close

సోమవారం, డిసెంబర్ 16, 2019

తాజా వార్తలు

పూలమ్మినచోటే..

స్పందనలో వృద్ధ దంపతుల ఆక్రోశం

ఇల్లు.. డబ్భు. వెండి.. బంగారం..

దర్పానికి నిదర్శనంగా ఓ రైస్‌మిల్లు..

నలుగురికీ పనిచ్చే దాతృత్వముంది..

ఆ ఊళ్లో పేరున్న కుటుంబమది..

బిడ్డల కోసం కష్టపడ్డారు.

కష్టార్జితాన్ని పంచిపెట్టారు..

ఆనందంగా ఉందామనుకున్నారు..

అందుకు ప్రణాళిక వేసుకున్నారు.

ఏడు పదుల వయసు..

హాయిగా బతకాలన్న మనసును

కుమారుడి దురాశ కుంగదీసింది..

ఆ తండ్రిని కూలీగా మార్చింది..

అన్నం పెట్టే చేతులు..

ఆకలంటూ అర్థిస్తున్నాయి..

అవకాశమున్న బతుకులు..

తాపీ పనికి వెళుతున్నాయి..

బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే: ఓపికున్నంత వరకూ సంతానం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు. సుఖ సంతోషాలను దిగమింగుకొని ఆస్తిని కూడపెట్టారు. బిడ్డల అభ్యున్నతి కోసం పరితపిస్తూ జీవితాన్ని ధారపోశారు. నలుగురికి పెట్టగల స్థోమతను సముపార్జించుకున్న ఆ దంపతులు కన్నకొడుకు దురాగతంతో నేడు దినసరి కూలీలుగా బతుకు బండి లాగలేక కుమిలిపోతున్నారు. ముదిమి వయసులో శారీరక కష్టాన్ని చేయలేక, కొడిగడుతున్న ప్రాణాలను నిలబెట్టుకునేందుకు అవసరమైన మందులు కొనేందుకు చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో కాసింత ఆసరా కల్పించాలంటూ కన్నీరుమున్నీరవుతున్న ఆ పండుటాకులు మసకబారుతున్న కుటుంబ బాంధవ్యాలకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కనీసం పూట గడుపుకొనేందుకైనా మార్గం చూపాలంటూ కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు గంపెడాశతో కలెక్టరేట్‌కు వచ్చి సోమవారం వినతిపత్రం అందచేశారు. వీరితో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలువురు కలెక్టరేట్‌, జిల్లా పోలీస్‌ కార్యాలయాల్లో నిర్వహించిన స్పందనలో అర్జీలు సమర్పించారు.

 

కన్నీళ్లివిగో.. : ● బాపులపాడు మండలానికి చెందిన ఓ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు. వివాహం చేసి వారికి ఇవ్వాల్సిన కట్నకానులు అప్పగించేశారు. కష్టార్జితంతో సంపాదించుకున్న రైస్‌మిల్‌, కూడబెట్టుకున్న ఇతరత్రా ఆస్తితో ఒకరి వద్ద చేయిచాపాల్సిన అవసరం లేకుండా ఉన్న మెరుగైన ఆర్థిక పరిస్థితితో జీవనం సాగిస్తున్న ఆ దంపతుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఉన్న కొడుకు పెళ్లి అనంతరం అతని బుద్ధి గతి తప్పింది. వారిని ప్రేమగా చూసుకుంటున్నట్టు నటిస్తూ వారిపేరున ఉన్న మిల్లు తన పేరున మార్చుకున్నాడు. ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు మొత్తాన్ని మాయమాటలతో దక్కించుకున్నాక అతని నిజస్వరూపం చాటుకున్నాడు. కనిపెంచిన తల్లిదండ్రుల పోషణ విషయాన్ని గాలికొదిలేశాడు. విషయం తెలిసిన పెద్దలు చెప్పే మాటలను సైతం అతని క్రూరత్వాన్ని అడ్డుకోలేకపోయాయి. ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఆ కుటుంబ యజమాని భార్య అనారోగ్యం బారిన పడటంతో ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయించాల్సి వచ్చింది. రోగం సద్దుమణిగినా అనివార్యం అయిన మందుల కోసం దొరికినంత వరకూ అప్పులు చేయాల్సివచ్చింది. ఇక అప్పుపట్టే పరిస్థితి లేకపోవడంతో కూలి పనులకు వెళ్లకతప్పలేదు. ఇప్పటికే ఏడు పదులు వయసు దాటిపోవడంతో శృతిమించిన శారీరక కష్టం చేయలేక తాపీపనితో కాలంనెట్టుకొస్తున్నారు. ఇక ఆపని చేసే శక్తి కూడా సన్నగిల్లడంతో గతంలో పది మందికి ఉపాధి చూపించిన ఆ పెద్దాయన కొడుకు చర్యలకు కన్నీళ్లు పెట్టుకుంటూ తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.

మచిలీపట్నం ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు దంపతులు సంతానం విషయంలో తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు తీర్చేసుకున్నారు. బిడ్డల వివాహాలు చేశాక తమకంటూ మిగిలిన ఆరు సెంట్ల స్థలంలో ఉన్న ఇంట్లో గుట్టుగా జీవనం సాగిస్తున్నారు. జీవిత చరమాంకానికి చేరుకున్న వారికి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తింది. సంతానం పట్టించుకోకపోవడంతో వైద్యం కోసం ఉన్న స్థలంలో నాలుగు సెంట్లు అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలిసిన కొడుకు, కోడళ్లు వచ్చి దగ్గరే ఉండి రూ.20 లక్షలకు స్థలాన్ని అమ్మించారు. క్రయ పత్రాలపై సంతకాలు పెట్టించి వచ్చిన నగదు మొత్తాన్ని వారే పంచుకున్నారు. వైద్యం కోసం తోచినంత ఇవ్వమని ఆ వృద్ధదంపతులు ఎంతగా ప్రాధేయపడినా వారి మనసు ఏమాత్రం కరగలేదు. రోజుకోరకంగా ఆరోగ్యం క్షీణిస్తుండటాన్ని భరించలేక, న్యాయం చేయాలంటూ వారు సోమవారం స్పందన కార్యక్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు ఫిర్యాదు చేశారు.● కైకలూరు నియోజకవర్గానికి చెందిన వెంకాయమ్మ భర్త మరణానంతరం ఉన్న ఆస్తి మొత్తాన్ని ఆరుగురు సంతానానికి పంచిపెట్టింది. చిన్నకుమారునితో కలిసి ఉంటున్న ఆమె తనకంటూ మిగిలిన పాత ఇంటిని పడవేసి చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుంది. విషయం తెలుసుకున్న పెద్దకుమారుడు ఆ ఇంటిని కాజేయాలనే లక్ష్యంతో కట్టుకోనీయకుండా అడ్డుపడుతున్నాడు. పాత ఇంట్లో కూడా ఎవరినీ ఉండనీయకుండా పందులను తీసుకువచ్చి అక్కడే మేపుతున్నాడు. ఇదేమని ప్రశ్నించిన తల్లి వృద్ధాప్యాన్ని కూడా చూడకుండా అసభ్యపదజాలంతో దూషిస్తూ దాడి చేయడంతో తట్టుకోలేని ఆ వృద్ధురాలు న్యాయం కోరుతూ ఫిర్యాదు చేసింది. అవసరార్ధం తీసుకున్న అప్పులకు పెచ్చు వడ్డీలు చూపిస్తూ ఇవ్వకుంటే అంతుచూస్తామని బెదిరిస్తున్న వారి నుంచి రక్షణ కల్పించాలంటూ గుడివాడకు చెందిన ఏడుకొండలు, నూజివీడుకు చెందిన ఇంద్రాణి ఫిర్యాదులు సమర్పించారు. ● తక్కువ ధరకే కారు కొనిపెడతానంటూ రూ.3 లక్షలు తీసుకుని సంవత్సరం గడుస్తున్నా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న వ్యక్తి వద్ద నుంచి డబ్బులు ఇప్పించాలని కైకలూరుకు చెందిన దేవి, ఆన్‌లైన్‌ ద్వారా వస్తువులు కొనుగోలు చేసేందుకు వివరాలు నమోదు చేయడంతో తన బ్యాంకు ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేశారని, విచారించి న్యాయం చేయాలని కలిదిండికి చెందిన ప్రశాంత్‌ కోరారు. గడచిన స్పందన కార్యక్రమంలో తాము చేసిన ఫిర్యాదుల ద్వారా న్యాయం చేకూరిందన్న సంతోషంతో మచిలీపట్నంకు చెందిన బ్రహ్మయ్య, వరలక్ష్మి ఎస్పీని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.