close

మంగళవారం, డిసెంబర్ 10, 2019

తాజా వార్తలు

ఆటకెక్కినట్లేనా!

మూడు రోజుల నుంచి పిల్లల నిరీక్షణ

రోలర్‌ స్కేటింగ్‌ నిర్వహణపై వివాదం

పట్టించుకోని అధికారులు


మైదానంలోనే విద్యార్థులకు భోజనాలు తినిపిస్తున్న తల్లిదండ్రులు

నెల్లూరు (క్రీడా విభాగం)న్యూస్‌టుడే: విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన అధికారులు వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. సమస్యకు పరిష్కారం చూపకుండా , సరైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు. రోలర్‌ స్కేటింగ్‌కు సంబంధించి మూడు రోజుల నుంచి జరుగుతున్న పంచాయతీయే దీనికి ఉదాహరణ. రోలర్‌ స్కేటింగ్‌కు సంబంధించి గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోటీలు జరగనున్నాయి. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల జాబితా పంపించాల్సి ఉంది. ఇప్పటి వరకు పోటీల్లో పాల్గొనే క్రీడాకారులెవరనేది ఇంకా తేల్చలేదు. దీంతో ఎదురుచూస్తున్న క్రీడాకారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

అసలేం జరిగింది..? అధికారుల నిర్లక్ష్యం.. ఇద్దరు శిక్షకుల మధ్య జరిగిన మాటలే పోటీల నిర్వహణలో వివాదానికి కారణమయ్యాయి. ఎస్‌జీఎఫ్‌ అధికారులు ప్రైవేటు శిక్షకులపై ఆధారపడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఏటా మండల, నియోకవర్గ, జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తుంటారు. పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయికి పంపిస్తారు. అక్కడి నుంచి జాతీయస్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తారు. జిల్లాలో ఇప్పటికే అన్ని క్రీడలకు సంబంధించి జిల్లాస్థాయి పోటీలు పూర్తయి రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. రోలర్‌ స్కేటింగ్‌కు సంబంధించి ఈ నెల 1న వెంకటాచలంలోని ఓ స్కూలులో జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాలల క్రీడా సమాఖ్య అధికారులు నిర్ణయించారు. అయితే తమ పాఠశాలలో పోటీలు నిర్వహించకూడదని నిర్వాహకులు రోలర్‌ స్కేటింగ్‌కు చెందిన ఓ శిక్షకుడికి ఫోన్‌ ద్వారా సమాచారం తెలిపారు. క్రీడా అసోసియేషన్లు, శిక్షకుల మధ్య ఉన్న విభేదాలతో పోటీల రద్దు సమాచారాన్ని ఒక వర్గానికే అందించారు. ముత్తుకూరు నుంచి క్రీడాకారులు, తల్లిదండ్రులు పోటీలు ఉన్నాయని వెంకటాచలంలోని పాఠశాలకు చేరుకున్నారు. దూరం నుంచి వచ్చారంటూ వారితోనే పోటీలు నిర్వహించేశారు. ఇది తెలుసుకున్న నగరానికి చెందిన ఒక కోచ్‌ వర్గం క్రీడాకారులు, తల్లిదండ్రులు హడావుడిగా వెంకటాచలానికి చేరుకున్నారు. అప్పటికే పోటీలు ముగించేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వీరు జిల్లా విద్యాశాఖాధికారి దగ్గరకు చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో మరలా ఈ నెల 2న నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు అదే పాఠశాలలో నిర్వహిస్తున్నారంటూ ప్రకటించారు. కానీ, వర్షం కారణంగా ఏసీ సుబ్బారెడ్డి మైదానంలోని బాస్కెట్‌బాల్‌ ప్రాంగణంలో నిర్వహించారు. వేదిక మార్చినట్లు సమాచారం తెలియని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు గంట ఆలస్యంగా చేరుకున్నారు. ఎస్‌జీఎఫ్‌ నిబంధనల ప్రకారం పోటీలు జరుగుతున్నా కూడా క్రీడాకారులు రావడం ఆలస్యమైతే వారిని పోటీల్లో తీసుకోవాలి. కానీ, ఇక్కడ మాత్రం అధికారులు పూర్తయ్యాయి అంటూ తేల్చిచెప్పారు. దీంతో మరలా వివాదం తలెత్తింది.

మూడు రోజుల నుంచి అక్కడే

మూడు రోజుల నుంచి పోటీల కోసం పిల్లలు ఎదురుచూస్తున్నారు. ఇక్కడే భోజనాలు, టిఫిన్లు చేసుకుంటూ పోటీల్లో పాల్గొనేందుకు మొత్తం 20 మంది ఎదురుచూస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొంటే జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులు సైతం ఉన్నారు. కొందరు తాజాగా పాల్గొనే వారు ఉన్నారు. కేవలం ఒకే రోజు కావడంతో ఎవరు పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

బాధ్యులపై చర్యలేవి

వివాదానికి బాధ్యులపై చర్యలు మాత్రం తీసుకోవడంలో అధికారులు వెనకంజ వేస్తున్నారు. ఇద్దరు శిక్షకుల వల్లే ఈ వివాదానికి కారణమైందని అధికారులే తేల్చి చెప్పారు. మంగళవారం ఉదయం నుంచి ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో అధికారులు సంప్రదింపులు జరిపారు. ముత్తుకూరుకు చెందిన ఒక వర్గం, నగరానికి చెందిన మరో వర్గంతో ఎస్‌జీఎఫ్‌ అధికారులు మాట్లాడారు. ఈ నెల 1న నిర్వహించిన పోటీల్లోనే తమ పిల్లలు విజేతలుగా ప్రకటించారని కొందరు చెబుతుంటే, మరలా పోటీలు నిర్వహించాలని ఇంకొందరు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.