బుధవారం, డిసెంబర్ 11, 2019
రూ.8 కోట్లతో అభివృద్ధి
మారనున్న కోరుట్ల పట్టణ రూపురేఖలు
కోరుట్ల, న్యూస్‌టుడే పట్టణంలో చేపడుతున్న సుందరీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పట్టణ రూపు రేఖలు మారనున్నాయి. టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.8 కోట్లతో పట్టణంలో జాతీయరహదారికి ఇరువైపులా మురుగు కాలువతో పాటు పైపు లైను వేయడానికి డక్ట్ నిర్మాణం, కార్పొరేషన్ తరహాలో ఆధునిక డివైడర్ల పనులు చేపడుతున్నారు. మెట్పల్లి రోడ్ మార్కెట్ కమిటీ నుంచి జగిత్యాల రహదారి గౌతమ్ మాడల్ స్కూల్ వరకు 4 కిలోమీటర్లు జాతీయ రహదారికి ఇరువైపులా మురుగు కాలువ, డక్ట్ నిర్మాణంతో పాటు కాలువపై పాదచారులు నడిచేలా స్లాబ్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. కాలువ నిర్మాణ పనులు పట్టణ శివారు ప్రాంతాల్లో పూర్తికాగా గోదాం చౌరస్తా వద్ద కొనసాగుతున్నాయి. కార్గిల్, కొత్తబస్టాండ్ ప్రాంతాల్లో మురుగు కాలువ నిర్మాణాపనులు చేపట్టాల్సి ఉంది. అధునిక డివైడర్ల పనులు పూర్తికావస్తున్నాయి. శివారు ప్రాంతాలతో పాటు బస్టాండ్ ప్రాంతాల్లో పనులు పూర్తికాగా కార్గిల్ చౌరస్తా, పాతబస్టాండ్ ప్రాంతాల్లో పనులు కావాల్సి ఉంది. జాతీయ రహదారికి ఇరువైపుల నిబంధనల ప్రకారం 50 అడుగుల విస్తీర్ణంలో ు కాలువ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా ముందుగా మార్కింగ్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల 50 అడుగుల కన్నా ముందు వరకు నిర్మాణాలు ఉన్నా వాటిని తొలగించకుండా నిర్మాణాలు చేపట్టడంతో కొన్ని చోట్ల రహదారి ఇరుకుగా మారే ప్రమాదముంది. 50 అడుగుల నిబంధన ప్రకారం ఇరువైపులా మురుగు కాలువ పనులు చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు. పనులన్నీ పూర్తయితే ఆధునిక డివైడర్లు, నూతన సెంట్రల్ లైటింగ్‌తో పట్టణం కొత్త రూపు సంతరించుకోనుంది.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు