close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

బల్దియా @ రూ.5380కోట్లు

సిద్ధమైన ముసాయిదా పద్దు
ఆమోదించిన స్థాయీ సంఘం
గత ఏడాదితో పోల్చితే రూ.770 కోట్లు తక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే ఆర్థిక సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ ముసాయిదా పద్దును సిద్ధం చేసింది. ఆదాయ వ్యయాలను బేరీజు వేసి 2020-21 సంవత్సరానికి రూ.5380కోట్లుగా రూపుదిద్దుకున్న బడ్జెట్‌ను గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన స్థాయీ సంఘం ఆమోదించింది. గణాంకాలను చూస్తే 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో మాదిరి కాకుండా ఈ దఫా బల్దియా అంకెల గారడీకి యత్నించలేదని తెలుస్తోంది. ఇతర కార్పొరేషన్ల(గృహ, రహదారుల అభివృద్ధి సంస్థ) కోసం మునుపటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5వేల కోట్లకుపైగా పద్దును రూపొందించిన జీహెచ్‌ఎంసీ.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.1593కోట్లకు తగ్గించింది. రెండు పడకల ఇళ్ల నిర్మాణం, హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) కార్పొరేషన్లకు సర్కారు నుంచి నిధులు రావాల్సి ఉంటుందని, ఏ మేరకు నిధులు మంజూరైతే.. ఆమేరకు ఖర్చు చేస్తామని బల్దియా తెలిపింది. 2019-20తో పోలిస్తే 2020-21 ఆర్థిక సంవత్సరం పద్దు రూ.770కోట్లు తక్కువ. ప్రస్తుత పాలక మండలికి ఇదే ఆఖరు పద్దు. ప్రతిపాదిత ముసాయిదా పద్దును డిసెంబర్‌ 15న సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టి, దానిపై జనవరి 10, 2020న పాలకమండలిలో చర్చిస్తామని బల్దియా తెలిపింది. ఫిబ్రవరి 20న జరగనున్న సర్వసభ్య  సమావేశంలో పద్దును ఆమోదింపజేసుకుని మార్చి 7న ప్రభుత్వానికి పంపిస్తామని స్పష్టం చేసింది. నగరంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్సార్డీపీ) చాలా కీలకం. ఆ ప్రాజెక్టు కింద రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ.1639కోట్లు వెచ్చించాలని నిర్ణయించామన్నారు. అందుకు సంబంధించిన నిధులను బ్యాంకు రుణాల ద్వారా సేకరిస్తామన్నారు. జోన్లవారీగా మొత్తం 709కి.మీల రోడ్ల నిర్వహణ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ ఐదేళ్లపాటు ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. సంవత్సరానికి రూ.350కోట్ల వరకు ఖర్చవుతుంది. సర్కారు ఆ మొత్తాన్ని భరిస్తామని సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికి తగ్గట్లు యేటా నిధులు విడుదల చేస్తే.. నిర్వహణ కింద వెచ్చిద్దామనుకున్న రూ.1050కోట్లలో మిగులు ఏర్పడుతుందని, దాన్ని ఇతర అవసరాలకు మళ్లిస్తామని ఆర్థిక విభాగం తెలిపింది.

ఆర్థిక నిర్ణయాల వికేంద్రీకరణ...
నిధుల సమస్య తీవ్రమవడంతో ఇటీవల కేంద్ర కార్యాలయం జోన్లకు పరిమిత స్థాయిలో ప్రతి నెలా కొంత డబ్బును జమ చేస్తుంది. ఆ డబ్బు ఏయే మార్గాల్లో ఖర్చవుతుందో తెలుసుకునేందుకు కేంద్ర కార్యాలయం వికేంద్రీకరణ దిశగా అడుగులు వేసింది. ఇకపై అన్ని జోన్లలో ఆర్థిక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

రెవెన్యూ ఆదాయం ఇలా.. (రూ. కోట్లలో)
* ఆస్తిపన్ను, వీఎల్‌టీ, తదితర..   1803
* స్టాంపుడ్యూటీపై సర్‌ఛార్జి, వినోదపన్ను, తదితర   727
* మార్కెట్లు, దుకాణాల అద్దెలు, ప్రకటనల హక్కులు 23
* రుసుములు, వినియోగదారుల ఛార్జీలు..   1073
* అమ్మకాలు, అద్దె రుసుములు..     4.88
* ఎన్నికలు, మెప్మా, ఇతర గ్రాంట్ల నిధులు..   3.69
* పెట్టుబడుల ద్వారా వడ్డీలు..     10.18
* ఇతర ఆదాయ వనరులు.. 22.25

2020-21 ముసాయిదా అంచనా పద్దు ఇలా.. (రూ.కోట్లలో)
* రెవెన్యూ ఆదాయం 3667
* రెవెన్యూ వ్యయం 2750
* రెవెన్యూ మిగులు.. 917
* మూలధన రాబడులు 2630
* మూలధన వ్యయాలు 2630

రెవెన్యూ వ్యయం ఇలా.. (రూ. కోట్లలో)
* జీతాలు, ఇతరత్రా ఖర్చులు..   1415
* పరిపాలన వ్యయాలు   117
* నిర్వహణ ఖర్చులు     1050
* వడ్డీ, ఇతర ఛార్జీలు   137
* కార్యక్రమాల నిర్వహణ   31..

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.