close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

యా..హూ!

పాఠశాలల్లో బాలికలకు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

సర్కారు బడుల్లోని బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇవ్వనున్నారు. బాలికల ఆత్మరక్షణకు ఉపయోగపడే మెలకువలను నేర్పించి వారిలో ధైర్యాన్ని నింపబోతున్నారు. తరచూ అమ్మాయిలపై జరుగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే బాలికలకు యుద్ధకళ నేర్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లాలోని బాలికల సంఖ్య ఎక్కువగా గల పాఠశాలల్లో ముందుగా అమలు చేయనున్నారు. ఇదివరకు కూడా ఈ శిక్షణ అందించిన విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో మరో మూడు నెలల పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు శిక్షణ ఇచ్చే ఇన్‌స్ట్రక్టర్ల వేతనాల కోసం నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలను జారీ చేసింది.

75 పాఠశాలల్లో అమలు : జిల్లాలోని 656 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిల్లో చదువుతున్న మొత్తం విద్యార్థుల్లో ఇంచుమించుగా బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంది. కొంతకాలంగా అమ్మాయిలపై జరుగుతున్న ఆకృత్యాలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇటీవలే జరిగిన దిశ హత్యాచార సంఘటన కూడా అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సర్కారు బడుల్లోని బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు, విపత్కర పరిస్థితుల్లో వారిని వారు రక్షించుకునేందుకు మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విద్యాసంవత్సరంలో ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు అమలు చేయనున్నారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ శిక్షణ వారానికి రెండు సార్లు అందించనున్నారు. మార్షల్‌ ఆర్ట్స్‌లోని కరాటే, కుంగ్‌ఫూ, జూడో వంటి యుద్ధ విద్యలను బాలికలకు నేర్పించేలా నిపుణులైన ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తూ వారికి నెలకు రూ.3వేల చొప్పున వేతనం అందించనున్నారు. మూడు నెలలకు సంబంధించిన వేతనాల నిధులను కూడా మంజూరు చేశారు. అయితే ఉన్నత పాఠశాలల్లో వంద మంది కంటే ఎక్కువ సంఖ్య గల విద్యార్థులు గల బడుల్లో శిక్షణ అందించాలని సూచించిన రాష్ట్ర విద్యాశాఖ ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో స్పష్టతనివ్వలేదు. 100 మంది కంటే  ఎక్కువ సంఖ్యలో బాలికలు గల ఉన్నత పాఠశాలలు జిల్లాలో 57 ఉన్నాయి. ఒక వేళ ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది కంటే ఎక్కువగా ఉన్న వాటిల్లో శిక్షణ అందిస్తే అలాంటి బడులు 18 వరకు ఉన్నాయి. దీని ప్రకారం మొత్తం 75 పాఠశాలల్లో ఈ శిక్షణ జరగనుంది. ప్రాథమికోన్నత పాఠశాలలకు వంద మంది విద్యార్థులనే నిబంధన పెడితే ఒక్క పాఠశాలోనూ ఆ మేరకు సంఖ్య లేదు.

సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు : బాలికలకు అందిస్తున్న మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం ఇవ్వనున్నారు. కొన్నేళ్లుగా బడుల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నా శిక్షకుల ఎంపిక లోపభూయిష్టంగా ఉందనే ఆరోపణలున్నాయి.  ఈ రంగంలో అనుభవం లేని వారే శిక్షణ తరగతులను చెప్పడంతో ఆశించిన రీతిలో విద్యార్థినులు మెలకువలను నేర్చుకోవడం లేదనే అపవాదు ఉంది. శిక్షకుల ఎంపికలో నైపుణ్యం, అనుభవం పరిగణలోకి తీసుకుని శిక్షణ ఇప్పిస్తే బాలికలకు ప్రయోజనంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.