close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

తాజా వార్తలు

లెక్కలేనితనమే!

 పంచాయతీల్లో విచ్చలవిడిగా అక్రమాలు

 నిధులు స్వాహా చేసినా చర్యలు అంతంతే

 నేతల ఒత్తిళ్లతో తిరిగి పోస్టింగులు

 

పంచాయతీల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిధులు కేటాయించి అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఇంత వరకు బాగానే ఉన్నా నిధులపై పర్యవేక్షణ కరవైంది. పంచాయతీల ఖజానాలకు వచ్చే సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. రూ.లక్షలు పక్కదారి పట్టిస్తున్నారు. సస్పెండ్‌ చేసినా తిరిగి తమకున్న పలుకుబడితో పోస్టింగులు తెచ్చుకుంటున్నారు. కఠినచర్యలు కానరాకపోవడంతో ఎవరికివారు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

- న్యూస్‌టుడే, కర్నూలు నగరం (జడ్పీ)

జిల్లాలో 910 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పర్యవేక్షణ కరవవడంతో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీఎల్‌పీవోలు, ఈవోఆర్డీలు క్షేత్రస్థాయి పర్యటన, తనిఖీలు చేయకపోవడంతో అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీసం మూడు నెలలకు ఒకసారి కూడా డీపీవో జిల్లాస్థాయి సమావేశం నిర్వహించకపోవడం.. సమీక్షలు కానరాకపోవడంతో పంచాయతీల్లో అసలేం జరుగుతుందో అంతుపట్టడం లేదు. వాస్తవానికి వారు క్షేత్రస్థాయిలో పర్యటించి పలు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ పరిస్థితి కానరావడం లేదు.
రూ.లక్షలు స్వాహా

● పత్తికొండ మేజరు పంచాయతీకి ఏడాదికి రూ.65 లక్షల వరకు ఆదాయం వస్తుంది. 45 వేలకుపైగా జనాభా ఉన్న ఈ పంచాయతీలో గతంలో ఇన్‌ఛార్జి కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏకంగా రూ.60 లక్షల వరకు పంచాయతీ నిధులను స్వాహా చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారించి నిధులు దుర్వినియోగం చేసిన వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేసి అతని వద్ద నుంచి రూ.24 లక్షలు వసూలు చేశారు. మిగిలిన నిధులకు లెక్కల్లేవు. పెండింగ్‌ ఎంక్వైరీ పేరుతో తిరిగి కోడుమూరు పంచాయతీ శానిటరీ ఇన్‌స్పెక్టరుగా పోస్టింగ్‌ ఇవ్వడం గమనార్హం. ● ఆలూరు మేజరు పంచాయతీలో గతేడాది ఆదినారాయణరెడ్డి అనే ఉద్యోగి ఏకంగా రూ.34 లక్షలు స్వాహా చేశారు. నాలుగు నెలల తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఆయన ఇప్పటివరకు ఈ సొమ్మును తిరిగి చెల్లించలేదు. పోస్టింగ్‌ రాలేదు. ● ఈ ఏడాది మేలో రుద్రవరం పంచాయతీ పరిధిలో ఇంటి పన్ను, వేలం పాటల ద్వారా వచ్చిన సొమ్ములో రూ.6.50 లక్షలను కార్యదర్శి స్వాహా చేసినట్లు రుజువవడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. ఇప్పటివరకు విచారణ మాత్రం కానరాలేదు. ● ఆస్పరి మండలం బిల్లేకల్లు పంచాయతీ పరిధిలోని మార్కెట్‌ వేలాల్లో అక్రమంగా రూ.5 లక్షల సొమ్ము స్వాహా చేసిన కార్యదర్శిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ● మరికొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వారి పేరుతో పింఛను సొమ్మును సైతం స్వాహా చేసేశారు. ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం.

తొలగింపు.. ఆపై కొనసాగింపు: జిల్లాలో కొందరు ఈవోఆర్డీలను సస్పెండ్‌ చేయడం.. కొద్దిరోజుల తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకోవడం పరిపాటైంది. జిల్లాలోని పలు పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడిన కార్యదర్శులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత కొందరు రాజకీయ పలుకుబడితో తిరిగి పోస్టింగులు తెచ్చుకుని ఉద్యోగాల్లో కొనసాగుతుండడం గమనార్హం. నిబంధనల ప్రకారం అక్రమాలకు పాల్పడినవారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ సొమ్మును తిరిగి రాబట్టాల్సి ఉంది. కానీ ఆరోపణలు, అక్రమాలు రుజువుకాకముందే తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఉన్నతాధికారులు తిరిగి పోస్టింగులు ఇచ్చేస్తున్నారు.

అక్రమాలపై కఠినచర్యలు - కె.ఎల్‌.ప్రభాకరరావ్‌, జిల్లా పంచాయతీ అధికారి, కర్నూలు

జిల్లాలోని కొన్ని పంచాయతీల్లో కొందరు ఉద్యోగులకు అక్రమాలకు పాల్పడటంతో వారిని విధుల నుంచి తొలగించాం. అక్రమాలపై గట్టి చర్యలు తీసుకుంటాం. పత్తికొండ పంచాయతీలో రూ.60 లక్షల నిధులు పక్కదారి పట్టిన వైనంపై ఆడిట్‌ అధికారి విచారణ పూర్తైంది. కలెక్టరుకు దస్త్రం పంపుతాం. ఆలూరు పంచాయతీ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నాం. పంచాయతీల్లో ఎక్కడ అవినీతి, అక్రమాలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయి.

కానరాని పర్యవేక్షణ

జిల్లాలోని పంచాయతీల్లో అభివృద్ధి పనుల నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తుంటాయి. ఇవికాక స్థానిక పన్నుల ద్వారా ఆయా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. వీటిని ఏఏ అవసరాలకు ఖర్చు చేయాలో ప్రణాళికలు రూపొందించుకుని అందుకనుగుణంగా ఖర్చు చేయాల్సి ఉంది. వీటన్నింటికీ లెక్కలు చూపాల్సి ఉంది. కానీ పలు ప్రాంతాల్లో పనులు చేయకనే చేసినట్లు చూపి నిధులు స్వాహా చేస్తున్నారు. మరికొందరు తమ ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్నా కఠిన చర్యలు శూన్యమే. చాలా ప్రాంతాల్లో పాలకవర్గాలు లేకపోవడం.. మరోవైపు రెండు, మూడు పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించడం.. వారు దృష్టి సారించకపోవడంతో పంచాయతీలకు వచ్చే నిధులపై పర్యవేక్షణ కరవైంది. ఇదే అదునుగా కొందరు నిధులను పక్కదారి పట్టిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.