపు ఉదయం అమృత్‌సర్‌కు చేరుకొని స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట గత సంవత్సరం నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
మరోవైపు ఇవాళ శ్రీవారిని ఏపీ ఉప సభాపతి కోన రఘుపతి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు