శుక్రవారం, డిసెంబర్ 06, 2019
ఈనాడు,హైదరాబాద్: సిపాయి విలాస్ మధుకర్ ఆత్మహత్యకు కారకులైన ఇద్దరు సైబర్ నేరస్థులు లోకేంద్ర సింగ్, అతడి భార్య రుచి సింగ్‌లను సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం దిల్లీలో అరెస్ట్ చేసింది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం హైదరాబాద్‌కు తీసుకొచ్చి గురువారం జైలుకు పంపినట్లు అదనపు డీసీపీ కె.సి.ఎస్. రఘువీర్ తెలిపారు. దిల్లీలోని తూర్పు కైలాష్ నగర్లో డిలోథాన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో లోకేంద్ర సింగ్ కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నాడు. తన భార్య రుచి సింగ్, మరో 10 మంది టెలీకాలర్ల సాయంతో తక్కువ ధరకే టీవీలు, ఫ్రిజ్‌లు, రెనాల్ట్ క్విడ్ కార్లు ఇస్తామంటూ హైదరాబాద్, బెంగళూరులలో నివసిస్తున్న వారికి ఫోన్లు చేయించేవాడు. ఆసక్తి చూసిన వారితో నగదు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నాక ఆ సిమ్‌కార్డులను తీసేసేవాడు. సికింద్రాబాద్‌లోని సైనిక విభాగంలో సిపాయిగా పనిచేస్తున్న విలాస్ మధుకర్ వస్తువుల కోసం రూ.90వేలు పంపాడు. వస్తువులు రాకపోయేసరికి లోకేంద్ర సింగ్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ ఉంది. మోసపోయానన్న బాధతో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. కెప్టెన్ జి.రఘునాథరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుకర్ చరవాణిలో ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులు దిల్లీలో ఉన్నారని తెలుసుకుని, మూడు రోజుల క్రితం ఇన్స్పెక్టర్ గంగాధర్ బృందం అక్కడికి వెళ్లింది. లోకేంద్ర సింగ్, రుచిసింగ్ కదలికలపై నిఘా ఉంచి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు