close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

రోజుకు ఇద్దరు మరణిస్తున్నారు..!

పది నెలల్లో 710 మంది మృత్యువాత
సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2697 రోడ్డు ప్రమాదాలు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రతి రోజు సగటున ఇద్దరు మరణిస్తుంటే.. 8 మంది గాయపడుతున్నారు. అలా అనీ ఈ లెక్కలు మూడు పోలీస్‌ కమిషనరేట్లలో కలిపి అనుకునేరు.. ఒక్క సైబరాబాద్‌లోనే గత పది నెలల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 710 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఘోర రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగాలు చర్యలు తీసుకొంటూనే ఉన్నా పెరుగుతూనే ఉండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ పరిస్థితి..
రహదారులపై మరణ మృదంగం వినిపిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వాహనదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్‌ వరకు జరిగిన ప్రమాదాలపై ఆరా తీస్తే పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ప్రతి నెలా సగటున 250కి పైగా ప్రమాదాలు జరుగుతుండగా.. సగటున 70 మంది మృత్యువాత పడుతున్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చిలో అత్యధికంగా 317 ప్రమాదాలు జరిగాయి. జూలైలో 298 ప్రమాదాలు మాత్రమే జరిగినా.. 95 మంది మరణించారు.

అంతర్గత దారుల్లోనే..
జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాల వేగం గంటకు 100 కి.మీల నుంచి 120 కి.మీల వరకు ఉంటుంది. అదే అంతర్గత రహదారుల్లో 12 కి.మీల నుంచి 20 కి.మీలు మించదు. అయినా సరే.. జాతీయ, రాష్ట్ర రహదారులతో పోల్చితే 60 శాతం ప్రమాదాలు అంతర్గత రహదారుల్లోనే జరుగుతున్నాయి. నిర్వహణ కొరవడి అధ్వానంగా మారడం వల్లే ఈ రోడ్లపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నట్లుగా నిపుణులు తేల్చి చెబుతున్నారు. తరచూ ఈ రోడ్లను తవ్వడం, గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చకపోవడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకున్నట్లుగా వివరిస్తున్నారు.

ఎక్కువ మంది వారే..
మృత్యువాత పడుతున్న వాహనదారుల్లో ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులే ఉంటున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడంతో వేగం తక్కువగానే ఉంటున్నా ప్రమాదాల్లో కింద పడినప్పుడు తలకు తీవ్రగాయాలు కావడం, వెనుక నుంచి వచ్చే భారీ వాహనాలు పైనుంచి దూసుకెళ్లడం లాంటి ఘటనల వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులపై అతివేగం, మద్యం సేవించి వాహనాలను నడపటం, సిగ్నళ్ల జంపింగ్‌ కూడా కారణాలేనని వివరిస్తున్నారు.

* మొత్తం రోడ్డు ప్రమాదాలు: 2697
* ఘోర ప్రమాదాలు: 669
* సాధారణ ప్రమాదాలు: 2028
* మరణాలు: 710
* క్షతగాత్రులు: 2453 (నోట్‌: గణాంకాలు జనవరి నుంచి అక్టోబర్‌ వరకు)

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.