close

ఆదివారం, జనవరి 26, 2020

తాజా వార్తలు

వాచ్‌మెన్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన వైరి వర్గం

చికిత్స పొందుతున్న బాధితుడు

ఈనాడు, హైదరాబాద్‌: రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న స్థల వివాదంలో ఒక వర్గానికి చెందిన వాచ్‌మెన్‌పై వైరి వర్గం వారు పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య కథనం ప్రకారం...1994 సంవత్సరంలో శివ ఎన్‌క్లేవ్‌ హౌసింగ్‌ సొసైటీ ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని సర్వే నంబరు 91లో 114 ప్లాట్లతో లేఅవుట్‌ను ఏర్పాటు చేసింది. అందులోని పలు ప్లాట్లకు సంబంధించి తూముకుంట మాధవరెడ్డి, సామల మాధవరెడ్డితోపాటు ఇతరులు, ప్రకాశ్‌రెడ్డి, సంతోష్‌కుమార్‌లతోపాటు ఇతరుల మధ్య కొన్నేళ్లుగా స్థల వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రకాశ్‌రెడ్డి వర్గం ఇటీవల ఓ ప్లాట్‌ చుట్టూ ప్రహరీ నిర్మించింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తూముకుంట మాధవరెడ్డి, సామల మాధవరెడ్డిల వర్గం ఈ నెల 5న ప్రహరీలను పొక్లెయిన్‌తో కూల్చివేయించింది.

ఈ నెల 5 నుంచే నిందితులు పరారీలో.. ప్రహరీలను కూల్చివేస్తుండగా ప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన వాచ్‌మెన్‌ శ్రీనివాస్‌ అతని భార్య లక్ష్మిలు ప్రత్యర్థి వర్గం వారిని అడ్డుకునేందుకు యత్నించగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తూముకుంట మాధవరెడ్డి వర్గం వారు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు ఘటనకు సంబంధించి అంతకుముందే తాము ఉంటున్న గది, పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని ఫుటేజీలను పోలీసులకు అందజేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తూముకుంట మాధవరెడ్డితోపాటు అతని వర్గం వారు పరారయ్యారు. ఎప్పటికైనా ప్రత్యర్థి వర్గంతో తమకు ముప్పు ఉంటుందని వాచ్‌మెన్‌ శ్రీనివాస్‌ తన యజమాని ప్రకాశ్‌రెడ్డికి చెప్పాడు. శ్రీనివాస్‌ కుటుంబానికి తోడుగా ఉండాలని పదేళ్ల నుంచి తన వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న కర్ణాటకకు చెందిన శరణప్ప(45)కు ప్రకాశ్‌రెడ్డి సూచించాడు. శరణప్ప, వాచ్‌మెన్‌ శ్రీనివాస్‌ గదిలోనే ఉంటూ సదరు ప్లాట్లకు కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో  ఈ నెల 6న అర్ధరాత్రి దాటిన తర్వాత పరారీలో ఉన్న తూముకుంట మాధవరెడ్డి, సామల మాధవరెడ్డిలు తమ వర్గానికి చెందిన పలువురితో కలిసి శ్రీనివాస్‌ గది వద్దకు కారులో వచ్చారు. కారులోంచి పెట్రోల్‌ డబ్బాతో దిగిన తూముకుంట మాధవరెడ్డి, సామల మాధవరెడ్డిలు గది తలుపులను తట్టారు. ఆ అలికిడికి ప్లాటును ఆనుకొని  ఉన్న భవనం పైఅంతస్తులో నిద్రిస్తున్న లక్ష్మి లేచి.. నిందితుల చేతిలోని పెట్రోల్‌ డబ్బాను చూసి తలుపులు తీయొద్దని అరుస్తుండగానే శరణప్ప తలుపులు తెరిచాడు. నిందితులు శరణప్పను బయటకు లాగి ప్రధాన ద్వారం వద్ద అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి పారిపోయారు. పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.