close

గురువారం, జనవరి 23, 2020

తాజా వార్తలు

పోక్సో... కాస్కో

నిందితులపై ఇక రౌడీషీట్లు
నిత్యం పోలీసు గుమ్మం తొక్కాల్సిందే
ఈనాడు డిజిటల్‌, విజయవాడ

మొన్న గొల్లపూడి.. నిన్న అజిత్‌సింగ్‌నగర్‌.. నేడు భవానీపురం ప్రాంతాలు వేరైనా పాపం పుణ్యం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన ఘటనలు నిత్యం విజయవాడ నగరంలో వెలుగు చూస్తునే ఉన్నాయి. పన్నెండేళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తామని, మునుపటి కనీస శిక్షల కాలాన్ని పెంచుతూ బాలల రక్షణ చట్టం(పోక్సో)లో సవరణలు తీసుకువచ్చినా దురాగతాలకు అడ్డుకట్ట పడటం లేదు. కేసు నమోదు చేసిన వారంలో బెయిల్‌ రావడం, బాధితులను భయపెట్టి, డబ్బు ఆశచూపి కేసులు మాఫీ చేసుకోవడం, మరికొన్ని సరైన సాక్ష్యాలు లేక కోర్టులో వీగిపోవడం.. వంటి కారణాలతో చిన్నారులపై దాడులు చేసే వారికి భయం లేకుండా పోతోంది. దీంతో ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాల్సిన బాల్యం ఆందోళన, అభద్రతల మధ్య నలిగిపోతోంది. ఈ నేపథ్యంలో చిన్నారులు, కౌమార బాలికలపై లైంగికదాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర పోలీస్‌శాఖ సిద్ధమైంది.

పోక్సో చట్టం కింద కేసు నమోదైన వ్యక్తిపై ‘రౌడీషీట్‌’ తెరుస్తున్నారు. దీనిపై విజయవాడ కమిషనరేట్‌ పరిధితో పాటు. కృష్ణా ఎస్పీ పరిధిలో కూడా కసరత్తు ప్రారంభించారు. మారుతున్న జీవనశైలి, పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు విపరీతంగా శ్రమిస్తూ పిల్లల వ్యక్తిగత అవసరాలు, ఇష్టాలు, స్నేహితులు ఇతర అంశాలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో చిన్నారులు, అమ్మాయిలను దగ్గరకు తీసుకునే నెపంతో కొందరు కామాంధులు వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఆట మైదానాలు, ట్యూషన్లు ఇలా ఎక్కడపడితే అక్కడ పిల్లలపై లైంగికదాడులు జరుగుతున్నాయి. 2012 పోక్సో చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు నమోదై నడుస్తున్న వారిపై రౌడీషీట్‌ తెరవనున్నారు.

ఇక.. కుదరదు
అత్యాచార ఘటనల్లో 90 శాతం మంది నిందితులు పరిచయస్తులే. బాధితులు ఫిర్యాదు చేసేవరకు నేరాలు బయటపడటం లేదు. పిల్లల తల్లిదండ్రులూ నమ్మలేకపోతున్నారు. చిన్నారుల ద్వారా కామాంధులు విపరీత కోరికలు తీర్చుకుంటున్నారు. కొందరు యువకులు సినిమాలు, అంతర్జాలంలో అశ్లీల దృశ్యాలను చూసి ఈ దారుణాలకు తెగబడుతున్నారు. ఎన్ని దారుణాలకు పాల్పడినా దర్జాగా తప్పించుకోవచ్చునన్న ధీమా ఈ తరహా నేర సంస్కృతి పెరగడానికి దోహదం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిందితులపై ఒక్కసారి రౌడీషీట్‌ తెరిస్తే వారంవారం సంబంధిత పోలీస్‌స్టేషన్‌కి వచ్చి సంతకం పెట్టాలి. దీంతో పాటు నగరంలోని టాక్క్‌ఫోర్స్‌ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాలి. ఒకవేళ వేరే ఊరు వెళ్లాలంటే.. తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

నేరం చేయాలంటే భయం పుట్టాలి.: సీ.హెచ్‌.ద్వారకా తిరుమలరావు, పోలీస్‌ కమిషనర్‌, విజయవాడ.చిన్నారులు, కౌమారులపై లైంగికదాడులకు పాల్పడిన నిందితులపై ఐపీసీ కేసులతోపాటు పోక్సో చట్టం ప్రయోగిస్తున్నాం. అయినా మార్పు రావడం లేదు. ఇక రౌడీషీట్‌ తెరిచి నిరంతర నిఘా వేస్తాం.

అఘాయిత్యాలు.. అత్యాచారాలిలా..
(4 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లలు)
* ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో.. 16%
* ట్యూషన్ల పేరుతో ఇంటికి వచ్చి చెప్పేవారితో.. 29%
* పాఠశాలల్లో క్రీడల కోచ్‌లు.. ఉపాధ్యాయులు.. 11%
* స్నేహితుల అన్నలు, బాబాయిలు, తండ్రులు..  07%
* దూరపు బంధువులు, పరిచయస్తులు..  37%

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.