ఆశల వరి రైతు ఇంట సిరి - Kurnool - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

తాజా వార్తలు

ఆశల వరి రైతు ఇంట సిరి

 జిల్లాలో జోరుగా వరి నాట్లు

సాగు విస్తీర్ణం లక్ష హెక్టార్లు దాటుతుందని అంచనా

వరి నాట్లు వేస్తున్న కూలీలు

కృష్ణా పరవళ్లు ఆయకట్టు రైతుల్లో ఆశలు నింపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి సాగు చేయాలా వద్ద అని ఊగిసలాడిన రైతులు వరద జలాలు జలాశయాలకు చేరుతుండటంతో వరి నాట్లు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు. మరి కొందరు విత్తనాలు చల్లే పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాలో ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

న్యూస్‌టుడే, ఆత్మకూరు: జిల్లాలో ఖరీఫ్‌ వరి సాగు పనులు ముమ్మురంగా సాగుతున్నాయి. మొన్నటిదాకా 5 వేల హెక్టార్లు దాటని సాగు రెండు మూడు రోజుల్లో రెట్టింపైంది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువగా సాగవుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 2019 ఖరీఫ్‌ వరి సాధారణ సాగు విస్తీర్ణం 73,120 హెక్టార్లు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వరద జలాలు జలాశయాల్లోకి చేరుతుండటంతో సాగు ఊపందుకుంది. లక్ష హెక్టార్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 19 వ తేదీ నాటికి 11,055 హెక్టార్లలో సాగైంది.

నీరుంటేనే మేలైన దిగుబడి - శివశంకర్‌నాయక్‌, సంజీవనగర్‌తండా

ఏటా వర్షాభావ పరిస్థితులు రైతులను దెబ్బతీస్తున్నాయి. గత ఏడాది వరద నీటితో వెలుగోడు జలాశయం నిండినా రబీ వరకు నీటిని ఎత్తిపోయలేదు. చివర్లో కొంత నీటినే ఎత్తపోయడంతో చాలామంది రైతుల పొలాలకు నీరందక పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఏడాది వరద జలాలు జలాశయంలోకి చేరాయి. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ఇప్పుడు అప్పుడు అంటున్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు నీరుంటేనే పంటలకు మేలైన దిగుబడి వస్తుంది.

సస్య రక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ - సాలురెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు

రైతులు ముఖ్యంగా 21 దినాల వయస్సున్న నారు నాటాలి. కొసలు తుంచి నాటాలి, నారుమడిలోనే కలుపు, పురుగు మందుల యాజమాన్య పద్ధతులు పాటించాలి. నాటే ముందు, కాలిబాటలు రెండు మీటర్లకు ఒక అడుగు కాలిబాట వదలాలి. ఎరువులు మోతాదుకు మించి వేయరాదు. నత్రజని భాస్వరం, పోటాషియం, ఎకరాకు 4 బస్తాల యూరియా, ఒకటిన్నర బస్తా డీఏపీ, ఒక బస్తా పొటాష్‌ వేసుకోవాలి. యూరియా మూడు దఫాలుగా వేసుకోవాలి. వేపపూత యూరియా నిదానంగా మొక్కకు అందుతుంది కాబట్టి ఎక్కువగా వేయవద్ధు జింక్‌ గత రెండు పంటలకు వేయనివాళ్లు ఈ పంటకు దమ్ములోనే జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. కాంప్లెక్స్‌ ఎరువులు పైపాటుగా వేయవద్ధు పొట్టదశలో యూరియా పొటాష్‌ వేసుకోవాలి.

జలాశయాలకు వరద జలాలు

కృష్ణా, తుంగభద్రలు పరవళ్లు తొక్కడంతో జలాశయాలకు నీటి విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో కొన్ని ప్రధాన జలాశయాల్లో 20 తేది సాయంత్రం నాటికి నీటి నిల్వల వివరాలు ఇలా ఉన్నాయి.

కరవును దాటి కర్షక పయనం

అడపా దడపా వర్షాలతో పంటలు సాగు చేసిన రైతులు వరుణుడి కోసం వేచిచూస్తున్నారు. పశ్చిమాన కరవు ఛాయలు నిండుకోగా ఆయకట్టు రైతులు సాగునీటి కోసం వెంపర్లాడుతున్నారు. నారుపోసి నీరు కోసం దేవుళ్లను ప్రార్థించారు. వర్షాలు కురవకున్నా ఎగువన వరద జలాలతో క్రమ క్రమంగా జలాశయాలకు నీరు చేరుతోంది. దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్న వరి రైతులు నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. చెరువులు, పంటకాల్వలు, బోరుబావుల కింద వరి సాగు చేస్తున్నారు. వరి వంగడాలను బట్టి నాలుగు నుంచి ఆరు నెలల కాలంలో పంట పూర్తవుతుంది. అంటే నవంబరు, డిసెంబరు నెలల్లో కోతకు వస్తుంది. ఇంకా 60-70 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆశల సేద్యం అచ్చిరావాలని ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.