అలసట..నిద్రలేమి..అతివేగం.. - East%20Godavari - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

అలసట..నిద్రలేమి..అతివేగం..

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్‌


శోకసంద్రంలో మట్టపర్తి ఏడుకొండలు కుటుంబ సభ్యులు 

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: కొత్త వాహనంపై దేవాలయాలు తిరిగొద్దామని బయలుదేరిన బృందం దర్శనాలు పూర్తిచేసుకొని ఇళ్లకు వెళ్తూ ప్రమాదంలో చిక్కుకుంది. ఈ బృందంలోని 11 మందిలో ముగ్గురు మృతి చెందగా మిగిలిన వారంతా ఆసుపత్రి పాలయ్యారు. వీరంతా కోనసీమకు చెందిన వారే. ప్రయాణ బడలిక, నిద్రలేమి, అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో కొత్త వాహనం ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన చెల్లుబోయిన సత్యనారాయణ(46), చెల్లుబోయిన మరిడయ్య(36). పి.గన్నవరం మండలం గాజులకుంటకు చెందిన మట్టపర్తి ఏడుకొండలు(42) మృతి చెందారు. మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన బొంతు సత్యశ్రీనివాసరావు, కేదాల సత్యనారాయణ, వేండ్ర పరమేశు, చెల్లుబోయిన శివప్రసాద్‌, చెల్లుబోయిన వెంకటేశ్వర్లు, యాండ్ర హరికృష్ణ, డ్రైవరు రాపాక శ్యాంబాబు, రాజోలు మండలం చింతలపల్లికి చెందిన లంక కృష్ణ గాయపడ్డారు. వీరందరినీ ప్రత్తిపాడు సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కాకినాడ తరలించారు. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రత్తిపాడు సీఐ సన్యాసిరావు, ఎస్సై రవికుమార్‌, పోలీసులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

కొత్తవాహనంలో సందడిగా వెళ్లొస్తూ..

మట్టపర్రుకు చెందిన బొంతు సత్య శ్రీనివాసరావు గ్రామంలో టెంటు హౌస్‌ నడుపుతున్నారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేశారు. తన మిత్రులందరితో కలిసి శనివారం సాయంత్రం అన్నవరం వచ్చారు. ఆదివారం ఉదయం తలుపులమ్మలోవకి వచ్చారు. అక్కడ ఉల్లాసంగా గడిపారు. అంతా సాయంత్రం బయల్దేరి ఇళ్లకు వెళ్దామనుకున్నారు. ఒకరికి ఫోన్‌ రావడంతో భోజనాలైన వెంటనే బయలు దేరారు. ధర్మవరం వచ్చేసరికి ఏమైందో తెలీలేదని, తీరా తేరుకునేసరికి ప్రమాదంలో చిక్కుకున్నామని వాహన చోదకుడు శ్యాంబాబు ఆవేదనగా చెప్పాడు. వాహనం ముందుభాగం నుజ్జవ్వగా వాహనంలో వెనుక కూర్చున్న వారిలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన షాక్‌లోనే మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితులను వారి బంధువులు వచ్చేటప్పటికే పోలీసులు ప్రత్తిపాడు నుంచి కాకినాడ తరలించారు. ఆసుపత్రిలో ఎనిమిది మంది క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురికి చేతులు, కాళ్లకు గట్టిదెబ్బలే తగిలాయి. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐ సన్యాసిరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మట్టపర్రులో అలముకున్న విషాదం

మలికిపురం: ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మలికిపురం మండలం మట్టపర్రుకు చెందిన చెల్లుబోయిన మరిడయ్య, చెల్లుబోయిన వీరవెంకటసత్యనారాయణ, పి.గన్నవరం మండలం గాజులకుంటకు చెందిన మట్టపర్తి ఏడుకొండలు మృతి చెందడంతో మట్టపర్రులో విషాద ఛాయలు అలముకున్నాయి. కొత్త ఏస్‌ వాహనం కొనుక్కున్న సందర్భంగా లోవ అమ్మవారి గుడికి వెళ్లి గ్రామానికి తిరిగి వస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరిడయ్య ఆటో నడుపుతుంటారు. ఆయన భార్య అరుణ, కుమారుడు రామకృష్ణ గల్ఫ్‌లో ఉండగా, కుమార్తె బాలదుర్గకు వివాహమైనా ప్రస్తుతం ఇక్కడే ఉంటోంది. వీరవెంకటసత్యనారాయణ భార్య నాగవేణి, కుమారుడు వెంకన్నబాబు గల్ఫ్‌లో ఉంటుండగా, వారి కుమార్తె వివాహమై అత్తవారింట్లో ఉంటోంది. ఏడుకొండలు తన ఇద్దరు కుమార్తెలతో మట్టపర్రులోని అత్తారింటికి వచ్చారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే తండ్రికి ఏమైందోనన్న ఆందోళనతో అమ్మమ్మ ఇంటి వద్దనున్న కుమార్తెలు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. గ్రామస్థులు కొందరు వెంటనే ఘటనా స్థలికి, కాకినాడ ఆసుపత్రికి వెళ్లారు. మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ప్రత్తిపాడు ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స 

ధర్మవరం వద్ద ప్రమాదానికి గురైన వాహనం

 

గాయపడిన డ్రైవరు శ్యాంబాబు, మరో వ్యక్తి

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.