శుక్రవారం, డిసెంబర్ 13, 2019
● ఆంగ్లం బిట్ పేపర్ లేకనే నిర్వహణ
● అడుగడుగునా పర్యవేక్షణ లోపం
కర్నూలు విద్య, డోన్ పట్టణం, న్యూస్‌టుడే : సంగ్రహణాత్మక మూల్యాంకనం (సమ్మెటిక్ అసెస్మెంట్)-1 పరీక్ష గందరగోళంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాలమేరకు శనివారం నిర్వహించిన పరీక్షలో తొమ్మిదో తరగతి ఆంగ్ల సబ్జెక్టులో ఆంగ్ల మాధ్యమం బిట్ పేపర్ ఇవ్వలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఆంగ్లం పరీక్ష నిర్వహించేందుకు ఉపాధ్యాయులు ప్రశ్నపత్రాల బండిళ్లు ఓపెన్ చేయగా బిట్ పేపర్ కనిపించలేదు. దీంతో ఉమ్మడి పరీక్షల విభాగం అధికారులు పాఠశాలలకు హడావిడిగా మెయిల్ ద్వారా బిట్ పేపర్‌ను పంపి జిరాక్స్ చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిరాక్స్ కేంద్రాలు అందుబాటులో లేని మండల, జిల్లా సరిహద్దు పాఠశాలలు విద్యార్థులకు బిట్ పేపర్ రాయించకుండానే ఉపాధ్యాయులు పరీక్ష ముగించేశారు.
పబ్లిక్ తరహాలో..
విద్యాశాఖ ఎస్ఏ-1 పరీక్షలను పబ్లిక్ తరహాలో నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యంలో జిల్లావ్యాప్తంగా 2,427 ప్రాథమిక, 950 ప్రాథమికోన్నత, 1,015 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు 13వ తేదీ నుంచి సమ్మెటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎస్ఏ-1 పరీక్షల ప్రశ్నపత్రాలను ఎస్సీఈఆర్టీ అధికారులు రూపొందించి జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థకు అందించారు. వారు సంబంధిత ఎంఈవోలకు నిర్దేశిత సమయంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఎవరికివారు పట్టించుకోక..
ఎస్ఏ-1 పరీక్షలను జిల్లాలో డీసీఈబీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, ప్రింటింగ్ పనులు తదితర అన్నింటినీ ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. ఎస్సీఈఆర్టీ రూపొందించిన ప్రశ్నపత్రాలను విజయవాడ కేంద్రంలోని ప్రైవేటు ప్రింటర్ వద్ద ప్రింటింగ్ చేయించారు. ప్రింటింగ్ ఏజెన్సీ నిర్వహకులు 9వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ఆంగ్లం సబ్జెక్టు బిట్ పేపర్‌ను బండిళ్లలో అమర్చకుండానే జిల్లాకు పంపేశారు. అన్ని పేపర్లు సక్రమంగా ఉంటాయని భావించిన డీసీఈబీ అధికారులు మండల కేంద్రాలకు పంపారు. గతంలో సమ్మెటివ్ పరీక్ష పత్రాల లీకేజీ, అనుకున్న తేదీకి పరీక్షలు నిర్వహించలేకపోవడం వంటి పొరపాట్లు జరిగాయి. అదే తరహాలోనే ఈ ఏడాది ఎస్ఏ-1 పరీక్షల్లో ప్రింటర్ నిర్వాహకుడి అలసత్వం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తూతూమంత్రంగా ముగించేశారు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం జరిగిన పరీక్షలో బిట్‌పేపర్ లేకుండానే ముగించేశారు. డీసీఈబీ ద్వారా పంపిన మెయిల్ బిట్‌పేపర్‌ను కొన్ని ప్రైవేటు పాఠశాలలు జిరాక్స్ చేయించుకోగా.. మరికొన్ని బిట్పేపర్తోపాటు సమాధానాలను సైతం ఉపాధ్యాయులతోనే చేయించారని విద్యార్థులు చెబుతున్నారు. జిరాక్స్ కేంద్రాలు లేనిచోట బిట్‌పేపర్ లేకుండానే పరీక్షను ముగించారు. దీనిపై పాఠశాలల యాజమాన్యం, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. మెయిల్ ద్వారా పంపిన బిట్ పేపర్‌ను పిల్లలతో పరీక్ష రాయించామని, మళ్లీ వాయిదా వేయడం ఎందుకని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై డీసీఈబీ కార్యదర్శి నాగరాజును ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, వారి ఆదేశాలమేరకు నడుచుకుంటామని తెలిపారు. బిట్పేపరును అన్ని పాఠశాలలకు మెయిల్ ద్వారా పంపామన్నారు. ప్రింటింగ్ ప్రెస్ ఏజెన్సీ నిర్వాహకులు బండిళ్లల్లో బిట్పేపరును జతపరచకపోవడంతో ఈ సమస్య ఎదురైందని పేర్కొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు