పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా - Kurnool - EENADU
close

గురువారం, సెప్టెంబర్ 19, 2019

తాజా వార్తలు

పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా

ఓజీ కుప్పం ముఠా నుంచి రూ.1.35 లక్షలు స్వాధీనం

అరెస్టు చేసిన అంతర్రాష్ట్ర దొంగలను చూపుతున్న

డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ నాగరాజుయాదవ్‌, ఎస్సై చిరంజీవి

గడివేముల, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలముఠాను నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండు వద్ద బుధవారం అరెస్ట్‌ చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. గడివేముల పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గడివేములలో జులై 20న బిలకలగూడూరుకు చెందిన శివయ్య రూ.90 వేల నగదును ద్విచక్రవాహనంలోని వెనుక భాగాన ఉన్న కవర్‌లో పెట్టుకుని తహసీల్దారు కార్యాలయం వద్దకు వెళ్తుండగా దోపిడీ జరిగింది. సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఓజీ కుప్పం ముఠా ఈ పనికి పూనుకున్నట్లు తెలిసిందన్నారు. బాధితునికి తెలియకుండా ద్విచక్రవాహనం నుంచి నగదు కాజేశారని తెలిపారు. ఇదే విధంగా బేతంచెర్ల, బనగానపల్లె, అనంతపురం జిల్లా చిలమత్తూరులో ద్విచక్రవాహనదారులను ఏమార్చి నగదు, బంగారం దోచుకున్నారని తెలిపారు. ఈ ముఠాకు చెందిన కుంచెల హరికృష్ణ, కుంచెల సెంథిల్‌కుమార్‌, కుంచెల దీపను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వారి నుంచి గడివేముల, బేతంచెర్లలో దోచుకున్న రూ.1.35 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చికి చెందిన వెంకటేష్‌ పరారీలో ఉన్నారని తెలిపారు. దొంగల నుంచి బంగారం తీసుకున్న ఓజీ కుప్పంకు చెందిన మరో మహిళ పరారీలో ఉందన్నారు. జిల్లాలో ఓజీ కుప్పం ముఠాను మొదటిసారి అరెస్ట్‌ చేశామని తెలిపారు. కుంచెల హరికృష్ణపై రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా నాయుడుపేట, తమిళనాడులోని తిరుచ్చి, అరక్కోణం, బెంగళూరులో కేసులు ఉన్నాయన్నారు. కుంచెల సెంథిల్‌పై తిరుపతి, కాణిపాకం, విజయవాడ, రేణిగుంటలో కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ముఠా బ్యాంకులు, ఖజానా కార్యాలయాలు, తహసీల్దారు కార్యాలయాల వద్ద మాటువేసి కార్లు, ద్విచక్రవాహనాలలో నగదు, బంగారం తీసుకెళ్లేవారి ముందు డబ్బులు వేసి ఏమార్చి దోపిడీ చేసేవారని తెలిపారు. వారు దోచిన సొమ్మును దీపకు ఇచ్చేవారని ఆమె బంగారాన్ని నగదుగా, నగదును బంగారంగా మార్చేదని తెలిపారు. ప్రజలు నగదు, బంగారం తీసుకపోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. దుకాణాలు, కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఓజీ కుప్పం ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ నాగరాజుయాదవ్‌, ఎస్సై చిరంజీవి, కానిస్టేబుళ్లు నాగార్జున, శివలింగంలను ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ నాగార్జునకు నగదు రివార్డు అందించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.