close

శుక్రవారం, ఆగస్టు 23, 2019

తాజా వార్తలు

మాటలు చెప్ఫి. .కాసులు కాజేసి

● అడ్డూ అదుపూ లేని అంతర్జాల మోసాలు

● ఏటీఎం పిన్‌ నంబరు అడిగి మరీ దోపిడీ

● బ్యాంకు ఖాతాల్లో నుంచే స్వాహా

న్యూస్‌టుడే, కామారెడ్డి నేరవిభాగం


 

ట్రింగ్‌ ట్రింగ్‌.. హలో ఎవరూ! మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. మీ ఖాతాకు ఆధార్‌ లింక్‌ చేస్తున్నాం. ఖాతా వివరాలతో పాటు ఏటీఎం పిన్‌ నంబరు చెప్పండి. లేదంటే మీ ఖాతా పనిచేయదు.. అనగానే ఆదరాబాదరాగా ఖాతా పుస్తకం, ఏటీఎం కార్డు తీసుకొని వివరాలు చెప్పేయగానే.. క్షణాల్లో చరవాణికి మెసేజ్‌ వస్తుంది. తీరా చూస్తే బ్యాంకు ఖాతాలో డబ్బులు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు మాయం చేస్తారు. మోసాన్ని తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరుగుతోంది. నిత్యం జిల్లాలో ఏదో ఒకచోట బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఏదో మూలన రోజుకో అంతర్జాల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే పరువు పోతుందని భయపడి చాలామంది లోలోపలే కుమిలి పోతున్నారు. కొందరే పోలీసుల చెంతకు వచ్చి సమస్యను చెబుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు పోలీసుల దృష్టికి వచ్చి మొరపెట్టుకున్న బాధితులు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరు రూ. లక్షల్లో నష్టపోయారు. అంతర్జాల మోసాల్లో నష్టపోయిన వారికి న్యాయం ఎడారిలో ఎండమావిగా మారుతోంది. ఎన్నిసార్లు పోలీసుస్టేషన్ల మెట్లు ఎక్కుతున్నా.. బాధితులకు న్యాయం దొరకని పరిస్థితి.

పోలీసులేం చేస్తున్నారంటే..?

అంతర్జాల మోసాల నివారణకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎస్పీ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా అంతర్జాల మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలను జాగృతం చేస్తున్నా ఘటనలు జరుగుతున్నాయి. వీటి నివారణకు పోలీసులు ప్రతి వార్డులో, గ్రామాల్లో పెద్దఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించడంలో వెనుకడుగు వేస్తున్నారు. మోసాలకు గురైన వారు ఠాణాలకు వచ్చినా సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు తమ నిస్సాహాయత వ్యక్తం చేస్తున్నారు.

అప్రమత్తం చేసే వ్యవస్థ రావాలి

బ్యాంకు ఖాతాలో నుంచి నగదు బదిలీకి, డ్రా చేసే ముందే ఖాతాదారుడిని అప్రమత్తం చేసే వ్యవస్థ వస్తేనే అంతర్జాల మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. ముఖ్యంగా దీనివల్ల బ్యాంకు ఖాతాలో డబ్బులు తన ప్రమేయం లేకుండా పోతున్నాయనేది ముందే తెలుస్తోంది. మోసపోక ముందే బ్యాంకు అధికారులను, పోలీసులను పురమాయించి నష్ట నివారణకు ఉపక్రమించే వీలుంది.


 

 

ప్రజల్లో చైతన్యం రావాలి

శ్వేత, కామారెడ్డి జిల్లా ఎస్పీ

అంతర్జాల మోసాలపై ప్రజల్లో చైతన్యం రావాలి. పోలీసు శాఖ తరఫున ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మోసాలను అరికట్టడంలో మాకు ఎంత బాధ్యతుందో ప్రజలకూ అంతే ఉంది. మేం ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తే ఎలాంటి మోసాన్నైనా అరికట్టొచ్ఛు ఇప్పటికే ఈ తరహా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. అయినా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అపరిచితులను నమ్మడమే ఇందుకు ప్రధాన కారణం. తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసుల దృష్టికి తెస్తే న్యాయం చేస్తాం. ఇప్పటికే పలు కేసులు ఛేదించాం.


 

ఒక్కరోజులో రూ. 1.20 లక్షలు మాయం

చరవాణికి వరుసగా నాలుగు సార్లు మెసేజ్‌లు రావడంతో ఏంటని చూసిన కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసముండే రమేష్‌ విఠల్‌రావు బుక్కవార్‌ అవాక్కయ్యారు. తన ఖాతాలోంచి తనకు తెలియకుండానే రూ.80 వేలు కొల్లగొట్టారని తెలుసుకొని లబోదిబోమన్నారు. ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఐ ఇందిరానగర్‌ శాఖ కార్యాలయాన్ని సందర్శించగా మోసం జరిగిందని తేలింది. తనకు న్యాయం చేయాలని పట్టణ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా కేంద్రంలో విలీన గ్రామం లింగాపూర్‌కు చెందిన మాజీ సర్పంచి యాదవరెడ్డి ఖాతాలో నుంచి రూ.40 వేలు కాజేశారు. ఈ రెండు ఘటనలు 8 నిమిషాల వ్యవధిలో చోటు చేసుకోవడం గమనార్హం. ఈ నెల 12వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటనలతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.


 

వావ్‌! మీరు రూ. కోటి విలువైన బహుమతిని గెలుచుకున్నారని చరవాణికి వచ్చిన మెసేజ్‌ను చూసి కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌ గ్రామానికి చెందిన అబ్బాగౌని నర్సాగౌడ్‌ ఏడాది క్రితం తబ్బిబ్బయ్యారు. ఈ కింది నంబరుకు ఫోన్‌చేసి మాట్లాడాలన్న సమాచారంతో వెంటనే సంప్రదింపులు మొదలెట్టాడు. వెంటనే అవతలి వైపు నుంచి మీరు బహుమతి గెలుచుకున్నది వాస్తవమే. కానీ, ఆ బహుమతి రావాలంటే మొదట మేము పంపిన ఖాతాలో నగదును జమచేయండి. బహుమతి మీ ఇంటికి చేరుతుందని చెప్పారు. సదరు వ్యక్తి గతంలో మాట్లాడిన నంబరుకే ఫోన్‌ చేయగా ఆ డబ్బులు సరిపోవని.. మరింత నగదు వేయాలని సూచించారు. బహుమతి ఆశతో వారు చెప్పినట్లుగానే రూ. 7.80 లక్షల వరకు వారి ఖాతాలో జమచేశారు. ఎంతకూ బహుమతి రాకపోవడంతో ఫోన్లో వారితో గొడవకు దిగడంతో అప్పటి నుంచి ఆ నంబరు పనిచేయలేదు. చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న నర్సాగౌడ్‌ మనోవేదనకు గురై అనారోగ్యంతో ఇటీవలే మరణించారు. దీంతో భార్యా, పిల్లలు ఆదరువు కోల్పోయి తమకు దిక్కెవరంటూ రోదిస్తున్నారు.కామారెడ్డి జిల్లాలో ఏదో మూలన రోజుకో అంతర్జాల మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తమకు అన్యాయం జరిగిందని చెప్పుకుంటే పరువు పోతుందని భయపడి చాలామంది లోలోపలే కుమిలి పోతున్నారు. కొందరే పోలీసుల చెంతకు వచ్చి సమస్యను చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.