close

సోమవారం, డిసెంబర్ 09, 2019

తాజా వార్తలు

గొలుసు కడుతున్నారు

గ్రామగ్రామాన మద్యం విక్రయాలు ● దాడులు అరకొర

సిబ్బంది పాత్రే ఎక్కువ

న్యూస్‌టుడే, ఇందూరు సిటీ

ఏకంగా ఆబ్కారీ అధికారులే గొలుసు దుకాణాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది కూడా తక్కువేం తినలేదు. పల్లెల్లో గొలుసు కట్టేందుకు ఆసరా ఇస్తున్నారు. కొత్త మద్యం దుకాణాలకు లైసెన్సులు కట్టబెట్టడంతోనే కొత్తగా బెల్ట్‌దుకాణాలను ఏర్పాటు చేసుకునే పని జోరుగా సాగుతోంది. కేవలం ఈ దుకాణాల ద్వారానే రోజుకి రూ.50 లక్షల వ్యాపారం జరుగుతోంది.

ఇదీ పరిస్థితి

* జిల్లాలో మొత్తం 91 మద్యం దుకాణాలున్నాయి. ఇటీవలే వీటన్నింటికి కొత్తగా లైసెన్సులు జారీ చేశారు మరో రెండేళ్ల పాటు వీరే దుకాణాలను నడిపించనున్నారు. ఈ దుకాణాలతో పాటు అనధికారికంగా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి..

* అనధికారిక గొలుసు దుకాణాలు సుమారు 200 పైబడి ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా ఆర్మూర్‌, మోర్తాడ్‌ పరిధిలోనే ఉన్నాయి. నిజానికి అధికారిక దుకాణాల కంటే రెండింతలు అధికంగా ఈ దుకాణాలున్నాయి.

* ప్రస్తుతం మద్యం దుకాణాల్లో రోజుకి రూ.2.50 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం అనుమతుల్లేని దుకాణాల ద్వారానే రూ.50-60 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలు గొలుసు దుకాణాల్లో రోజుకి రూ.50 వేల మద్యం అమ్ముడవుతోంది.

* వీటిల్లో పగలు, రాత్రిళ్లు మద్యం విక్రయాలు జరుగుతుండడంతో యువత మద్యానికి బానిసవుతున్నారు. ఇటీవల ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఇదే విషయమై నిజామాబాద్‌ పాలనాధికారికి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

నిబంధనలు ఇలా

ఎలాంటి లైసెన్సులు లేకుండా మద్యం విక్రయాలు జరపడం చట్టవిరుద్ధం. ఇలాంటి వారిపై ఆబ్కారీ శాఖ అధికారులకు నేరుగా కేసులు నమోదు చేసే అధికారం ఉంది. పట్టుబడిన వారికి శిక్షతో పాటు భారీ జరిమానాలు అమలవుతాయి.

34ఏ టీఎస్‌ ఎక్సైజ్‌ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. ఒక వ్యక్తి వద్ద ఆరు లీటర్లు(బాటిళ్ల) మద్యం కలిగి ఉండవచ్చన్న నిబంధన ఉంది. అంతకు మించి ఉంటే అక్రమ మద్యంగా గుర్తిస్తారు.

* శుభకార్యాలు జరిగినా, విందు కార్యక్రమాలు ఉన్నా ఆరు బాటిళ్లకు మించి తీసుకోవద్ధు వాస్తవానికి ఒక వ్యక్తికి ఇంతకు మించి విక్రయించొద్ధు ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి ఉంటే తప్ప నిబంధనలు దాటి మద్యం ఇవ్వకూడదు. ఇంత కఠినంగా నిబంధనలు ఉన్నా.. గొలుసు దుకాణాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి.

సిబ్బంది పాత్ర..

* గొలుసు దుకాణాల్లో కొందరు సిబ్బంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తమ బంధువులు, స్నేహితుల ద్వారా అనధికారికంగా మద్యం దుకాణాలు నడిపిస్తున్నట్లు సమాచారం.

* దీంతో దుకాణాలపై సమాచారం ఉన్నా దాడులు జరగకుండా చూసుకుంటున్నారు. వందల్లో దుకాణాలు ఉంటే మొక్కుబడిగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్నారు.

అంతా మిలాఖత్‌

గొలుసు దుకాణాల నుంచి సర్కిళ్ల వారీగా మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న గొలుసు దుకాణాల నుంచి నెలకు రూ.2-రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. దీంతో వీటిపై దాడులు చేసేందుకు సాహసించట్లేదు. నిజానికి గొలుసు దుకాణంపై దాడి జరిగినపుడు మద్యం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరగాలి. ఆ దుకాణంపై కూడా కేసు నమోదు చేయాలి. మద్యం సీసాలపై పక్కా ఆధారాలు కూడా ఉంటాయి. కానీ, ఈ తరహాలో అధికారులు దర్యాప్తు చేయట్లేదు.● ఒకవేళ వివరాలు తెలిస్తే లైసెన్సుదారులతో బేరసారాలు చేసి కేసులు లేకుండా వదిలేస్తున్నారు. దీంతో మూడుపువ్వులు ఆరుకాయలు అన్న చందంలా దందా నడుస్తోంది.

దుకాణాల నిర్వాహకులే..

* గొలుసు దుకాణాల నిర్వహణలో మద్యం దుకాణాదారులదే ప్రధాన పాత్ర ఉంటోంది. ఒక్కో అధికారిక దుకాణం పరిధిలో 2-8 చిన్న దుకాణాలు ఉన్నాయి. ఎమ్మార్పీ ధరపై రూ.5-రూ.50 వరకు తక్కువ చేసి ఈ దుకాణాదారులకు మద్యాన్ని కట్టబెడుతున్నారు. తిరిగి వీరు ఎమ్మార్పీపై రూ.10-రూ.100 అదనం చేసి విక్రయిస్తున్నారు.

* వీరికి ఎక్సైజ్‌ శాఖతో సంబంధాలు ఉండడంతో గొలుసు దుకాణాలపై దాడులు చేయకుండా చూసుకుంటున్నారు. చాలా చోట్ల లైసెన్సులు కలిగిన దుకాణాదారులే ఆబ్కారీ సిబ్బందికి నెలనెలా కొంత అమ్యామ్యాలు అందిస్తున్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉంటుంది

నవీన్‌ చంద్ర, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌

అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఈ విషయమై నిత్యం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉంటుంది. ప్రతీ ఫిర్యాదుపై స్పందిస్తున్నాం. ఎక్కడ గొలుసు దుకాణం ఉందని గుర్తించినా వెంటనే సీజ్‌ చేస్తున్నాం. ఈ విషయమై ప్రజల సహకారం కూడా అవసరం. ఎలాంటి సమాచారం ఉన్నా మాకు చేరవేయాలి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.