close

బుధవారం, ఆగస్టు 21, 2019

తాజా వార్తలు

అయ్యో.. గున్న ఏనుగు!

విద్యుదాఘాతంతో మృతి
పలమనేరులో ఏడాదిన్నరలో రెండో దుర్ఘటన

పలమనేరు, న్యూస్‌టుడే: పలమనేరు పరిధిలోని గొబ్బిళ్లకోటూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున విద్యుదాఘాతానికి గురై గున్న ఏనుగు మృతిచెందింది. ఏడాదిన్నర కాలంలో ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం రెండోది కావడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలను తొండంతో లాగిన మూడేళ్ల గున్న ఏనుగు అక్కడికక్కడే మృత్యువాతపడింది. వ్యవసాయ పొలంలోకి చొరబడిన ఎనిమిది ఏనుగుల గుంపు ఆదివారం తెల్లవారుజామున వెనుదిరిగి అడవిలోకి వెళ్లే సమయంలో చిన్నమట్టి దిబ్బ మీదకు ఎక్కినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్‌ తీగలు ఏనుగు తొండానికి అందటంతో వాటిని లాగుతూ ప్రాణాలు విడిచింది. అన్ని ఏనుగులు మందగమనంతో అడవిలోకి వెళుతూంటే   గున్న మాత్రం కనిపించినవాటిని లాగుతూ ముందుకు కదలడమే ప్రాణం తీసింది. పట్టణానికి అత్యంత సమీపంలోని బేరుపల్లెలో గత ఏడాది మేలో ఇదే విధంగా నాలుగేళ్ల గున్న ఏనుగు తొండంతో విద్యుత్‌ తీగలను లాగి విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. అది కూడా ఈ ఏనుగుల బృందంలోనిదే కావడం గమనార్హం. 
కందకాలు పూర్తి కాక...
అడవి నుంచి గ్రామంలోకి వచ్చే దారిలో అటవీశాఖ అధికారులు కందకాలను తవ్వారు. మున్సిపల్‌ కంపోస్టు యార్డు సమీపంలో కందకాలకు అడ్డుగా బండ రావడంతో తవ్వకాలను నిలిపేశారు. ఏనుగులు ఆ ప్రాంతం నుంచి పొలాల్లోకి వస్తున్నాయి. అలా వచ్చిన ఈ గుంపులోని మూడేళ్ల గున్న ఇలా మృత్యువాత పడింది. 
గున్నను వదలని తల్లి
గున్న ఏనుగు కుప్పకూలిపోయి చనిపోగా తల్లి ఏనుగు మాత్రం దానిని చాలాసేపు వదలలేదు. అక్కడే నిలుచొని లేపడానికి ప్రయత్నించింది. తన బిడ్డ చనిపోయిందని తెలియక తొండంతో పైకెత్తడానికి ఎంతో ప్రయత్నించింది. చనిపోయిన గున్న చుట్టూ తిరగటమే కాకుండా చుట్టుపక్కల పరిసరాలను కూడా గమనిస్తూ కనిపించింది. పరిసరాల్లోకి పెద్దసంఖ్యలో మనుషులు వస్తున్నా తల్లి ఏనుగు మాత్రం అక్కడి నుంచి చాలాసేపు కదల్లేదు. గుంపులోని ఏనుగులు కూడా అక్కడే కొంతసేపు తచ్చాడాయి. ఈ దృశ్యాన్ని చూసిన వారికి అక్కడ ఏనుగు ఉందనిపించలేదు. బిడ్డను కోల్పోయిన తల్లిని చూసినట్లు చలించిపోయారు. కొంతసేపటికి చనిపోయిన గున్నను చూడటానికి పట్టణవాసులు పెద్దఎత్తున అక్కడకు చేరడాన్ని గమనించిన తల్లి ఏనుగుతో పాటు గుంపులోని ఇతర ఏనుగులు మెల్లగా వెనుదిరిగాయి. ఏనుగు మృత కళేబరానికి తిరుపతి జంతుప్రదర్శనశాల నుంచి వచ్చిన పశువైద్య నిపుణులు తొయిబాసింగ్‌ నేతృత్వంలో పరీక్షలను నిర్వహించిన అటవీశాఖ అధికారులు సమీపంలోని అడవిలో గొయ్యి తవ్వి పూడ్చివేశారు. 

కందకం తవ్వకాలను పూర్తి చేస్తాం
ఏనుగు మృతకళేబరాన్ని డీఎఫ్‌వో సునీల్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగులు అడవి నుంచి పొలాల వైపు రాకుండా చేపట్టిన కందకం పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. బండలు రావడంతో కందకం పనులకు అంతరాయం కలిగిందని చెప్పారు. వాటిని త్వరలోనే పూర్తి చేసి అడవిలోనే ఏనుగులకు అవసరమైన పళ్లు, ఆహారం లభించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అడవి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల వలన ఎప్పటికైనా ప్రమాదమేనని..  సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.