మంగళవారం, డిసెంబర్ 10, 2019
పోలీసులకు హేగ్ డిప్యూటీ మేయర్ బృందం అభినందనలు
ఈనాడు,హైదరాబాద్
‘‘మీరు అవలంభిస్తున్న కొత్త విధానాలు, సీసీ కెమెరాల వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు బాగున్నాయ్’’ అంటూ హేగ్ నగరం డిప్యూటీ మేయర్ మారిన్ లీటెన్ బుధవారం అభినందించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆయన పోలీస్‌శాఖ వినియోగిస్తున్న అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం, సోషల్ మీడియా విభాగం, వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రక్రియలను తన బృందంతో కలిసి తెలుసుకున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక పీటీజెడ్ కెమెరాలు, సిగ్నళ్లకు అమర్చిన సీసీ కెమెరాల పనితీరు బాగుందని కితాబిచ్చారు.
బహుళ అవసరాలకు వినియోగిస్తున్నాం.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ప్రజా భాగస్వామ్యంతో అమర్చిన కెమెరాలను బహుళ అవసరాలకు వినియోగిస్తున్నామని కొత్వాల్ అంజనీ కుమార్ హేగ్ డిప్యూటీ మేయర్ మారిన్ లీటెన్కు వివరించారు. వినాయక శోభాయాత్ర, వీరహనుమాన్ విజయ యాత్రతో పాటు ఊరేగింపులు, ర్యాలీల సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచే ఊరేగింపు తీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. రహదారులపై వాహనాలను నియంత్రించే క్రమంలో వాహన చోదకులతో వ్యవహరించిన తీరుపై ఎలాంటి విమర్శలు తలెత్తకుండా బాడీవోర్న్ కెమెరాలను వినియోగిస్తున్నామని, వీటి కారణంగా ట్రాఫిక్ పోలీసులపై ఫిర్యాదులు రావడం లేదని తెలిపారు. అటు పోలీసులు, ఇటు వాహనచోదకులు తమ హద్దులను గుర్తించేందుకు బాడీవోర్న్ కెమెరా ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో హేగ్ డిప్యూటీమేయర్ మారిన్ లీటెన్ తో పాటు మార్టిన్ వాన్, టీ-హబ్ ఉపాధ్యక్షుడు రామ అయ్యర్ పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు