గురువారం, డిసెంబర్ 05, 2019
వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ, పుర కమిషనర్
ఆత్మకూరు, న్యూస్‌టుడే : ‘నమ్మించి మంచి మాటలతో మభ్యపెట్టాడు.. ఆయన కారణంగా గర్భం దాల్చాను.. పెళ్లి చేయండి.. లేదంటే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంటా.’ అంటూ ఓ యువతి వాటర్ ట్యాంకు ఎక్కిన సంఘటన ఆత్మకూరులో సంచలనం కలిగించింది. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దాదాపు 5 గంటలు ఉత్కంఠ కలిగించిన ఈ వ్యవహారం అధికారుల చొరవతో కొలిక్కి వచ్చింది. దాంతో ఆందరూ ఊపిరి పీల్చుకొన్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నెల్లూరు కబాడిపాళేనికి చెందిన సింధుర్కుమార్ ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్‌సోర్సింగ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి బుధవారం పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వచ్చారు. సింధుర్కుమార్ను తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టారు. దాంతో అక్కడకు సింధుర్కుమార్ భార్య, బంధువులు వచ్చారు. యువతితో ఘర్షణ పడి దాడి చేశారు. దాంతో ఆ యువతి బుధవారం సాయంత్రం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కేసు పెట్టేందుకు యత్నించి ఫిర్యాదు ఇవ్వకుండానే వెనుదిరిగారు. గురువారం ఉదయం వరకు ఆత్మకూరులోనే ఉన్నారు. ఉదయం 8.30 గంటలకు హనుమాన్ జంక్షన్ ప్రాంతంలోని ప్రభుత్వ పాటిటెక్నిక్ కళాశాల పక్కనే ఉన్న పురపాలక వాటర్ ట్యాంకును ఎక్కారు. తనను సింధుర్కుమార్ మోసగించాడని, తనకు ఆయనతో పెళ్లి చేయకపోతే ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంటానని తెలిపారు. ఆత్మకూరు సీఐ పాపారావు, ఎస్సైలు రోజారాణి, సంతోష్‌కుమార్‌రెడ్డి, తహసీల్దారు మధుసూదనరావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆమెతో ఫోనులో మాట్లాడి కిందకు దిగాలని కోరగా.. అందుకామె రానని పట్టుబట్టారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల వరకు వర్షంలో తడుస్తూ ట్యాంకుపై నిలిచి ఉన్నారు. అనంతరం అధికారులు నెల్లూరులో ఉన్న సింధుర్కుమార్ను ఇక్కడకు పిలిపించారు. తగిన న్యాయం చేస్తామని అధికారులు, సింధుర్కుమార్ హామీ ఇవ్వడంతో ఆమె దిగి వచ్చారు. అనంతరం ఆమె నుంచి డీఎస్పీ వివరాలను తెలుసుకున్నారు. బలహీనంగా ఉన్న ఆమెను వైద్యచికిత్సల నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై డీఎస్పీని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రస్తుతం ఆమె మానసిక స్థితి సరిగాలేదని, కోలుకున్నాక విచారించి తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు