close

గురువారం, ఆగస్టు 22, 2019

తాజా వార్తలు

విద్యుత్తు తీగే యమపాశమై..

విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి

● తాగునీటికి వెళ్లి మృత్యువాత


రోదిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు

గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో నివాసముంటున్న జయలింగ(28), పక్కింట్లో ఉంటున్న నవీన్‌(15)తో కలిసి తాగునీరు తెచ్చుకునేందుకు మంగళ వారం తెల్లవారు జామున సమీప పొలాలలోని నీటి ట్యాంకు వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అప్పటికే ఈదురు గాలులకు తెగి పడిన విద్యుత్తు తీగ వీరికి కనిపించలేదు. ముందు కూర్చున్న జయలింగకు తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అతడితోపాటు వెనుక కూర్చున్న నవీన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జయలింగ ముఖం పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో వచ్చిన మంటలు, కాలిపోయిన మృతదేహం గమనించిన స్థానికులు బంధువులకు తెలిపారు. చాలాచోట్ల విద్యుత్తు తీగలు ప్రమాదంగా ఉన్నాయని విద్యుత్తు అధికారులకు విన్నవించినా పట్టించుకోనందునే ప్రమాదం జరిగిందని గ్రామస్థులు నరసన్న, ప్రభుదాస్‌, హరి, అబ్దుల్‌, నగేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు మృతదేహాలను తరలించేది లేదని భీష్మించారు. సీఐ పార్థసారథిరెడ్డి జోక్యం చేసుకొని బాధితులు, గ్రామస్థులకు సర్దిచెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ, ఎస్‌ఐ నాగార్జున కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి యజమానికి కోల్పోయి

గ్రామానికి చెందిన జయలింగ(28), పద్మావతి దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి చేనేత పనులే జీవనాధారం. భార్య నిండు గర్భిణి. చేనేత పనులు లేకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో జయలింగ విద్యుత్తు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇంటికి ఆధారంగా ఉన్న యజమాని ప్రమాదంలో మృతి చెందడంతో భార్య పద్మావతి రోదించడం అందరినీ కన్నీరు పెట్టించింది.

ఎవరి కోసం బతకాలి

విద్యుత్తు ప్రమాదంలో ఏకైక కుమారుడు నవీన్‌ మృతి చెందడంతో ‘ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లి నీలావతి కన్నీరు పెట్టడం గ్రామస్థులను కలచివేసింది. ఏడాది కిందట ఈమె భర్త పరమేష్‌ ఏడాదిన్నర కిందట చనిపోయారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబంలో కుమార్తె, కుమారుడికి నీలావతి ఆధారమైంది. కష్టపడి పనిచేస్తూ కుమార్తె వివాహం చేసింది. కుమార్తె నిండు గర్భిణి. కుమారుడిని పదో తరగతి వరకు చదివించింది. అక్క తన ఇంట్లో ఇబ్బంది పడకూడదనే ఉదయాన్నే నీరు తెచ్చేందుకు వెళ్లిన నవీన్‌ ప్రమాదంతో మృతిచెందాడు. దీంతో ఇరువురి రోదన అందరినీ కన్నీరు పెట్టించింది.

తాగునీటి కష్టాలు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నాయి. గ్రామంలో చుక్కనీరు దొరకక ఊరి బయట పొలంలో నీరు తెచ్చుకునేందుకు వెళ్లిన ఇద్దరికి తెగిన విద్యుత్తు తీగ తగలడంతో ప్రాణాలు కోల్పోయారు. విగత జీవులైన వారినిచూపి బంధువుల రోధన అందరినీ కలచివేసింది. తీగ తెగినా గుర్తించని అధికారుల తీరుతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

- న్యూస్‌టుడే, పెద్దమర్రివీడు(గోనెగండ్ల)

ప్రమాదంపై విచారిస్తున్న ఎస్సై

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.