close

గురువారం, డిసెంబర్ 05, 2019

తాజా వార్తలు

ప్రభుత్వ భవనాలే ఆక్రమణలట

శక్కర్‌నగర్‌లోని సంక్షేమ వసతిగృహాలకు లేఖ

 
శక్కర్‌నగర్‌లోని మూడు వసతిగృహాల సముదాయం

బోధన్‌ పట్టణం, న్యూస్‌టుడే: శక్కర్‌నగర్‌లోని మూడు సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాల భవనాలు అనధికార నిర్మాణాలుగా నిజాం షుగర్స్‌ యాజమాన్యం(ప్రభుత్వ) పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖ అధికారులకు లేఖ వచ్చింది. ఈ భవనాలకు సంబంధించిన స్థలం తమదిగా పేర్కొన్న అధికారులు.. కావాలనుకుంటే మార్కెట్‌ ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. సంబంధిత శాఖ అధికారులు ఆర్డీవో గోపీరామ్‌ను కలిసి ఏం చేయాలన్న విషయంపై చర్చించారు.

2013లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద పట్టణంలో నాలుగు సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించడానికి రూ.కోటి చొప్పున నిధులు మంజూరయ్యాయి. అందులో భాగంగా రాకాసిపేట్‌లోని పాత భవనాన్ని కూల్చి బాలికల కళాశాల స్థాయి భవనం నిర్మించారు. మిగిలిన రెండు ప్రీమెట్రిక్‌, ఒక కళాశాల వసతిగృహాలకు మాత్రం స్థలాభావం ఏర్పడింది. నిధులు వెనక్కి వెళతాయన్న కారణంతో శక్కర్‌నగర్‌లోని నిజాం షుగర్స్‌కు చెందిన స్థలాలను ఎంపిక చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. 2014లో అందుబాటులోకి వచ్చిన మూడు భవనాల్లో ప్రస్తుతం 360 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

నిజాం షుగర్స్‌ ఉన్నతాధికారుల చర్య

తాజాగా ఈ స్థలంపై నిజాం షుగర్స్‌ యాజమాన్యం అధికారులు ఆరా తీశారు. పరిశ్రమ ప్రైవేటీకరణ సమయంలో కొన్ని భూములు పాత యాజమాన్యం అధీనంలోనే ఉన్నాయి. పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న కర్మాగారం వ్యవహారాలను ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా వసతిగృహాలకు సంబంధించిన భూమి విషయంలో ఆరా తీశారు. వాటికి కేటాయింపులు జరపలేదని గుర్తించి ఆక్రమణగా పరిగణించారు. ఈ మూడు నిర్మాణాలు 1.3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి నుంచి సంక్షేమశాఖకు, అక్కడి నుంచి జిల్లాకు, వసతిగృహాలకు లేఖ వచ్చింది. ప్రభుత్వ భవనాలనే అనధికారిక నిర్మాణాలుగా పేర్కొంటూ మార్కెట్‌ ధర చెల్లించాలని నోటీసు జారీ చేయడంపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.