శుక్రవారం, డిసెంబర్ 06, 2019
తెవివి క్యాంపస్(డిచ్పల్లి): తెవివి పరిధిలో నిర్వహించే పరీక్షల్లో డిటెన్షన్ విధానంపై ఉన్నత విద్యా మండలి నియమ, నిబంధనల్ని కచ్చితంగా పాటిస్తామని వర్సిటీ సీవోఈ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలన్నీ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు, యూనివర్సిటీ నిబంధనలకు లోబడే జరుగుతాయని పేర్కొన్నారు. డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలు ఆలస్యంగా జరిగినందున ఇటీవల విడుదలైన ఫలితాలను దృష్టిలో ఉంచుకుని డిటెండ్ నుంచి బయటపడ్డ విద్యార్థులు పైతరగతులకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కళాశాల యాజమాన్యాలు చేసిన వినతి సాధ్యంకాదని స్పష్టం చేశారు. డిటెన్షన్ విధానంపై విద్యార్థులకు ప్రిన్సిపాళ్లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం డిసెంబరు నుంచి 1, 3, 5 సెమిస్టర్ల రెగ్యులర్, 2, 4, 6 సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలు ఒకే షెడ్యూల్లో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సెల్ఫ్ సెంటర్లు మార్చాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించామన్నారు. ఐదేళ్లుగా అమల్లో ఉన్న నిబంధనల్ని మార్చబోమని పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు