గురువారం, డిసెంబర్ 05, 2019
కర్నూలులో కొనసాగుతున్న సేవలు
● ఈనెల 23న సత్యసాయిబాబా జయంతి వేడుకలు
కర్నూలులోని సత్యసాయి మందిరం..
కర్నూలు నగరం, న్యూస్‌టుడే: ‘‘ అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు..’’.. భగవాన్ శ్రీసత్యసాయిబాబా భోధనలు, సూక్తులు అమలు చేయడంలో సంస్థలు నిరంతరం కృషిచేస్తున్నాయి. సత్యసాయిసేవా సంస్థలు ఏళ్లుగా ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు సేవాదల్ సభ్యులు ఫలాపేక్షలేకుండా సేవలు చేయడం అభినందనీయం. ఈనెల 23న భగవాన్ సత్యసాయిబాబా 94వ జయంతి వేడుకలు జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్నూలులో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సత్యసాయి సేవా కార్యక్రమాలు
కర్నూలు జిల్లాలో 6 సమితులు, 8 భజన మండళ్లు ఉన్నాయి. ఏటా మూడు విడతల్లో 220 మంది సేవాదళ్ సభ్యులు పుట్టపర్తిలో జరిగే సేవలో పాల్గొంటారు. వీటిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, నందివర్గం, బేతంచెర్ల సమితిల నుంచి సేవాదల్సభ్యులు పాల్గొనడం విశేషం.
ఏడాది పొడవునా..
కర్నూలు సత్యసాయిసేవా సమితి 36 ఏళ్ల క్రితం ఏర్పడింది. సమితి ఆధ్వర్యంలో ఏడాది పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన సాయిబాబా నేతృత్వంలో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహిస్తూ..ఏటా రు.8 లక్షలకుపైగా వ్యయం చేస్తున్నారు. ప్రతిరోజు 37 నిరుపేద, అశక్తులైన కుటుంబాలకు రెండుపూటలకు సరిపడే భోజనం అందజేస్తున్నారు. 40 పేద కుటుంబాలకు నెలకు సరిపడే నిత్యావసర సరకులు (అమృత కలశాలు)అందజేస్తున్నారు. వీటితోపాటు ప్రతివారం వైద్యశిబిరాలు, హోమియో శిబిరాలు, మూడు నెలలకు ఒకసారి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని సమితి కన్వీనరు మాకా అశోక్‌కుమార్ తెలిపారు. కర్నూలు నగరంలో పౌష్టికాహారానికి ఇబ్బందులు పడుతున్న గర్భిణులను గుర్తించి..వారికి ఆహారం అందించడంతోపాటు.. కాన్పు అయ్యేంత వరకు సత్యసాయి సేవాదళ్ సేవలు నిర్వహిస్తున్నారు.
● బీద విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకుగాను ఆదోనికి చెందిన నరసింహారెడ్డికి ట్రిపుల్‌ఐటీలో రెండేళ్లపాటు కర్నూలు సమితి ఆధ్వర్యంలో ఫీజులు చెల్లించారు.
అన్ని సమితుల్లోనూ సేవాస్ఫూర్తి
జిల్లాలోని నంద్యాల, బేతంచెర్ల, ఆత్మకూరు, నందివర్గం, బనగానపల్లి, శ్రీశైలం, రాగమయూరి (కర్నూలు నగరశివారు), డోన్ తదితర కేంద్రాల్లోని సమితులు, భజన మండళ్లలో నిరంతరం సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నందివర్గంలో విద్యాజ్యోతి కార్యక్రమం అమలు చేస్తున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు