ఆటు పోట్లు... ఆశల ఊసులు... - Prakasam - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

తాజా వార్తలు

ఆటు పోట్లు... ఆశల ఊసులు...

 చివరి దశకు చేరిన పొగాకు కొనుగోళ్లు

 పెరగనున్న బ్యారన్‌ కౌలు

పంట అనుమతిపై నేడు బోర్డు సమావేశం

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలోని వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు చివరి అంకానికి చేరాయి. గత రెండు నెలలుగా మార్కెట్లో మేలిమి రకం గ్రేడులకు ఆశాజనకమైన ధరలు లభించాయి. దీంతో ఈ ఏడాది జిల్లాలో పొగాకు సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రత్యామ్నాయ పంటగా పేరొందిన శనగకు గత రెండేళ్లుగా మార్కెట్లో సంక్షోభం నెలకొంది. దీంతో రైతులు పొగాకు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. రైతుల మధ్య పోటీ వాతావరణంతో గత ఏడాదితో పోలిస్తే ఈసారి బ్యారన్‌ కౌలు ధర మరింత పెరగనుంది. రానున్న ఆంధ్రా సీజన్‌ కింద పంట ఉత్పత్తి ఖరారుపై గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం బోర్డు సర్వసభ్య సమావేశం జరగనుంది. రానున్న సీజన్‌కు ఎన్ని మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలన్నది ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. దాని ఆధారంగా వచ్చే నెలలో బ్యారన్‌ లైసెన్సులను పునరుద్ధరించనున్నారు.

జిల్లాలో 76 మిలియన్‌ కిలోల అమ్మకాలు

జిల్లాలో రెండు రోజుల నుంచి అనధికారిక పంట అమ్మకాలు జరుగుతుండగా, ఇప్పటి వరకు 76 మిలియన్‌ కిలోల విక్రయాలు పూర్తయ్యాయి. దక్షిణాది నల్లరేగడి నేలలు, దక్షిణాది తేలిక నేలల ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ప్రకాశంలోని పది వేలం కేంద్రాలతో పాటు, నెల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. వాటి కింద 2018-19 పంట కాలానికి 84.61 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. వర్షాభావ పరిస్థితుల వల్ల సుమారు 81 మిలియన్‌ కిలోల పంట రాగలదని బోర్డు అధికారుల అంచనా. గత ఏడాదిలాగే వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గాయి. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లోని ఆరు వేలం కేంద్రాలకు ఈ ఏడాది 44.25 మిలియన్‌ కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు 40 మిలియన్‌ కిలోల అమ్మకాలు జరిగాయి. ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌ పరిధి కింద ఆరు వేలం కేంద్రాల్లో 40.36 మిలియన్‌ కిలోల పంటకు అనుమతి ఇవ్వగా, 36 మిలియన్‌ కిలోల అమ్మకాలు జరిగాయి.

మేలిమికి మార్కెట్‌లో గిరాకీ

అంతర్జాతీయ మార్కెట్‌లో మేలిమి రకానికి డిమాండ్‌ పెరగడంతో దాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. రెండు నెలలుగా ఎఫ్‌-1, ఎఫ్‌-2 రకాలకు ఆశాజనకమైన ధరలు లభించాయి. ఈ సీజన్‌లో ఒంగోలు రెండో వేలం కేంద్రంలో అత్యధికంగా కిలో రూ.218 చొప్పున పలికింది. వర్షాభావం నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు ఖర్చు పెరిగింది. నల్లరేగడి నేలల పరిధిలో ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది క్వింటాళ్ల పంట ఉత్పత్తి కాగా, తేలిక నేలల పరిధిలో మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తోటలకు నీళ్లు కట్టినా ఎదుగుదలలో మార్పు లేదు. మరోవైపు మల్లె, ఆకుముడత వంటి తెగుళ్లు పంటను కొంత దెబ్బతీశాయి. సగటున ఎకరానికి రెండు క్వింటాళ్ల దిగుబడి తగ్గగా.. నీటితడి అందించడంతో నాణ్యత లోపించింది. వేలం ప్రారంభం నుంచే లో గ్రేడు రకాన్ని కిలో రూ.100కు తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. అయినా ఎక్కువ శాతం లోగ్రేడు పొగాకు ధర రూ.70 నుంచి రూ.75 మధ్యనే పలికింది.

బ్యారన్లకు పెరిగిన డిమాండ్‌

జిల్లాలో మార్చి 22న ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని ఆరు వేలం కేంద్రాల్లో; 27న ఎస్‌బీఎస్‌ పరిధిలోని ఆరు వేలం కేంద్రాల్లో అమ్మకాలు ప్రారంభించారు. కనిగిరి వేలం కేంద్రంలో ఇప్పటికే అమ్మకాలు పూర్తి కాగా, మిగతా కేంద్రాల్లో సోమవారం నుంచి అనధికారిక పంట అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు లోపు కొనుగోళ్లు పూర్తి చేసేందుకు బోర్డు అధికారులు ప్రణాళిక చేశారు. శనగ సాగు చేసిన రైతులకు పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఎక్కువ శాతం రైతులకు ఈ ఏడాది పొగాకు అమ్మకాల ద్వారానే కాస్త ఆదాయం వచ్చింది. దీంతో రానున్న సీజన్‌కు కూడా పొగాకుపైనే రైతులు దృష్టి సారించారు. ఇంకా పంట అమ్మకాలు పూర్తి కాకున్నా బ్యారన్లను కౌలుకు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. బ్యారన్‌ కౌలు గత ఏడాది రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు పలికింది. గ్రామాల్లో నెలకొన్న పోటీ దృష్ట్యా కందుకూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రానున్న సీజన్‌కు ఈ ధర రూ.80 వేల వరకు పలుకుతోంది. మిగతా ప్రాంతాల్లో రూ.50- రూ.70 వేల వరకు నడుస్తోంది.

రైతుల డిమాండ్లు నెరవేరేనా?

2019-20 ఆంధ్రా సీజన్‌కు సంబంధించి పంట ఉత్పత్తి అనుమతిని నిర్ణయించేందుకు గుంటూరులోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సమావేశం జరగనుంది. జిల్లాలో ప్రధాన పంట పొగాకు. సుమారు 30 వేల మంది రైతులు దీనిపై ఆధారపడి ఉన్నారు. గత ఏడాది జిల్లాలోని ఎస్‌బీఎస్‌ ప్రాంత రైతులకు బ్యారన్‌కు 1.60 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు, 34.60 క్వింటాళ్ల అమ్మకానికి; ఎస్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో 2.60 విస్తీర్ణంలో సాగు, 35 క్వింటాళ్ల పొగాకు అమ్మకానికి అనుమతి ఇచ్చారు. వచ్చే సీజన్‌కు పంట సాగు పెంచేందుకు రైతు సమాయత్తమవుతున్న తరుణంలో అనుమతి పెంచుతారా, గత ఏడాది లాగే ఇస్తారా? తేలాల్సి ఉంది. అనుమతి ఇచ్చేటప్పుడే కనీస ధర ప్రకటించాలని, పంటను స్వచ్ఛందంగా విరమించేందుకు బ్యారన్‌కు పరిహారం కింద రూ.10 లక్షల చొప్పున చెల్లించేలా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడంతో పాటు, బ్యారన్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ అయిదేళ్లకోసారి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నవి రైతుల ప్రధాన డిమాండ్లు. ఈ విషయాన్ని ఇప్పటికే బోర్డు ఛైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై బోర్డు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనని రైతులు వేచి చూస్తున్నారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.