close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

తాజా వార్తలు

సజీవ దృశ్యం.. నాటక రూపం

‘ నేటి నుంచి కళాభారతి వేదికగా నాటక సప్తాహం
‘ ప్రారంభోత్సవానికి మంత్రులు రాక
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

నాటకం ఒక సజీవ దృశ్యం.. ఈ నాటకాలే సామాన్య జనంలో చైతన్య స్ఫూర్తిని రగిలించాయి. పాత తరంలో నాటక రంగంలో అనుభవం ఉన్నవారికే సినిమా అవకాశాలు వచ్చేవి. స్వాతంత్రోద్యమంలో నాటకాలే ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. ఆనాటి విదేశీ పాలకుల అరాచకాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించాయి. సినిమా, టీవీ మాధ్యమాలు లేనప్పుడు ఈ నాటకాలే వినోద కార్యక్రమాలుగా నిలిచాయి. జిల్లాలో మొదటి నుంచి పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాలు వేసే కళా సంస్థలు ఉన్నాయి. రాష్ట్రాలు వేరైన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ నాటక రంగం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. స్వాతంత్రోద్యమం నుంచి మన జిల్లాలో నాటకాలు వేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే జిల్లాలో ఎన్నో నాటక కళా సంస్థలు ఉన్నాయి. మరోసారి నాటక రుచిని ప్రేక్షకులకు పంచేందుకు నాటక సప్తాహం నిర్వహిస్తున్నారు. వారం రోజలు కరీంనగర్‌లో పండగ వాతావరణం నెలకొననుంది. కళాభారతి వేదికగా ఏడు రోజుల పాటు ఉత్తమ నాటకాలు ప్రదర్శనకు నోచుకోనున్నాయి.

మన సమైక్య కల్చరల్‌ అకాడమీ
కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో 1997వ సంవత్సరంలో మానకొండూరు గ్రామానికి చెందిన యువకులు, కళాకారులు, సామాజిక సేవా కార్యకర్తలు కలిసి మన సమైక్యతా కల్చరల్‌ అకాడమీ ఏర్పాటు చేశారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఇంజినీర్‌ రొడ్డ యాదగిరితో పాటు పలువురు ఈ సంస్థను నడిపిస్తున్నారు. 22 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు ఉత్తమమైన 10 నాటకాలు వేసి ప్రశంసలు పొందింది. పూణె లాంటి ప్రాంతాల్లో నాటకాలు వేసి మెప్పించారు. మినిస్టర్‌, రసరాజ్యం, మార్గదర్శి, బాపు చెప్పిన మాట, క్షతగాత్రుడు, అంతాబ్రాంతియే, పెన్‌ కౌంటర్‌, ఎవరో ఒకరు, అమెరికా అల్లుడు లాంటి నాటకాల వేసి ఈ సంస్థ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్‌, కోట శంకర్‌రావు, మల్లాది భాస్కర్‌ లాంటి నటులు, బి.వి.చౌదరి లాంటి సినీ డైరెక్టర్‌లను సన్మానించింది.

నేటి నుంచి నాటకాలు
 రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ వారి సౌజన్యంతో పాటు మన సమైక్యత కల్చరల్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కళాభారతిలో ఈ నాటక సప్తాహం ఆరంభమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌లో ఈ నాటక సప్తాహం నిర్వహించారు. నాలుగోసారి కరీంనగర్‌లో నిర్వహిస్తున్నారు. ఆరంభ రోజు మంత్రులు గంగుల కమలాకర్‌, వి.శ్రీనివాసగౌడ్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు హాజరవుతున్నారు. మొదటి రోజు నీతి రేఖలు నాటిక ప్రదర్శన ఉంటుంది. సాయంత్రం 6.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 8 గంటలకు నాటక ప్రదర్శన ఉంటుంది. 18న పితృవిలాపం, 19న అంతాబ్రాంతియే, 20న వైద్యో నారాయణో హరి, 21న ఆ ఉదయం ఎప్పుడో, 22న పద్మవ్యూహం, 23న మినిస్టర్‌ సినీ, టీవీ నటుడు కోట శంకర్‌రావు దర్శకత్వంలో నాటక ప్రదర్శన ఉంది. అదే రోజు ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నారు.

నాటకాలను ఆదరించండి
- రొడ్డ యాదగిరి, వ్యవస్థాపకుడు, మన సమైక్యత కల్చరల్‌ అకాడమీ
వారం రోజుల నాటక పండుగ ఉత్సవాలు చూసి ఆనందించాలి. మన నాటకానికి పునర్జీవం కల్పించాలని ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. నాటకాలను ఈ తరం పిల్లలకు చూపించాలి. సామాజికంగా మానవ సంబంధాలు, మానసిక హావభావాలు తెలుసుకొనే వీలుంటుంది. నాటకాలను వీక్షించండి. వినోదం పొందాలని నిర్వహిస్తున్నాం.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.