close

మంగళవారం, జనవరి 21, 2020

తాజా వార్తలు

వివాహిత మృతిపై ఆందోళన

పడతడిక (కృత్తివెన్ను), న్యూస్‌టుడే: కృత్తివెన్ను మండలం పడతడిక గ్రామానికి చెందిన బొర్రా మదర్‌ థెరిసా(22) మృతి వివాదస్పదంగా మారింది. తన కుమార్తెను అల్లుడు బొర్రా నాగేశ్వరరావు కొట్టి చంపాడని, తగిన న్యాయం చేయాలంటూ మృతురాలి తలి ్లఈదా దేవమాత శనివారం నిరసన చేపట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. చినగొల్లపాలెం వంతెనకు వెళ్లే రహదారిలో షామియానా వేసి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ మెహబూబ్‌భాషా, సీఐ ఎన్‌.కొండయ్య సంఘటన స్థలానికి చేరుకుని దేవమాతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్నట్లు థెరిసా భర్తతోపాటు మరో అయిదుగురిపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అదుపులో తీసుకున్నామని, చట్టప్రకారం చర్యలు తీసుకుని తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెండేళ్ల క్రితం పడతడిక గ్రామానికి చెందిన బొర్రా నాగేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన ఈదా మదర్‌థెరిసా ప్రేమించుకున్నారు. కులాలు వేరుకావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించకలేదు. కృత్తివెన్ను పోలీసులను ఆశ్రయించడంతో గ్రామపెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. అనంతరం నాగేశ్వరరావు, థెరిసా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళ్లిపోయి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక బాబు ఉండగా, థెరిసా ప్రస్తుతం గర్భిణీ. గత బుధవారం రాత్రి 7 గంటల సమయంలో భీమవరంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తరువాత థెరిసా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి, ఆమె మృతదేహాన్ని భర్త నాగేశ్వరరావు స్వగ్రామం పడతడికలోని ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతురాలి చిన్నాన్న ఈదా బెనర్జి కృత్తివెన్ను పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి కృత్తివెన్ను ఇన్‌ఛార్జి ఎస్సై జి.సత్యనారాయణ పడతడిక చేరుకున్నారు. తెల్లవారుజాము 3 గంటలకు శవపంచనామా అనంతరం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం గురువారం రాత్రి 10 గంటలకు మృతదేహాన్ని పడతడిక గ్రామానికి తీసుకువచ్చారు. ఆమె తల్లి గల్ఫ్‌ నుంచి రావాల్సి ఉండటంతో శుక్రవారం వరకు భర్త నాగేశ్వరరావు ఇంటి వద్ద ఉంచారు. అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామస్థులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్న తల్లి దేవమాత విషయం తెలుసుకుని, తమకు న్యాయం జరిగేవరకు అంత్యక్రియలు చేయబోమని పోలీసులకు తెలిపారు. తదుపరి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం పడతడిక-చినగొల్లపాలెం వంతెన సమీపంలో ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఆందోళన ఉద్ధృతమైంది. డీఎస్పీ మెహబూబ్‌బాషా, సీఐ ఎన్‌.కొండయ్య రంగప్రవేశం చేసి చట్టప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం నిరసన విరమించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తహసీల్దార్‌ ఆర్‌.సాంబశివరావు, రెవెన్యూ సిబ్బంది, ఇన్‌ఛార్జి ఎస్సై జి.సత్యనారాయణ, కృత్తివెన్ను పోలీస్‌ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.