close

శుక్రవారం, జులై 19, 2019

తాజా వార్తలు

బ‌దిలీపై వెళ్తున్నారా.. అన్నీ చూసుకోండి

హడావుడితో ఇబ్బందులు తప్పవు

పిల్లల చదువులు.. ఇంటి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

ముందస్తు జాగ్రత్తలతో సమస్యలు దూరం

ప్రభుత్వ అధికారి.. ఉద్యోగి జీవితంలో సర్వీస్‌ బుక్‌(ఎస్‌.ఆర్‌.) చాలా కీలకమైంది. ఉద్యోగంలో చేరిన రోజు మొదలు పదవీ విరమణ పొందే వరకు అన్ని విషయాలు అందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీసు బుక్‌ ఎవరికి వారు నిర్వహించుకునే అవకాశం లేదు. పర్యవేక్షక కార్యాలయంలోని ఉద్యోగులు దాన్ని నిర్వహిస్తారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, శాఖాపరంగా తీసుకునే క్రమశిక్షణ చర్యలు, ఉద్యోగంలో సాధించే విజయాలన్నీ అందులో ఉంటాయి. ఎస్‌.ఆర్‌. కార్యాలయంలోనే ఉంటుంది.. అవసరమైనప్పుడు తీసుకోవచ్చని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు. కొత్త ప్రదేశంలో చేరిన వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంతో ఊహించని లబ్ధి అందవచ్చు. లేదా పదోన్నతి రావొచ్చు. వేతన పెంపుదలకు అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం పని చేసే కార్యాలయంలో కాకుండా గతంలో పని చేసిన చోట అది ఉంటే ముఖ్యమైన అంశాల నమోదుకు సమస్యలు ఉంటాయి. దగ్గర్లో పాత కార్యాలయం ఉంటే ఫర్వాలేదు. అదే వందల కిలోమీటర్ల దూరంలో ఉంటే సెలవుపై వెళ్లాలి. బదిలీపై వెళ్తున్నప్పుడే ఎస్‌.ఆర్‌.ను తీసుకోవడం కొత్తగా చేరిన కార్యాలయంలోని బాధ్యుడికి అందజేసి తిరుగు రసీదు పొందడం ఎంతో అవసరం.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పని చేసే వారు ఉద్యోగులు. వారికి బదిలీలు సర్వసాధారణం. దేశమంతా తిరిగేవారు కొందరైతే.. రాష్ట్ర పరిధిలో జిల్లాలు.. డివిజన్లు.. మండలాల్లో పని చేసే వారు చాలామంది ఉంటారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అన్ని శాఖల్లో బదిలీలు జరుగుతున్నాయి. ప్రశాంతంగా పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తే ఇబ్బందులు లేకుండా నూతన ప్రదేశంలో ఉద్యోగాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది.  

గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే రాష్ట్ర సచివాలయం, ముఖ్య కార్యాలయాలన్నీ ఉన్నాయి. రాజధాని ప్రాంతంతో పాటు రెండు జిల్లాల్లో సుమారు 70 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అన్ని విభాగాల పోలీసు సిబ్బంది కలిపి మరో 20 వేల మంది వరకు ఉన్నారు. ప్రస్తుతం వారికి బదిలీలు జరుగుతున్నాయి. కొన్ని కార్యాలయాల్లో అందరూ బదిలీ అయి కొత్తవారు రానున్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే రెవెన్యూ, పురపాలక, మండల పరిషత్, పోలీసు, విద్య, వైద్యం, ఇంజినీరింగ్‌ శాఖల్లో బదిలీలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికే కొందరికి బదిలీ ఉత్తర్వులు అందాయి. ప్రస్తుతం ఉన్న చోట నుంచి మరోచోటకు వెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. మరికొందరు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నారు. బదిలీపై వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనవి

ముందే వెళ్లి చూసి రండి..: ఇష్టంతో బదిలీపై వెళ్లే వారికి ముందస్తు సన్నద్ధత ఉంటుంది. కొత్తగా వెళ్లే వారికి కొన్ని సమస్యలు ఉంటాయి. బదిలీ అయిన వెంటనే ఉద్యోగంలో చేరినా కుటుంబాన్ని తీసుకెళ్లేందుకు కొంత సమయం తీసుకోవాలి. కొత్త ప్రదేశంపై అవగాహన పెంపొందించుకోవాలి. నీటి వసతితో పాటు కుటుంబానికి భద్రత ఉండే చోటును ఎంపిక చేసుకోవాలి. కార్యాలయానికి దగ్గర్లో అయితే రవాణాపరమైన ఇబ్బందులు ఉండవు. దూరమైతే ప్రజా రవాణాను ఎంచుకోవాలా లేదా సొంత కారు.. ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించుకోవాలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. 40 ఏళ్లు పైబడిన ఉద్యోగుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువ మంది బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు తాము పని చేసే చోటు ఎంత బాగుండాలనుకుంటారో ఇల్లు కూడా ఆహ్లాదకర ప్రాంతంలో ఉండేలా చూసుకోవాలి. గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు రెండు జిల్లాల్లోని ప్రధాన పట్టణాల్లో అద్దెలు ఆకాశన్నంటుతున్నాయి. ఎక్కువ నగదు వెచ్చించినా వసతులు.. సౌలభ్యాలు అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. 

ఇంటిపై ఓ కన్నేయండి.. 

నేటితరంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటి నుంచే సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే తపన ఉంటుంది. దానికి తగ్గట్లుగా కలల్ని సాకారం చేసుకుంటున్నారు. బదిలీలు జరిగే సమయంలో భద్రతపై నిర్లక్ష్యం చూపకూడదు. ఇంటి భద్రతకు లాక్డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్‌) యాప్‌ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంటిని విడిచి కొన్ని రోజులు దూరంగా ఉండాల్సివస్తే పోలీసుల్ని సంప్రదించి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.  

పిల్లల చదువులు ముఖ్యం 

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి లోపు చిన్నారులు.. కుటుంబాన్ని వెంట తీసుకుని కొత్త ఉద్యోగంలో చేరడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పిల్లలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతుంటే వారిని ఉన్నపళంగా నూతన ప్రదేశానికి తీసుకెళ్లడం వారి చదువుపై ఎంతో ప్రభావం పడుతుంది. కొత్త ప్రదేశంలో ఇప్పటికంటే మరింత మెరుగ్గా విద్యాబోధన చేసే పాఠశాలలు, కళాశాలల్ని ఎంపిక చేసుకోవాలి. టీసీ, స్టడీ సర్టిఫికేట్‌.. పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఏడో తరగతి పైబడిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలు.. బదిలీలపై కొంత అవగాహన ఉంటుంది. వారికి అర్థమయ్యేలా చెప్పడంతో పాటు కొత్త ప్రాంతంలో మంచి విద్యాలయాలు ఉన్నాయనే భరోసా ఇవ్వాలి. కొత్తగా చేర్చే సంస్థలో పిల్లలు సర్దుకుపోయే వరకు వారి వెన్నంటే నిలవాలి. వారి నడవడికపై శ్రద్ధ చూపాలి. పిల్లల చదువుల్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

https://betagallery.eenadu.net/htmlfiles/125277.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.