close

బుధవారం, జనవరి 23, 2019

తాజా వార్తలు

దిక్కెవరు..? 

వైద్య సేవల్లో నిర్లక్ష్యంతో పేద గర్భిణులకు ప్రాణసంకటం 
బాధ్యులను కాపాడేవారే తప్ప చర్యలు శూన్యం 
విజయవాడ పాతాసుపత్రిలో పరిస్థితి దారుణం 

దిక్కెవరు..? 

ఈనాడు, అమరావతి : సర్కారు వైద్యశాలల కోసం ప్రభుత్వం రూ.కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అధునాతన వసతులను కల్పిస్తోంది. విజయవాడ పాత, కొత్తాసుపత్రుల్లో సౌకర్యాలు, భవనాల కోసమే గత మూడేళ్లలో ప్రభుత్వం రూ.200 కోట్ల వరకూ నిధులను వెచ్చించింది. నెలవారీ మందులు, సౌకర్యాలు, వైద్య సిబ్బంది జీతాల కోసం రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నారు. సాధారణ ప్రైవేటు ఆసుపత్రులతో పోలిస్తే.. ఈ రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు వెచ్చించే నిధులు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయి. కానీ.. ఇప్పటికీ ప్రభుత్వ వైద్యశాల అంటే చిన్నచూపే. అందుకే.. ఓ మోస్తరు సంపాదన ఉన్న వారెవరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.
దీనికి ప్రధాన కారణం.. వైద్య సిబ్బంది సరిగా పట్టించుకోరని, నిర్లక్ష్యంగా సేవలు అందించడంతో పాటూ వచ్చే రోగులను అగౌరవ పరిచేలా మాట్లాడడం, చిన్నచూపు చూడడం చేస్తుంటారనేది ఎక్కువ మంది నుంచి వచ్చే ఫిర్యాదు. ఈ భావనను పోగొట్టి.. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం వందల కోట్ల   రూపాయలు వెచ్చిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఆసుపత్రిలో రూ.లక్షల జీతాలు తీసుకుంటూ పనిచేసే కొందరు వైద్య సిబ్బంది తీరే దీనికి ప్రధాన కారణం. కొద్ది మంది వైద్యులు మాత్రమే నిబద్ధతతో పనిచేస్తున్నారు.ఆసుపత్రులకు వచ్చే రోగులకు సవాలక్ష సందేహాలుంటాయి. వాటన్నింటినీ వైద్యులతో చెప్పుకుని ఉపశమనం పొందాలని ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ.. వారు అడిగే ఏ సందేహానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఈ వైద్యులు సమాధానం ఇవ్వరు. ఏదడిగినా.. ఆ అంతేలే.. వెళ్లు, పో.. అంటూ కసరుకునే రకాలే ఇక్కడ ఎక్కువ. దీనికితోడు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి వైద్యం అందించినా.. తమను అడిగే వారెవరులే అనే దీమా వీరిలో ఎక్కువ ఉంటోంది. వైద్యంలో పొరపాట్లు జరిగి రోగుల ప్రాణాలపైకి వస్తున్నా.. కనీసం స్పందించే వ్యవస్థ కూడా లేకపోవడమూ వైద్యుల లెక్కలేని తనానికి ఓ కారణమే.

విజయవాడ ప్రభుత్వ పాతాసుపత్రిలో అందించే వైద్య చికిత్సలపై ఇటీవల విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. వచ్చే రోగులకు నాణ్యమైన సేవలు అందించడంలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి. తాజాగా గుడివాడకు చెందిన చిట్టెమ్మ అనే మహిళ ప్రసవం కోసం వస్తే వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసి.. గర్భసంచిని కూడా తొలగించిన తర్వాత ఇక్కడ కాదంటూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేశారు. ఆమె కిడ్నీలు ఫెయిలైపోవడంతో డయాలసిస్‌ అందించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై రెండు రోజులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. శనివారం అర్ధరాత్రి ఆమె గుంటూరు జీజీహెచ్‌లో కన్నుమూసింది. ఈ ఘటన పాతాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యాన్ని మరోసారి ఎత్తి చూపింది. ఆసుపత్రికి వచ్చే రోగుల విషయంలో వైద్యులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. జిల్లా అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్టయినా ఉండటం లేదు. ఇక్కడి వైద్యులు అత్యంత నిర్లక్ష్యంగా సేవలు అందించడం వల్ల ప్రాణాలు పోతున్నా.. వారిపై చర్యలు ఉండటం లేదు. దీంతో ఏది చేసినా తమను కాపాడే వాళ్లున్నారులే అనే దీమా వైద్యుల్లో ఉంటోంది. ఆసుపత్రిలో గత రెండు మూడు నెలలుగా ఇప్పటివరకూ ఎన్నో సంఘటనలు జరిగినా.. ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కేవలం విచారణ కమిటీలను వేసి తమ పనైపోయిందన్నట్టుగా ఉన్నతాధికారులు సైతం వ్యవహరిస్తున్నారు.

మరికొన్ని ఘటనలివీ... 
* గుణదలకు చెందిన పార్వతి ప్రసవం కోసం వస్తే.. సిజేరియన్‌ చేయగా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత ఒకేసారి ఇద్దరు బిడ్డలు పుట్టారు. పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు సైతం తెలిపారు. అయితే.. అకస్మాత్తుగా మరుసటి రోజే పిల్లలు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, ఇంక్యుబేటర్‌లో పెట్టి వైద్యం అందించాలంటూ తాము వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదని తల్లిదండ్రులు గుండెలు బాదుకుని విలపించారు. తల్లిపాలు చాలకపోవడంతో పోతపాలు పట్టుకోవచ్చని వైద్యులే తెలిపారని, తర్వాత అదే బిడ్డలకు ముప్పు వాటిల్లేలా చేసిందంటూ వాపోయారు. పోత పాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ అయిందంటూ తేల్చేసి చేతులు దులుపేసుకున్నారు. దీంతో ఒకరోజంతా ఆసుపత్రి ఎదుట బాధిత తల్లిదండ్రులు బైఠాయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. అయినా.. ఎవరికీ పట్టలేదు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్‌ విజయకృష్ణన్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ లక్ష్మీకాంతం ప్రకటించారు. కానీ.. ఇంతవరకూ దీనిపై ఏం నివేదిక వచ్చిందనేది బహిర్గతం చేయలేదు.

* కృష్ణా జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన కళ్యాణి ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా.. ఐదు రోజులు ఆమెను పట్టించుకున్న వారు లేరు. కళ్యాణికి కడుపులో ఇబ్బందిగా ఉందంటూ చెప్పడంతో ఆమె బంధువులు రాత్రి వేళ వైద్యులను వేడుకున్నా.. ఏం పర్వాలేదులే అలాగే ఉంటుందంటూ పట్టించుకోలేదు. మరుసటి రోజు వైద్యులు వచ్చే సమయానికి పరిస్థితి విషమించింది. దీంతో హడావుడిగా ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లి సిజేరియన్‌ చేశారు. మగబిడ్డ పుట్టాడని, బాగానే ఉన్నాడని చెప్పారు. తల్లికి, బంధువులకు బిడ్డను చూపించలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇంక్యుబేటర్‌లో ఉన్నాడంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. బిడ్డను చూపించాలని బంధువులు ఆందోళన చేయడంతో ముట్టుకోకుండా చూడాలంటూ ఇంక్యుబేషన్‌లో చూపించారు. కదలికలు లేవని అంటే అలాగే ఉంటుందని కసరుకున్నారు. తీరా చూస్తే అరగంట తర్వాత బిడ్డ చనిపోయాడని చల్లగా కబురు చెప్పారు. దీంతో ఆ తల్లి, బంధువుల రోదనలు, ఆందోళనతో ఆసుపత్రి ప్రాంగణం విషాదంలో మునిగింది. కానీ దీనికి బాధ్యులైన వారిపై కనీస చర్యలూ లేవు.

* విజయవాడకు చెందిన ఓ బాలింత హెచ్‌ఐవీతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా ఆమెను ఇక్కడి సిబ్బంది కనీసం పట్టించుకోకుండా దారుణంగా తిడుతూ అవమానించారు. చాలా రోజులుగా ఇలాగే చేయడంతో ఓ కార్యక్రమానికి ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్‌కు ఆ మహిళ నేరుగా ఫిర్యాదు చేసింది. తన దగ్గర నిత్యం రూ.200 తీసుకుంటున్నారని, ఓ మహిళా వైద్యురాలు తనను దారుణంగా అవమానించేలా మాట్లాడిందని ఆ మహిళ తెలిపింది. అయితే బాధ్యులపై ఇంతవరకూ చర్యలు లేవు.

* కొద్దిరోజుల కిందట క్రోసూరు మండలం తాళ్లూరుకు చెందిన పావని అనే గర్భిణిని ఆసుపత్రిలో చేర్పించారు. పావనికి రక్తం ఎక్కించే సమయంలో వేరే గ్రూపును ఎక్కించడంతో ఆమె శరీరం మొత్తం రంగు మారిపోయి చనిపోయిందని బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో రాజీ కుదుర్చుకోవడంతో విషయం బయటకు రాకుండా బాధితులను ఆసుపత్రి నుంచి అర్ధరాత్రి పంపించేశారు. అప్పటివరకూ మృతదేహాన్ని ఆసుపత్రిలో ఉంచిన పావని బంధువులు సైతం ఫొటోలు తీయొద్దంటూ మీడియాను వారిస్తూ.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.

చిట్టెమ్మ పరిస్థితి అత్యంత దారుణం.. 
పాతాసుపత్రిలో సేవలు అందించే కొందరు వైద్యుల తీరుపై తరచూ రోగులు, వారి బంధువుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయినా.. వారిపై సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటివరకూ ఒక్క వైద్యునిపై చర్యలు తీసుకున్నది లేదు. తాజాగా ప్రసవం కోసం వచ్చిన చిట్టెమ్మ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆమెకు సిజేరియన్‌ చేసి బిడ్డను తీసిన వైద్యులు.. వారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో శస్త్రచికిత్సను చేశారు. ప్రసవం కోసం వేళ్తే ఏకంగా గర్భసంచిని, యూరిన్‌ బ్లాడర్‌ను తొలగించారంటూ బంధువులు గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై విచారణ కోసం కమిటీని వేసి మళ్లీ చేతులు దులుపుకున్నారు. ఆ బృందం గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిట్టెమ్మను చూసేందుకు వెళితే.. ఆమె కనీసం మాట్లాడే పరిస్థితిలో లేకుండా వెంటిలేటర్‌పై ఉండడంతో చూసి వెనుదిరిగారు. చివరికి ప్రసవం కోసం వచ్చి చిట్టెమ్మ ప్రాణాలనే కోల్పోయింది. గుంటూరు ఆసుపత్రి వైద్యులు సైతం చిట్టెమ్మ ఆరోగ్య పరిస్థితి ఎందుకిలా అయ్యిందనే విషయంపై స్పష్టంగా ఏ విషయం చెప్పడం లేదు. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించామనే విషయం మాత్రమే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కమిటీ దర్యాప్తు నివేదిక ఎలా పారదర్శకంగా వస్తుందనేది ప్రశ్నార్థకమే.

ఎన్నో అధునాతన వసతులున్నా.. 
విజయవాడ పాతాసుపత్రిలో ప్రభుత్వం ఎన్నో అధునాతన వసతులను అందుబాటులోకి తెచ్చింది. గర్భిణులు, బాలింతలు సేద దీరేందుకు ఆధునిక మంచాలతో కూడిన గదులు, పుట్టిన బిడ్డలు సురక్షితంగా ఉండేందుకు ఖరీదైన కిట్లు, మందులు.. ఇలా అన్నీ సమకూరుస్తోంది. ఏ ప్రైవేటు ఆసుపత్రిలోనైనా ఒకటీ రెండు ఇంక్యుబేటర్‌లే ఉంటాయి. కానీ.. పాతాసుపత్రిలో చాలా అందుబాటులో ఉన్నాయి. రోగులకు ఎంతో నాణ్యమైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని వైద్య పరికరాలూ సిద్ధంగా ఉన్నాయి. అయితే.. ఎన్ని ఉన్నా వైద్యుల్లో నిబద్ధత లేకుంటే.. రోగులకు సరైన వైద్యం అందదు. ఇక్కడే ఇదే జరుగుతోంది. చాలామంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో కంటే తాము ప్రైవేటుగా నిర్వహించే సొంత ఆసుపత్రులపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక్కడి కంటే అక్కడే ఎక్కువ సమయం ఉంటున్నారనే ఫిర్యాదులున్నాయి. తమ సొంత క్లినిక్‌లలో రూ.వేలల్లో ఫీజులు వసూలు చేసే వైద్యులకు.. ఉచితంగా సేవలు అందించడమంటే కొంచెం కష్టమే. అందుకే ప్రభుత్వమే దీనిపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఏ వైద్యుడు ఎప్పుడొస్తున్నాడు.. ఎప్పుడెళుతున్నాడనేది పక్కాగా పర్యవేక్షిస్తే.. రూ.కోట్లలో ప్రభుత్వం చేస్తున్న ప్రజాధనం వినియోగానికి ఓ అర్థం చేకూరుతుంది. సామాన్యులకూ కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు వీలు కలుగుతుంది.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.