ఆదివారం, డిసెంబర్ 15, 2019
హత్యకు గురైన యువకుడు
నిజామాబాద్ నేరవార్తలు, న్యూస్‌టుడే: నిజామాబాద్ నగరంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిందితులు క్రూరంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని రోడ్డుపై పారేసి వెళ్లారు. పాటిగల్లీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకొంది. అనుమానాస్పదంగా మృతదేహం పడి ఉందని కాలనీవాసులు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. నాలుగో ఠాణా ఎస్సై లక్ష్మయ్య హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యగా తేల్చారు. మృతునిది నాగారం. అతని పేరు ఫిరోజ్(28)గా గుర్తించారు. పక్కనే ఉన్న ఇంటి వద్ద రక్తపు మరకలు ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఇంటి తాళాన్ని ధ్వంసం చేసి లోనికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో హత్య చేసిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు.
నాగారంకు చెందిన ఫిరోజ్ ఓ సామిల్లులో పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఇతను రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు ఫోన్ చేసినా స్పందన లేదు. చివరకు హత్యకు గురైనట్టు తెలియడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు.
హత్య జరిగిన ఇంటి తాళాన్ని తీస్తున్న పోలీసులు
హత్య చేసింది అతనే..
పాటిగల్లీలో నివాసం ఉండే ఇర్ఫాన్‌తో ఫిరోజ్‌కు పరిచయం ఉంది. ఫిరోజ్ శుక్రవారం సాయంత్రం ఇర్ఫాన్ ఇంట్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత ఫిరోజ్‌ను ఇర్ఫాన్ కత్తితో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. వీరితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్నది తేలాల్సి ఉంది. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అదనపు ఏసీపీ శ్రీనివాస్ కుమార్, నగర సీఐ సత్యనారాయణ ఇతర అధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడి మృతి
సదాశివనగర్, : తిర్మన్‌పల్లి శివారులో శనివారం ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు కుక్కను తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడటంతో మృతి చెందాడు. మరొకరి తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన రవితేజరాజు (27), వెంకటేశ్వర్లు ద్విచక్రవాహనం పై రామారెడ్డి, ఇస్సన్నపల్లికి వెళ్తుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై నరేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా వెంటనే 108లో కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రవితేజరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. తండ్రి వ్యాసభట్టు నర్సింహరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జిల్లా వార్తలు