శనివారం, డిసెంబర్ 14, 2019
10 సర్కిళ్లలో 430 ఇళ్ల పరిశీలన
ఇక నగర వ్యాప్తం అంటోన్న జీహెచ్ఎంసీ
ఆదాయం రూ.2వేల కోట్లకు చేరేలా ప్రణాళిక
ఈనాడు, హైదరాబాద్
ఎట్టకేలకు నగరంలో ఆస్తి పన్ను పునర్మదింపు సర్వే మొదలైంది. 3డీ సర్వే, 2డీ సర్వే అంటూ.. మూడేళ్లుగా చర్చలు జరిగిన తర్వాత ప్రక్రియ పట్టాలెక్కింది. తక్కువ సమయం, నామమాత్రపు వ్యయంతో పూర్తయ్యే 2డీ సర్వేకు బల్దియా జై కొట్టింది. అందులో భాగంగా వారం క్రితం నగరవ్యాప్తంగా పది సర్కిళ్ల పరిధిలో అధికారులు నమూనా సర్వే చేపట్టారు. ప్రారంభంలో తలెత్తిన సాంకేతిక లోపాలను పరిష్కరించారు. మొత్తంగా 430 నిర్మాణాల వివరాలను పరిశీలించగా.. పన్ను పరిధిలో లేని నిర్మాణాలు, వాస్తవానికన్నా తక్కువ పన్ను చెల్లిస్తున్న భవనాలు వెలుగులోకి వచ్చాయి. ఇక సిబ్బందికి పూర్తిస్థాయి బాధ్యతలిచ్చి సర్వేను విస్తృతం చేస్తామని, రూ.2వేల కోట్ల ఆదాయమే లక్ష్యమని జీహెచ్ఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది.
మెరుగవ్వని ఖజానా..
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మూడేళ్లుగా తీవ్రమైన నిధుల సమస్యతో సతమతం అవుతోంది. ఆస్తిపన్ను వసూళ్లు రూ.800 కోట్ల నుంచి రూ.1,400 కోట్లకు పెరిగినప్పటికీ ఖజానా పరిస్థితి మెరుగవ్వలేదు. రూ.వంద కోట్ల వ్యయాన్ని దాటిన నిర్వహణ పనులు, రూ.వేలాది కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులే అందుకు కారణం. వాటికితోడు రెండు పడకల ఇళ్ల ప్రాజెక్టు రూపంలో బల్దియాకు అదనపు భారం వచ్చి పడింది. ఫలితంగా బల్దియా ఖజానా ముందు ఇప్పటికప్పుడు రూ.600 కోట్లకుపైగా బిల్లులు ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. జోనల్ కార్యాలయాలకు గతంలో మాదిరి నిధుల కేటాయింపు జరగట్లేదు. అభివృద్ధి పనులను ఇంజినీర్లు, జోనల్ కమిషనరు, కమిషనర్ ఆచూతూచీ ఆమోదిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల భూసేకరణ, నష్ట పరిహారం వంటి కార్యక్రమాలను ప్రాధాన్య క్రమంలో చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు బల్దియా నడుం బిగించింది. ప్రాథమిక విలువను సవరిస్తే.. ప్రజలందరిపైనా భారం పడుతుందని భావించిన యంత్రాంగం.. పునర్మదింపునకు శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లించని నిర్మాణాలను, ఖాళీ స్థలం పన్నును, తక్కువ పన్ను చెల్లిస్తున్న నిర్మాణాలను కలిపి మొత్తంగా అన్ని భవనాలు, వాణిజ్య కట్టడాలను లెక్కల్లోకి తీసుకురావాలని సంకల్పించింది. అందుకు నగర ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి, ప్రతి ఇంటి సమాచారాన్ని డిజిటలీకరణ చేసే 2డీ సర్వేను ఎంచుకుంది.
‘ట్రాక్’ నుంచి పటాలు..జీహెచ్ఎంసీకి నగరంలోని ట్రాక్(తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్) ఉపగ్రహ చిత్రాలను అందిస్తోంది. అందుకు సుమారు రూ.60 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలిపారు. పునర్మదింపులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలనలో పాల్గొనే సిబ్బంది డిజిటల్ పటాలపై ప్రస్తుతం ఉన్న ఇంటి చిత్రాలను చేర్చుతారు.
ఇలా చేస్తారు.. బిల్కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు ట్యాబ్‌లతో ప్రతి భవనాన్ని ఫొటో తీసి వాటిని జియో ట్యాగ్ చేస్తారు. భవనానికి అనుమతి ఉందా, పైన సెల్‌టవర్ ఉందా, అక్రమనిర్మాణమా, తక్కువ పన్ను చెల్లిస్తున్నారా.. వంటి వివరాలను సరిచూసుకుని నమోదు చేస్తారు.
ప్రధానాంశాలు
నేషనల్ నియోనాటాలజీ ఫోరం ఆధ్వర్యంలో మాదాపూర్ హెచ్ఐసీసీలో శుక్రవారం ‘నియోకాన్’ సదస్సు
పిల్లలు, పెద్దల జిజ్ఞాసను తీర్చే ప్రదర్శనశాలలకు హైదరాబాద్‌లో కొదవ లేదు. చారిత్రక, వైజ్ఞానిక,
జిల్లా వార్తలు